16 భాషల్లో.. 40 వేలకు పైగా పాటలు పాడటమంటే ఆషామాషీ వ్యవహారమా.? ఓ సూపర్ హిట్ పాట పాడితే, నెత్తిన కొమ్ములొచ్చేస్తున్నాయి ఈ తరం గాయనీ గాయకులకి. మరి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. (SP Balasubrahmanyam True Legend) అదేనండీ మన ‘ఎస్పీ బాలు’కి ఇంకెన్ని కొమ్ములు వచ్చేసి వుండాలి.?
ఎంత ఎదిగినా ఒదిగి వుండటమే గొప్పతనం. ఆ గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాట ఎంత తీయగా వుంటుందో.. ఆయన మాట కూడా అంతే తీయగా వుంటుంది. తెరపై ఏదన్నా పాత్రలో ఆయన కన్పించినా, అంతే తీయగా వుంటుంది ఆయన నటన.
ఏ హీరోకి పాట పాడితే, ఆ హీరో వాయిస్‌లానే వుంటుంది.. అదే బాలులోని మరో ప్రత్యేకత. ఇంకే ఇతర గాయకుడికీ లేనంత ప్రత్యేకమైన ‘పాట తీరు’ ఎస్పీ బాలు సొంతం. సినీ పరిశ్రమలో ఆయన్ని ద్వేషించేవారెవరైనా వున్నారా.? ఛాన్సే లేదు.
అందరికీ ఆయన అన్నగానో, తమ్ముడిగానో, తాతగానో, కొడుకుగానో.. అంతే తప్ప, కనీసం బాలు మీద అయిష్టత కూడా ఎవరిలోనూ కనిపించదు. ఎస్పీ బాలు ఎంత గొప్పగా పాడతారు.? అని ‘విశ్లేషించే’ స్థాయి దాదాపుగా ఎవరికీ వుండదేమో.!
కానీ, బాలు మాత్రం, ‘నేనూ తెలియక కొన్నిసార్లు ఉచ్ఛారణ పరంగా తప్పులు చేశాను. అయితే, దాన్ని అప్పట్లో ఎవరూ సరిదిద్దలేదు..’ అంటూ, ఆయా పాటలు వచ్చినప్పుడు స్వయంగా బాలునే ఆ తప్పుల గురించి చెప్పుకున్నారంటే, అదీ ఆయన గొప్పతనం.
‘నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన..’ అంటూ ‘సాగర సంగమం’ సినిమాలో పాట ఆలపించినా ‘నేనే ముఠా మేస్త్రి..’ అని పాట పాడినా.. ఆ వేరియేషన్స్ ఇంకో గాయకుడి నుంచి ఆశించలేం. అసలు బాలు పాడిన పాటని, ఇంకో గాయకుడు పాడితే ఒప్పుకునే పరిస్థితి వుండకపోవచ్చేమో.. అంతలా బాలు పాటకి అడిక్ట్ అయిపోయారు తెలుగు సినీ పాటల ప్రియులు.
‘కృష్ణం వందే జగద్గురుం..’ అంటూ సాగే పాటలో బాలు గానామృతం అత్యద్భుతం.. అంతకు మించిన అద్భుతం ‘ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ..’ అనే పాట. అసలు ఓ పాట గొప్పది.. ఇంకో పాట గొప్పది కాదని అనగలమా బాలు పాటలకు సంబంధించి.? ఒకదాన్ని మించి ఇంకోటి. పాటని అందంగా పాడడం బాలుకి ఇష్టం.. మాటలోనూ అందాన్ని చూపించడం బాలుకి ఇష్టం.
తెలుగు భాషంటే అమితమైన ఇష్టం. తమిళంపైనా అదే ఇష్టం. కన్నడం కావొచ్చు, హిందీ కావొచ్చు.. ఇంకేదైనా భాష కావొచ్చు. అన్నిటినీ ఇష్టపడ్డారు కాబట్టే.. ఆయా పాటలు అంత బాగా వచ్చాయేమో బాలు స్వరపేటిక నుంచి.
‘భూమ్మీద ఇక నా పాటలు చాలు’ అనుకుని దివికేగిన బాలు, ఆ పైన.. దేవ లోకంలో తన గాన మాధుర్యాన్ని కొనసాగిస్తారేమో.! బాలు భౌతికంగా మన మధ్యన లేరు. కానీ, వేల కొద్దీ పాటల రూపంలో ఆయనెప్పుడూ మన మనసుల్లోనే వుంటారు.