Crocodile Kills Young Boy.. ఉత్తర ప్రదేశ్‌లోని మరౌన్వా గ్రామంలో ఓ పన్నెండేళ్ళ పిల్లాడిని మొసలి చంపేసింది.
బంధువుతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళిన సునీల్ సింగ్ అనే పన్నెండేళ్ళ పిల్లాడు, పక్కనే వున్న గాగ్రా నదిలో చేతులు, కాళ్ళు కడుక్కునేందుకు ప్రయత్నించాడు.
ఆ నదిలో వున్న ఓ మొసలి, ఆ చిన్నారిని అమాంతం నోటకరచుకుని నదిలోకి లాక్కెళ్ళిపోయింది. మొసలి ధాటికి, ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సునీల్ సింగ్‌ని మొసలి లాక్కెళ్ళిపోతుండగా, అతని బంధువు అతన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలూ చేసి, విఫలమయ్యాడు.
గ్రామస్తులు ఎంత గాలించినా, సునీల్ సింగ్ ఆచూకీ దొరకలేదు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి, సునీల్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీశారు.
అయితే, సునీల్ సింగ్ శరీరంలో చాలా భాగాన్ని మొసలి తినేసినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో, ‘మ్యాన్ ఈటర్స్’గా ఆయా జంతువులపై ముద్ర వేస్తుంటారు.
కొన్ని సందర్భాల్లో ‘మ్యాన్ ఈటర్స్’ని చంపేయడం కూడా జరుగుతుంటుంది. ఓసారి మనిషి మాంసానికి అలవాటు పడ్డాక, జంతువులు పదే పదే మనుషుల్ని వేటాడేందుకు ఇష్టపడతాయి.
ఇంతకీ, ఈ వ్యవహారంలో మొసలిని ఏం చేయాలి.? చంపెయ్యాలా.? జనావాసాలకు దూరంగా దాన్ని తరలించాలా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, మొసలిని పట్టుకుని, చంపేసి.. ఆ మొసలి కడుపులోంచి సునీల్ సింగ్ శరీర భాగాల్ని వెలికి తీశారనే వార్త ఒకటి గుప్పుమంది.
అయితే, దీన్ని పోలీసులు ఖండిస్తున్నారు. మొసలిని పట్టుకున్నామనీ, అది మనుషులకు ప్రమాదకరంగా మారే అవకాశం వుంది గనుక, దానిని సురక్షిత ప్రాంతంలో విడిచి పెడుతున్నామని పోలీసులు వెల్లడించారు.
భారత దేశంలో మనుషులపై మొసళ్ళ దాడి చాలా అరుదైన విషయమే.
