Table of Contents
అభిమానం జుగుప్సాకరంగా మారుతున్న రోజులివి. నచ్చిన హీరోని అభిమానించే అభిమానులు, ఆ హీరోకి అపోనెంట్ ఎవరన్నా వున్నారని భావిస్తే, అత్యంత హేయంగా, అసహ్యకరంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఆయా హీరోలకూ ‘బ్యాడ్ ఇమేజ్’ వచ్చేస్తోంది. వెండితెరపై పలు సినిమాల్లో డిఫరెంట్ అప్రోచ్‌తో కన్పించిన విజయ్ దేవరకొండ, రియల్ లైఫ్‌లో మాత్రం అసలు సిసలు హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు. తెరపై ‘డోన్ట్ కేర్’ అన్నట్టు వ్యవహరిస్తుంటాడీ యంగ్ హీరో. కానీ, అతనిలో చాలా సాఫ్ట్ నేచర్ కన్పిస్తుంటుంది. అదే అతని ప్రత్యేకత. తనలానే తన అభిమానులూ వుండాలని కోరుకుంటాడు. తన సినిమాటిక్ యాటిట్యూడ్‌ని కాకుండా, రియల్ యాటిట్యూడ్‌కి తగ్గట్టుగా అభిమానులు వ్యవహరించాలని విజయ్ ఆశిస్తే, అది తప్పెలా అవుతుంది?
డియర్ రౌడీస్.. లవ్ ఆల్వేజ్
విజయ్ దేవరకొండ అభిమానగణం రోజురోజుకీ పెరుగుతోంది. ఎంతలా? అంటే, ఎవరూ ఊహించలేనంతలా. ఇదంతా కేవలం నాలుగైదు సినిమాల అనుభవంతోనే. ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో ఈ యంగ్ హీరో మార్కెట్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ధీటుగా విజయ్ దేవరకొండ ఇమేజ్ పెరిగింది. వసూళ్ళ అంచనాలు, రెమ్యునరేషన్, అభిమానగణం.. ఇవన్నీ పెంచుకున్న విజయ్ దేవరకొండ, అంతకన్నా ఎక్కువగా ‘బాధ్యత’నీ పెంచుకున్నాడు. తనలా అభిమానులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకున్నాడు. అలా కోరుకుంటూ విజయ్ చేసిన తాజా ట్వీట్ అభిమానుల్ని ఆకట్టుకుంది. తనను అభిమానించేవారు, ఇంకొకర్ని ద్వేషించాల్సిన అవసరం లేదని చెప్పాడు విజయ్.
రూల్స్ పాస్ చేసిన ‘రౌడీ’
మనకి మనమే కొన్ని రూల్స్ పెట్టుకోవాలని విజయ్ దేవరకొండ, అభిమానుల్ని ఉద్దేశించి చేసిన కామెంట్ పట్ల సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మనం ఎదుగుతున్నామనడానికి అదొక గుర్తు అన్న విజయ్ దేవరకొండ ఆలోచన నిజంగా అభినందించదగ్గదే. అభిమానగణం పెరుగుతున్నప్పుడే, ఆ అభిమానుల్ని ‘విజ్ఞత’ గలిగినవారిలా కంట్రోల్‌లో పెట్టాల్సి వుంటుంది. ఆ ప్రయత్నం చేసిన విజయ్‌ని ఎంతలా అభినందించినా అది తక్కువే అవుతుంది. తన సినిమా ‘నోటా’ విడుదలకు సిద్ధమయిన వేళ విజయ్ దేవరకొండ నుంచి అభిమానులకు అందిన ఈ పిలుపుకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఇతర హీరోల అభిమానులూ ఇప్పుడు విజయ్‌ని అభినందిస్తున్నారు.
అసలు గొడవేంటంటే.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, దానికి సరిగ్గా ఆరు రోజుల ముందు విజయ్ దేవరకొండ ‘నోటా’ రిలీజ్ అవుతోంది. నిజానికి, ‘నోటా’ రిలీజ్‌పై తొలుత కొంత గందరగోళం చోటు చేసుకుంది. అక్టోబర్‌ని దాటి, నవంబర్‌లో సినిమా విడుదల చేసేందుకూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే, విజయ్ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించి, అభిమానుల కోరిక మేరకు అక్టోబర్ 5న సినిమా రిలీజ్ అంటూ అనౌన్స్ చేశాడు. ఈ పోల్ విషయంలోనూ కొంత గందరగోళం వుంది. విజయ్ కావాలనే, అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడనీ, తద్వారా ‘అరవింద సమేత’ వసూళ్ళను తగ్గించే ప్రయత్నంలోనే భాగంగా ఇదంతా జరిగిందనీ ఎన్టీఆర్ అభిమానులు భావించారు. ఇదీ అసలు గొడవ.
తారక్ అన్నయ్య.. విజయ్ తమ్ముడు..
విజయ్ దేవరకొండ, ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు చాలా హుందాగా వ్యవహరిస్తాడు. ‘తారక్ అన్న’ అని మాత్రమే ఎన్టీఆర్‌ని సంబోదిస్తాడు. ‘మహానటి’ సినిమా ఫంక్షన్‌లో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ మధ్య సాన్నిహిత్యం అందరికీ కన్పించింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆయా హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు, విజయ్ దేవరకొండ వారి గురించి ఆప్యాయంగా మాట్లాడుతుంటాడు. హీరోగా ఎదగడమే తప్పు అని ఎవరూ అనలేని పరిస్థితి. ఆ ఎదుగుదలని జీర్ణించుకోలేనివారు కొందరుంటారు. వారే దురభిమానులు. అలాంటివారితోనే సమస్య వస్తుంటుంది. ఇలాంటి సమస్య దాదాపు అందరు హీరోలకీ వుంది. ఆ సమస్య నుంచి విజయ్ గట్టెక్కుతాడా? వేచి చూడాలిక.