మొన్న టిక్‌టాక్.. ఇప్పుడు పబ్‌జీ.. కేంద్రం, యాప్‌ల మీద నిషేధం (Tik Tok Pub G Ban) విధిస్తూ వెళుతుండడం వల్ల కష్టమేంటి.? నష్టమేంటి.? అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. టిక్‌టాక్‌పై బ్యాన్ విధించడంతో చాలామంది ‘టిక్ టాక్’ స్టార్లు, ప్రత్యామ్నాయాలవైపు మొగ్గు చూపారు.
అయితే, టిక్ టాక్ ద్వారా వచ్చిన పాపులారిటీ, ప్రత్యామ్నాయ యాప్‌ల ద్వారా దొరక్కపోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇప్పుడు పబ్‌జీపై బ్యాన్ విధించింది కేంద్రం. దాంతో, పబ్‌జీ బానిసల పరిస్థితి ఏంటి.? అన్న చర్చ షురూ అయ్యింది.
టిక్‌టాక్ వేరు, పబ్‌జీ వేరు. టిక్‌టాక్ అనేది కాస్తో కూస్తో ఉపయోగకరమే. కానీ, పబ్‌జీ అలా కాదు. ఇది పూర్తిగా అర్థం పర్థం లేని ఓ ఆట మాత్రమే. పైగా, పబ్‌జీ కారణంగా చాలా ప్రాణాలు పోయాయి. పబ్‌జీ మోజులో పడి, యువత ఆత్మహత్యలకు పాల్పడటమే కాదు, ఇతరులపై దాడులకు దిగిన సందర్భాలూ లేకపోలేదు. చిన్నపిల్లలూ వీటికి బానిసలుగా మారిపోయిన సందర్భాల్ని చూశాం.
స్కూళ్ళలో పబ్‌జీ గ్రూపులు ఏర్పడి, అవంటే ఇష్టపడనివారిని దూరం పెట్టడంతో, స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు తలపట్టుక్కూర్చున్న సందర్భాలూ చాలానే వున్నాయి. అలాంటి పబ్‌జీపై బ్యాన్.. అంటే ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా చాలా యాప్‌లు అందుబాటులోనే వున్నాయి ఇంటర్నెట్‌లో.
‘అది కాకపోతే ఇది.. ఇది కాకపోతే అది..’ అన్నట్టు వందలాది ప్రత్యామ్నాయాలు వున్నప్పుడు, ఈ ‘మాయ’ నుంచి యువతని కావొచ్చు, చిన్న పిల్లల్ని కావొచ్చు.. బయటకు లాగడం కష్టమే. అయితే, ఇక్కడ చైనా యాప్‌లపై నిషేధం అనేది.. ఆర్థికంగా చైనాని దెబ్బ తీయడం కోసమేనన్నది నిర్వివాదాంశం.
టిక్‌టాక్‌పై ఇండియా బ్యాన్ విధించాక.. చైనా కిందా మీదా పడాల్సి వచ్చింది. ఇప్పుడు పబ్‌జీ ఎఫెక్ట్‌తో చైనా పరిస్థితి ఏంటి.? అన్నది ఆసక్తికరంగా మారింది. జస్ట్ ఓ యాప్ మాత్రమే.. అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇండియన్ మార్కెట్ ఆయా యాప్‌లకు అంత ప్రత్యేకమైనది.
‘డాటా తస్కరణ’ అనే ఆరోపణలపై చైనా యాప్‌లను భారతదేశం నిషేధిస్తోంది. టిక్‌టాక్, పబ్‌జీతోపాటు.. వందలాది చైనా యాప్‌లు ఇప్పటికే భారతదేశం నుంచి ‘ఔట్’ (Tik Tok Pub G Ban) అయిపోయిన విషయం విదితమే.