Super Star Sanju Samson.. చాలా అంటే, చాలా పద్ధతిగా కొట్టాడు సంజూ శాంసన్. క్రికెట్‌లో చాలా అరుదుగా చూస్తుంటాం ఇలాంటి ఇన్నింగ్స్‌ని.
ఆడుతున్నదేమో, నాకౌట్ మ్యాచ్. అంటే, ఓడితే.. ఇంటికేనన్నమాట. అలాంటి మ్యాచ్‌లో సంజూ శాంసన్, చాలా పద్ధతిగా బ్యాటింగ్ చేశాడు.
బంతిని సులువుగా బౌండరీకి తరలించినా, భారీ సిక్సర్ కొట్టినా, సింగిల్ లేదా డబుల్ రన్స్ చేసినా.. ఎక్కడా, సంజూ శాంసన్‌లో ఎలాంటి హడావిడీ కనిపించలేదు.
ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నాయి.. కానీ, సంజూ శాంసన్ మాత్రం, చివరి వరకూ బ్యాటింగ్ చేసి, టీమిండియాని విజయ తీరాలకు చేర్చాలనే గట్టి పట్టుదలతో వున్నాడు.
ఫలితం, భారీ స్కోర్ ఛేదనలో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య జరిటిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్-8 ‘నాకౌట్’ మ్యాచ్‌లో విజయం సాధించి, సెమీస్‌కి చేరింది టీమిండియా.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని సంజూ శాంసన్ దక్కించుకున్నాడు. చేసింది 97 పరుగులు.. వెస్టిండీస్ చేసిన స్కోర్‌లో దాదాపు సగం.
అంటే, మిగతా టీమిండియా బ్యాట్స్‌మెన్ అంతా కలిసి, ఆ మిగిలిన సగం స్కోర్ చేశారన్నమాట. నిజానికి, బ్యాటింగ్ విభాగంలో, అందరూ బాగానే ఆడినట్లు భావించాలి.
సంజూ శాంసన్ ఎప్పుడూ స్టార్ క్రికెటరే.. కాకపోతే, అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్.
జట్టులో చోటు దక్కుతుందా.? లేదా.? అన్న పరిస్థితి నుంచి, కీలక మ్యాచ్‌లో టీమిండియాని గెలిపించి, రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయాడు సంజూ శాంసన్.
ముందే చెప్పుకున్నట్లు క్రికెట్‌లో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. వరల్డ్ కప్‌లో మెరిసిపోతాడనుకున్న అభిషేక్ శర్మ, పూర్తిగా చేతులెత్తేశాడు.
కానీ, సంజూ శాంసన్ మాత్రం.. సత్తా చాటాడు. చిత్రమైన విషయమేంటంటే, ఈ టీ20 వరల్డ్ కప్ పోటీల్లో, ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాట్స్‌మెన్ స్టార్‌డమ్ అందుకుంటున్నాడు.
కెరీర్ మొత్తంలో సంజూ శాంసన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడినా, అన్నిట్లోకీ ఈ మ్యాచ్ చాలా చాలా ప్రత్యేకం.! దురదృష్టమేంటంటే, సంజూ శాంసన్‌ని ఓ వర్గం, ఆ వర్గానికి ప్రతినిథిగా ప్రొజెక్ట్ చేస్తుండడం.
అతను టీమిండియా క్రికెటర్.. ఏ వర్గానికీ ప్రతినిథి కాదు. భారత క్రికెట్‌లో ఓ సంచలనం.
