Table of Contents
Telugu Cinema Politics.. అసలు సినిమా టిక్కెట్ ధర ఎందుకు వుండాలి.? పేదవాడికి వినోదాన్ని తక్కువ ధరకు అందించాలని అధికారంలో వున్నోళ్ళు భావిస్తే తప్పేంటి.? భారతీయ సినిమా ఖ్యాతిని పెంచేలా తెలుగు సినిమా స్థాయి పెరుగుతున్న దరిమిలా, ‘క్వాలిటీ’కి అనుగుణంగా సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచడంలో అభ్యంతరం తెలపాల్సిన అవసరమేంటి.?
సినిమా టిక్కెట్ల ధరలు పెంచడం మీదా, తగ్గించడం మీదా భిన్న వాదనలున్నాయి. ఓ వర్గం టిక్కెట్ల ధరల తగ్గింపుని సమర్థిస్తోంటే, ఇంకో వర్గం టిక్కెట్ల ధరల పెంపుని సమర్థిస్తోంది. ఏది వాస్తవం.? ఏది ఎవరికి మంచిది.? ఈ అంశంపై లోతైన చర్చ జరుగుతోంది.
Telugu Cinema Politics పెంచడం తప్పా.? తగ్గించడం తప్పా.?
ఆసక్తికరమైన, ఆహ్వానించదగ్గ విషయమేంటంటే, ఈ సినిమా టిక్కెట్ల ధరల అంశం జన బాహుళ్యంలో ఆలోచనాత్మకమైన, లోతైన చర్చకు ఆస్కారమిస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలు పెంచుతున్నారు సరే.. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఎందుకు దక్కడంలేదు.? అన్నది ఓ వాదన. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నారు సరే, నిత్యావసర వస్తువుల ధరల్ని ఎందుకు తగ్గించరు.? అన్నది ఇంకో వాదన.
ఒకే దూరానికి రెండు వేర్వేరు బస్సులు (సాధారణ ఎర్రబస్సు, వోల్వో బస్సు) ఛార్జీలు ఎందుకు.? కాకా హోటల్‌లో ఇడ్లీ ధరకీ, స్టార్ హోటల్‌లో ఇడ్లీ ధరకీ అంత వ్యత్యాసమెందుకు.? వంటి ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయి.

ప్రజలకు వినోదాన్ని తక్కువ ధరకు అందించాలని భావిస్తోన్న ప్రభుత్వ పెద్దలు, తమ ఫ్యాక్టరీల్లో తయారయ్యే సిమెంటు బస్తాల ధరల్ని ప్రజలకు అందుబాటులో వుండేలా ఎందుకు తగ్గించరు.? వారి పత్రికల్లో ప్రకటనల కోసం సరమైన ధరలు ఎందుకు పెట్టరు.? లాంటి ప్రశ్నలు జనం నుంచి పుట్టుకొస్తోంటే, రాజకీయ నాయకులకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
చర్చ జరగాల్సిందే.. జరిగి తీరాల్సిందే.!
అయితే, ఎన్నికల వేళ ఓటుకు నోటు తీసుకోకుండా నిబద్ధతతో ఓటేసే ఓటర్లు, సమాజంలో జరుగుతున్న ఇలాంటి వైపరీత్యాల విషయమై ప్రశ్నించాలి, ప్రశ్నించి తీరాలి. వినోదం సామాన్యుడి హక్కు అయినప్పుడు.. నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరల్లో పొందడమూ సామాన్యుడి హక్కుగానే చూడాలి కదా.?
Also Read: Bheemla Nayak.. చాలా గట్టిగా దెబ్బకొట్టేశారుగా.!
తెలుగు సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న భిన్న పరిస్థితులు, తెలుగు ప్రజల్లో సరికొత్త ఆలోచనలకు బీజం వేశాయన్నది నిర్వివాదాంశం. ఏది మంచి.? ఏది చెడు.? అధికారంలో వున్నోళ్ళు ఎలాంటి పాలన అందిస్తున్నారు.? ఎలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.? ప్రజాధనం సద్వినియోగమవుతోందా.? దుర్వినియోగమవుతోందా.? వంటి అంశాలపైనా ప్రజల్లో లోతైన చర్చ జరుగుతోంది.
ఈ దోపిడీని ప్రజలెందుకు విస్మరిస్తున్నారు.?
ప్రకృతి ప్రసాదం అయిన ఇసుక కూడా అమ్ముకుంటున్న రోజులివి. అదెందుకు సామాన్యుడికి ఉచితంగా అందనివ్వడంలేదు.? మంచి నీళ్ళతో వ్యాపారం ఎందుకు చెయ్యాల్సి వస్తోంది.? విద్య, వైద్యం.. సామాన్యుడికి అందుబాటులో వుండాలి కదా.? మరి, వాటిని అమ్మకానికి పెట్టారెందుకు.? ఓ చోట తక్కువ ఫీజు, ఇంకో చోట ఎక్కువ ఫీజు.. వాటినెందుకు ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయి.?
ఇలాంటి ప్రశ్నలన్నిటిపైనా ప్రజల్లో చర్చ జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.? ఇంతలా ప్రజల్లో చర్చ జరగడానికి కారణమైన ‘తెలుగు సినిమా’ (Telugu Cinema) ని అభినందించి తీరాల్సిందే.!