Table of Contents
దర్శకుడు శంకర్ ఏ సినిమాని రూపొందించినా అది సాధారణ చిత్రాలకు భిన్నంగా వుంటుంది. అసాధారణ చిత్రాల్లోకే అత్యంత ప్రత్యేకమైన సినిమాగా మన్ననలు అందుకుంటుంది. జయాపజయాల సంగతి పక్కన పెడితే, శంకర్ ఏ సినిమా తెరకెక్కించినా ఆ సినిమా విడుదలకు ముందు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. తమిళ సూపర్ స్టారే అయినా, రజనీకాంత్‌కి దేశవ్యాప్తంగా పాపులారిటీ వుంది. ఆ మాటకొస్తే, భారతీయ సినీ పరిశ్రమ నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ అనడం నిస్సందేహం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో పలు చిత్రాలొచ్చాయి. అందులో ‘రోబో’ చాలా చాలా ప్రత్యేకమైనది.
ఇలాంటి ఓ సినిమా ఇండియన్ సినిమా స్క్రీన్‌పై వస్తుందని ఎవరూ ఊహించలేదు. వచ్చింది, సంచలన విజయమూ అందుకుంది. ఈ కాంబినేషన్‌లోనే ‘రోబో’ సీక్వెల్‌గా ‘2.0’ రాబోతోంది. నిజానికి ఇది సీక్వెల్ కాదంటాడు శంకర్. కానీ, అభిమానులు ‘సీక్వెల్’ అనే నమ్ముతున్నారు. ‘రోబో’లోని పాత్రలు కొన్ని ఈ ‘2.0’లో కన్పిస్తాయి. మానవాళిపై సాంకేతిక భూతం కోరలు చాచినప్పుడు ఆ సాంకేతికతలోంచే పుట్టిన ‘చిట్టి’ మానవాళిని ఎలా రక్షిస్తుందనేది ‘2.0’ సినిమా కథాంశం. ‘రోబో’ కథాంశం వేరు. మనిషి తప్పిదాల కారణంగా, సాంకేతికత ఎంతటి వినాశనానికి కారణమయ్యిందన్నది ఆ సినిమాలో చూపించాడు దర్శకుడు.
తమిళ సూపర్ స్టార్ చిట్టి
వయసు మీద పడ్తున్నా ‘ఎనర్జీ’ విషయంలో ఎప్పుడూ తగ్గలేదు రజనీకాంత్. ఫ్లాపులు ఎన్ని వచ్చినా, రజనీకాంత్ నుంచి కొత్త సినిమా వస్తోందంటే ఆ కిక్కే వేరప్పా.. అన్నట్లుగా వుంటాయి అంచనాలు. చిన్న పిల్లలు, యువత, పెద్దవాళ్ళు సైతం రజనీకాంత్ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తారు. ప్రధానంగా రజనీకాంత్ సినిమాల్ని ఇష్టపడేది ఆయన స్టైలింగ్ కోసమే.
అప్పటికీ, ఇప్పటికీ, రజనీకాంత్‌కి వున్న స్టయిల్, ఇంకే ఇతర హీరోలకీ లేదు, రాలేదు, రాబోదని రజనీకాంత్ అభిమానులు చెబుతుంటారు. అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ‘రోబో’ లాంటి సినిమా చేయాలంటేనే చాలా రిస్క్‌లు చేయాల్సి వుంటుంది. అలాంటిది, ‘2.0’ సినిమా కోసం రజనీకాంత్ ఎంత రిస్క్ చేసి వుంటాడో అర్థం చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు వున్నా, సినిమా కోసం అవన్నీ పక్కన పెట్టి యాక్టివ్‌గా నటించాడు ఈ సూపర్ స్టార్.
బాలీవుడ్ సూపర్ స్టార్ విలన్
విలక్షణమైన చిత్రాల్ని ఎంచుకుంటూ నటుడిగా సరికొత్త ఆలోచనల వైపు అడుగులు వేస్తోన్న అక్షయ్‌కుమార్, వెండితెరపై ఈసారి విలనిజం ప్రదర్శించబోతున్నాడు. రజనీకాంత్ హీరో, అక్షయ్‌కుమార్ విలన్ అనగానే ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశాన్నంటేయడం సహజం. ‘క్రిష్-3’ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తే, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించాడు. దాదాపు అలాంటి పోలిక ‘2.0’ సినిమాకి రావడం వింతేమీ కాదు. అయితే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. అక్షయ్‌కుమార్ విలనిజం, రజనీకాంత్ హీరోయిజం ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి.
అందాల విందు కోసం అమీ జాక్సన్
బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్, ‘2.0’ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా కన్పించబోతోంది. ఈ సినిమాలో ఈమెకు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వున్నాయట. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ సినిమాలో అమీ జాక్సన్ ఎంత అందంగా కన్పించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా రెట్టించిన అందంతో అమీ జాక్సన్ కనిపించబోతోందట. శంకర్ సినిమాల్లో వుండే గ్రాండియర్ గురించి తెలుసుగానీ, ఈ సినిమాలో గ్రాండియర్ లుక్ గురించి తాను అస్సల ఊహించలేదని చెబుతోంది అమీ జాక్సన్.
నవంబర్ 3న ట్రైలర్
టీజర్ ఇప్పటికే పెను సంచలనమయ్యింది. ఇప్పుడు ట్రైలర్ కూడా రాబోతోంది. నవంబర్ నెలాఖరున సినిమా విడుదల కానుండగా, నవంబర్ 3న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. సినిమా మెయిన్ ఈవెంట్ ఇప్పటికే దుబాయ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన సంగతి తెల్సిందే. సినిమా విడుదల దగ్గర పడ్తున్న నేపథ్యంలో ఇన్నోవేటివ్‌గా సినిమా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అభిమానులే కొన్ని పోస్టర్లు తయారు చేసే అవకాశం కల్పిస్తూ, వాటిని లైకా ప్రొడక్షన్స్ విడుదల చేస్తూ వస్తోంది. దాంతో అభిమానులు తమ క్రియేటివిటీని పీక్స్‌లో చూపించేస్తున్నారు.
వెయ్యి కోట్లు అలవోకగా.?
వెయ్యి కోట్ల వసూళ్ళను అలవోకగా ‘2.0’ సాధించేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంచనాల్ని అందుకోవడం రజనీకాంత్‌కి కొత్త కాదు. రెట్టించిన అంచనాల్ని సైతం అవలీలగా అందుకోవడం ఆయనకి అలవాటే. ఫ్లాప్ సినిమాతోనూ వసూళ్ళ ప్రభంజనం సృష్టించగల సత్తా వున్న రజనీకాంత్, ‘2.0’ సినిమాతో ఇండియన్ సినిమా గత రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మ్యూజిక్ మాంత్రికుడు రెహమాన్ అందించిన సంగీతం, ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్.. ఇలా ‘2.0’ ఇండియన్ సినిమాగా కాదు, అంతర్జాతీయ స్థాయి సినిమాగా తెరకెక్కిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.