Thittam Irandu Telugu Review.. థిట్టమ్ ఇరాండు.. ఇదేం టైటిల్.? తెలుగు సినిమా కాదు. టైటిల్‌ని తెలుగులోకి అనువదిస్తే, రెండో వ్యూహం.. అదే, ప్లాన్-బి అన్నమాట.!
మన తెలుగమ్మాయ్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిందీ సినిమా. తెలుగమ్మాయ్ అయినా, తమిళ సినిమాలతోనే పాపులారిటీ పెంచుకుంది ఐశ్వర్య రాజేష్.
ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో ఓ పోలీస్ అధికారిగా నటించింది. నటిగా ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకుంది ఐశ్వర్య. ఇంతకీ, ఈ సినిమా కథ, కమామిషు ఏంటి.?
(అధిర) ఐశ్వర్య ఓ పోలీస్ అధికారి. ఓ హత్య కేసుని విచారించే క్రమంలో, అలాంటి హత్యలు చేస్తున్న ఓ కిల్లర్ ఆమె చేతికి చిక్కుతాడు.
ఏ కేసు అయితే అధిర విచారిస్తోందో, ఆ కేసులో మృతురాలు, అధిరకి చిన్ననాటి స్నేహితురాలు కావడంతో, ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతుంది ఈ కేసు మీద అధిర.
రోడ్డు ప్రమాదం.. హత్య.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆపై, అసలు దీపా సూర్య చనిపోలేదంటూ ఇంకో షాకింగ్ ట్విస్ట్.! అసలేం జరిగింది.? అన్నది తెరపై చూడాల్సిందే.
క్లయిమాక్స్ ట్విస్ట్ ఏంటన్నది తెలిసిపోతే, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ వుండదా.? అంటే, సినిమా ఆల్రెడీ రిలీజైపోయింది, ఓటీటీల్లోనూ అందుబాటులోనే వుంది.
చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో.. అబ్బాయి, అమ్మాయి తరహా ఆలోచనలతో వుండడం, ఇంట్లో వాళ్ళ నుంచి ఛీత్కారాలు, చివరికి అలాంటివాళ్ళు సైకోలుగా మారడం చూస్తుంటాం.
ఇందులో ఒకింత భిన్నం.! అమ్మాయే, అబ్బాయిగా మారిపోతుంది. దానికి, ఆమె భర్త నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి.
అబ్బాయిగా మారాక, ఓ అమ్మాయిని ప్రేమలో పడేయడం ఆసక్తికరమైన అంశం. అయితే, సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ‘సైకో’ తరహా కాన్సెప్ట్స్ వుంటాయ్. సీరియల్ కిల్లర్స్.. కథలకు ఇదే మూలం.
కానీ, ఈ ‘థిట్టమ్ ఇరాండు’లో వ్యవహారం వేరు. కేవలం, ఆరాధనా భావం అలాగే ప్రేమ మాత్రమే కనిపిస్తాయ్. ఆ విషయంలో మేకర్స్‌ని అభినందించి తీరాలి.
అబ్బాయిగా మారిన ఒకప్పటి అమ్మాయిని, అమ్మాయి పెళ్ళి చేసుకుంటుందా.? లేదా.? అన్నదానిపై ‘కంక్లూజన్’ లేకుండానే, సినిమాని ముగించేశారు.
ఎప్పటిలానే ఐశ్వర్య రాజేష్ తన ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాని, రిచ్‌గానే తెరకెక్కించారు. డైలాగ్స్ నుంచి, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ బావున్నాయ్.
వల్గారిటీకి అస్సలు ఆస్కారం లేకుండా చేశారు. హింసకీ అవకాశమివ్వలేదు. కాకపోతే, మగ నుంచి ఆడ – ఆడ నుంచి మగ.. ఈ మార్పిడిపై సినిమాలు సభ్య సమాజానికి ఏం సంకేతాలిస్తాయన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
జస్ట్ సినిమా యాంగిల్‌లో చూస్తే, ఓ మంచి పాయింట్ పట్టుకుని చాలా జాగ్రత్తగా సినిమాని డీల్ చేసినందుకు ‘థిట్టమ్ ఇరాండు’ టీమ్‌ని అభినందించి తీరాల్సిందే.
రక్తపాతాన్ని ఇష్టపడేవారికి సినిమా నచ్చదు. సినిమాలోని సెన్సిటివ్ కంటెంట్ పట్ల కొందరికి కొన్ని అభ్యంతరాలు వుండొచ్చు. వారికి సినిమా నచ్చకపోవచ్చు కూడా.