Table of Contents
Vajrasanam Yoga For Life శారీరక, మానసిక ప్రశాంతతకు యోగా చక్కని పరిష్కారంగా చెబుతారు. అంతేకాదు, యోగాతో చాలా రకాల అనారోగ్య సమస్యలకూ ఈజీగా చెక్ పెట్టొచ్చని వైద్యనిపుణులు చెబుతున్న మాట. యోగాసనాల్లో అనేక రకాల ఆసనాలున్నాయి. కొన్ని కష్టతరమైనవి. కొన్ని సులభమైనవి.
యోగాసనాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వజ్రాసన. వజ్రం అంటే చాలా విలువైనది. చాలా బలమైనది. అందుకే ఆసనాల యందు వజ్రాసనం వేరయా.. అనొచ్చేమో. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ ఆసనాన్నివేయొచ్చు.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు..
ఆరోగ్యంగా ఉండాలంటే, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే, పొట్టలో ఎసిడిటీ వంటి గ్యాస్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యలకు అతి సులభతరమైన ఈ వజ్రాసనం చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, వజ్రాసనం వేసేందుకు ఎలాంటి నియమాలు అవసరం లేదు. భొజనం ముందు, భోజనం తర్వాత కూడా ఈ ఆసనం వేయొచ్చు.
Vajrasanam Yoga For Life మలబద్దకానికి చక్కటి పరిష్కారం..
మలబద్ధకం సమస్య చాలా కఠినమైనది. శాశ్వత పరిష్కారమేదీ లేదీ సమస్యకు. ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకుంటూ, క్రమం తప్పకుండా వజ్రాసనం వేయడమనేది ఓ అలవాటుగా పెట్టుకుంటే, మలబద్ధకం సమస్య నుండి తేలిగ్గా బయటపడొచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అలాగే, యూరిన్ సంబంధిత సమస్యలకూ ఈ ఆసనం చెక్ పెడుతుంది.
వెన్ను నొప్పి సమస్యలకు చక్కటి పరిష్కారం..
వెన్నునొప్పితో బాధపడేవారు కొన్ని రకాల ఆసనాలకు దూరంగా ఉండాలి. కానీ, వజ్రాసనం వెన్నునొప్పి సమస్యకు చక్కని పరిష్కారంగా సూచిస్తుంటారు. అంతేకాదు, రుమాటిక్ నొప్పుల నుంచి ఉపశమనాన్నిస్తుంది.. గౌట్ వల్ల కలిగే నొప్పులకీ ఉపశమనంగా వజ్రాసనాన్ని సూచిస్తారు. పెల్విక్ ఫ్లోర్ కండరాల్ని బలోపేతం చేసేందుకూ ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది.
Vajrasanam Yoga For Life మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది..
ఉరుకుల పరుగుల నగర జీవితంలో ఒత్తిడి అనేది చాలా సహజంగా మారిపోయింది. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త సమయాన్ని యోగాకి కేటాయించక తప్పని పరిస్థితి. పెద్దగా కష్టపడకుండా వజ్రాసనం ట్రై చేస్తే, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందొచ్చు.
రుతుక్రమం వల్ల కలిగే సమస్యలకు ఉపశమనమిలా..
మహిళల్లో రుతుక్రమంలో వచ్చే సమస్యలు అనేకం. ముఖ్యంగా తలనొప్పి, కడుపులో నొప్పి తదితర సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఆ సమయంలో వజ్రాసనం వేయడం వల్ల, ఆయా సమస్యల నుండి ఉపశమనాన్ని పొందొచ్చు.
బరువు తగ్గాలనుకుంటున్నారా.? వజ్రాసనం వుందిగా..
ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారం కారణంగా ఊబకాయ సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. తీసుకునే ఆహారంలో జాగ్రతతో పాటు, అత్యంత సులవైన వజ్రాసనాన్ని కూడా జస్ట్ అలా ట్రై చేస్తే ఊబకాయ సమస్యకు కాస్త దూరంగా ఉండొచ్చు. అలాగే, పొట్ట భాగంలో అడ్డదిడ్డంగా పెరిగిపోయిన కొవ్వును తగ్గించుకునేందుకూ వజ్రాసనం బెస్ట్ ఆప్షన్ అని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఇవే కాదు, రక్తపోటుని తగ్గించడంలోనూ, గుండె సంబంధిత సమస్యలను కొంతవరకు దూరంగా వుంచేందుకు వజ్రాసన చక్కగా ఉపయోగపడుతుంది.
ఏ ఆసనాలైనా సరే, నిపుణుల సలహా తప్పనిసరి. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలుంటే, వైద్యుని సలహా మేరకు ఆయా ఆసనాలను వేయడం మంచిది.