Table of Contents
Team India Test Cricket.. క్రికెట్ అంటే ఏంటి.? చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్పేస్తాడు.. నేను ధోనీ ఫ్యాన్ అనీ. నేను కోహ్లీ అభిమానిననీ, నేను రోహిత్ కల్ట్‌ననీ.!
అంతేనా.? క్రికెట్ గురించి ఇంకేమీ తెలియదా.? అంటే, ఎందుకు తెలియదు.. చెన్నయ్ సూపర్ కింగ్స్ తెలుసు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు తెలుసు.. ముంబై ఇండియన్స్ తెలుసు.. అంటారు.
ఔను, క్రికెట్ అంటే కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే. ఈ తరం కుర్రాళ్ళలో చాలామందికి తెలిసిందిదే.! పొట్టి ఫార్మాట్.. అందునా, ఐపీఎల్.. ఆ కిక్కే వేరప్పా.
Team India Test Cricket.. ఐపీఎల్ ఎంటర్‌టైన్‌మెంట్..
సినిమా థియేటర్లలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు తిలకించేయొచ్చు. బార్లు, రెస్టారెంట్లు.. ఎక్కడ చూసినా, అదే సందడి.. సీజన్ నడిచినంతకాలం.!
కోట్లు ఖర్చు చేసి, క్రికెటర్లను ఆయా జట్లు కొనుగోలు చేస్తుంటాయి. డ్రామా.. డ్రామా.. డ్రామా.. క్రికెట్‌ని పూర్తిగా డ్రామాతో నింపేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్.
కానీ, క్రికెట్ అంటే ఐపీఎల్ కాదు. అసలు సిసలు క్రికెట్ అంటే, టెస్ట్ క్రికెట్.! ఔను, క్రికెట్ అంటే టీ20, వన్డే కానే కాదు.. టెస్టు క్రికెట్టే అసలు సిసలు మజా ఇస్తుంది.
కానీ, నాలుగు రోజులో.. ఐదు రోజులో.. టెస్ట్ క్రికెట్‌ని తీరిగ్గా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇదంతా స్మార్ట్ యుగం. క్రికెట్ అభిమానులూ స్మార్ట్‌గా మారిపోయారు.
క్రికెట్ పుట్టినిల్లు.. ఇంగ్లాండ్ బెంబేలు..
సరిగ్గా, ఈ సమయంలోనే ‘గిల్’ సేన, క్రికెట్‌కి పుట్టిల్లు అయిన ఇంగ్లాండ్ గడ్డ మీద అద్భుతాలే సృష్టించి, టెస్టు క్రికెట్ వైపుకి భారత క్రికెట్ అభిమానుల్ని మళ్ళించింది.
అందరూ కొత్త కుర్రాళ్ళే.. కెప్టెన్ సహా.! ఎలా ఇంగ్లాండ్ జట్టు మీద, ఇంగ్లాండులో సత్తా చాటేది.? వైట్ వాష్ తప్పదు.. ఘోర అవమానం టీమిండియాకి తప్పదు.. అని క్రికెట్ అభిమానులు ఫిక్సయ్యారు.

ఓ దశలో 3-1 తేడాతో, టీమిండియా, టెస్ట్ సిరీస్‌ని ఇంగ్లాండుకి అప్పజెప్పేస్తుందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ, అద్భుతం జరిగింది.
సిరీస్ ‘డ్రా’ అయ్యింది. ఇంగ్లాండ్ గడ్డ మీద, టీమిండియా ఓ మ్యాచ్ ‘డ్రా’ చేస్తేనే, అది గెలిచినట్లు.
అలాంటిది, ఏకంగా.. టెస్ట్ సిరీస్‌నే డ్రా చేసింది. అదీ, 2-1 తేడాతో వున్న సిరీస్‌ని డ్రాా చేయగలిగారు యంగ్ ఇండియన్ కుర్రాళ్ళు.
సమష్టి విజయం..
బ్యాటర్లు సరిగ్గా బ్యాటింగ్ చేశారు. బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ కూడా బావుంది. వెరసి, ఇంగ్లాండ్ జట్టుకి చుక్కలు చూపించేసింది టీమిండియా.
దాంతో, ఒక్కసారిగా టెస్ట్ క్రికెట్ గురించిన చర్చ షురూ అయ్యింది. చివరి టెస్ట్, చివరి రోజు అయితే.. కోట్లాది మంది భారతీయులు టీవీ సెట్లకు అతుక్కుపోయారు.
ఇంతకు ముందెన్నడూ టెస్ట్ మ్యాచ్ గురించి ఇంతలా ఎవరూ ఎదురుచూసింది లేదు. అయితే, ఇక్కడితో టెస్ట్ క్రికెట్‌కి పూర్వ వైభవం వచ్చేస్తుందని అనుకోలేం.
ఎందుకంటే, ఒక్క రోజులో పూర్తయిపోయే వన్డే మ్యాచ్.. కొద్ది గంటల్లో పూర్తయిపోయే టీ20 ఇచ్చే స్మార్ట్ కిక్.. టెస్ట్ క్రికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ తరం యువతకి.
కానీ, క్రికెట్ అసలు మజా తెలియాలంటే, టెస్ట్ క్రికెట్ చూడాల్సిందే.!
