Telugu Cinema Publicity Mafia.. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. ఓ సినిమా విడుదలవుతోందని తెలియాలంటే, కోటిన్నర ఖర్చు చేయాల్సిందేనట.!
ఇదేదో సాదా సీదా వ్యక్తి చేసిన ప్రకటన కాదు. ఓ నిర్మాత నుంచి వచ్చిన ప్రకటన.! బన్నీ వాసు లాంటి నిర్మాతలే ఇలా అంటున్నారంటే, సినిమా కష్టాలు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నిజమే, సినిమాకి ప్రమోషన్స్ అవసరం. పబ్లిసిటీ బాగా చేసుకోవాలి. కానీ, కోటిన్నర ఖర్చు చేస్తేనే తప్ప, సినిమా ఒకటుందని తెలియదా.? ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
నిజానికి, సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. తక్కువ బడ్జెట్‌లో సినిమా చేసేద్దామన్న ఆలోచనే ఎవరూ చేయడంలేదు.
కోటిన్నర అనేది సినిమా పూర్తయ్యాక, రిలీజ్ కోసం చేయాల్సిన పబ్లిసిటీ ఖర్చు. దీంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా చాలా వ్యవహారాలుంటాయ్.
సోషల్ మీడియా వాటానే ఎక్కువ..
సోషల్ మీడియా వాటా ఎక్కువగానే వుంది ఈ కోటిన్నర ఖర్చులో. వెబ్ మీడియాకి దోచి పెట్టడం కూడా ఇందులో భాగమే. ఇంతా చేసి, ఆ కోటిన్నరలో ఎంత మొత్తం నిర్మాతకి తిరిగొస్తుందన్నది అనుమానమే.
ముందే చెప్పుకున్నట్లు, సినిమాకి పబ్లిసిటీ అవసరం. కానీ, ఆ పబ్లిసిటీ కోసమే.. అది కూడా, రిలీజ్ పబ్లిసిటీ కోసమే కోటిన్నర ఖర్చు చేయాలంటే, సినిమాకి ఇంకెంత ఖర్చు చేయాలి.
ఐదు, పది కోట్లు ఖర్చు చేసి ఓ సినిమా నిర్మించడం అనేది ఈ రోజుల్లో కష్టసాధ్యం. అంతకు మించి ఖర్చు చేయాల్సిందే. ఓ మోస్తరు నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఆకాశాన్నంటేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.
ఈ క్రమంలో క్వాలిటీ అనేది చచ్చిపోతోంది. సినిమా అంటే, ప్యాషన్.. ఆ ప్యాషన్‌తోనే సినిమాల్ని నిర్మిస్తుంటారు. అదే ప్యాషన్, నటీనటులు సహా సాంకేతిక నిపుణులు.. అందరికీ వుండాలి కదా.?
పీఆర్ మాఫియా..
వెబ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా.. వీటి విషయమై ఖర్చులు తగ్గించుకుంటే, సినిమాకి బాగా కలిసొస్తుందన్న చర్చ ఇటీవలి కాలంలో జరుగుతోంది.
దానర్థం, పైన చెప్పుకున్న మీడియా, తెలుగు సినీ పరిశ్రమని నిలువునా దోచేస్తోందనే కదా.? కోటిన్నరలో సింహ భాగం దీనిదే. ఇంత ఖర్చు చేసినా, సినిమాకి నెగెటివిటీ వచ్చేది ఈ మీడియా నుంచే.
మీడియా అనబడే ఈ మాఫియా వెనక వున్నదెవరు.? ఇంకెవరు పీఆర్ టీమ్స్.! సినిమా మీద బతుకుతూ, సినిమాని చంపేస్తున్నాయి ఈ పీఆర్ టీమ్స్.
