బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha Debut In Tollywood) దక్షిణాది సినిమా మీద తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని పలు సందర్భాల్లో చాటుకుంది.
మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల గురించిన ప్రస్తావన ఆమె వద్ద ఎప్పుడొచ్చినా, ‘నాకూ చెయ్యాలని వుందిగానీ..’ అని ఒకింత నిట్టూరుస్తుంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ప్రభాస్, మహేష్‌బాబు.. ఇలా పలువురు టాలీవుడ్ హీరోల సరసన హీరోయిన్.. అంటూ, సోనాక్షి సిన్హా పేరు పలు సందర్భాల్లో వినిపించిందిగానీ, అందులో ఏ ఒక్కటీ నిజమవలేదు.
‘వకీల్ సాబ్’ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్.. అని గుసగుసలు తొలుత వినిపించిన సంగతి తెలిసిందే.
‘నన్ను ఇంతలా తెలుగునాట గుర్తు చేసుకుంటున్నారంటే, నేను చాలా అదృష్టవంతురాలినే. ఖచ్చితంగా తెలుగు సినిమాల్లో నటిస్తా..’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది కూడా.
ఇక, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. అలాగే నందమూరి బాలకృష్ణ చేయబోయే తదుపరి సినిమాల్లో సోనాక్షి సిన్హానే హీరోయిన్.. అనే ప్రచారం కొత్తగా తెరపైకొచ్చింది.
ఈసారి మాత్రం సోనాక్షి సిన్హా నుంచి ఖండన ప్రకటన రాలేదు. దాంతో, ఈసారి ఈ గాసిప్స్ నిజమయ్యే అవకాశాలున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ వర్గాల్లో.
సోనాక్షి సిన్హా(Sonakshi Sinha Debut In Tollywood) తన తండ్రి వయసున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘లింగా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.