Yadadri Kavitha Surekha Chiranjeevi.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీలో కానుకలన్నీ తెలంగాణ భక్తులవేనా.? తిరుపతి వెంకన్నకి కేవలం ఆంధ్ర ప్రదేశ్ భక్తులే ‘మొక్కులు’ చెల్లించుకోవాలా.?
సిగ్గొదిలేసిన రాజకీయమంటే ఎలా వుంటుందో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసి చూపిస్తున్నారు.!
తెలంగాణ ప్రజల కోసమే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందనీ, ఆ దేవాలయ పాలక మండలిలో ఓ ప్రముఖ నటుడి సతీమణికి ‘సభ్యురాలి’గా అవకాశమివ్వడమేంటి.? అని కవిత ప్రశ్నించేశారు.
ఆ ప్రముఖ నటుడి సతీమణి.. అంటే, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురించే.. కవిత ప్రశ్న సంధించారన్నమాట.
ఇటీవలే యాదాద్రి దేవస్థానానికి సంబంధించి పాలక మండలిని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అందులో సురేఖ పేరుని సభ్యురాలిగా చేర్చారు.
మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కుని తెలంగాణలోనే వినియోగించుకుంటారు. చిరంజీవి సతీమణి సురేఖకి కూడా తెలంగాణలోనే ఓటు హక్కు వుంది.
చిరంజీవి నివాసం వుంటోన్నదీ, ఆయనకి ఆస్తిపాస్తులున్నదీ తెలంగాణలోనే. చిరంజీవి పుట్టింది ఆంధ్ర ప్రదేశ్‌లో కావొచ్చు.. సినిమా కెరీర్ ప్రారంభమైంది చెన్నైలో కావొచ్చు.. సెటిలైంది మాత్రం తెలంగాణలో.
అసలు, చిరంజీవి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి.? అన్న డిబేట్ ఇక్కడ అనవసరం. ఆయన అందరివాడు.! చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి వున్నాయి.
నిజానికి, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా హైద్రాబాద్‌లోనే వుంది. ఇవేవీ కవితకి తెలియదా.? అంటే, ఆమె కూడా చిరంజీవి అభిమానే.
మరెందుకు కవిత, యాదాద్రి దేవాలయాన్ని చిరంజీవి సతీమణి పేరుతో వివాదాస్పదం చేయాలనుకుంటున్నారు.? టీటీడీలో తమిళనాడు, కర్నాటక, తెలంగాణకి చెందినవాళ్ళకీ సభ్యులుగా అవకాశం వుంది కదా.?
యాదాద్రికి వెళ్ళే భక్తుల్లో అధిక సంఖ్యాకులు ఆంధ్ర ప్రదేశ్‌కి చెందినవారేనని తెలియనంత అమాయకురాలైతే కాదు కవిత.!
దైవ దర్శనం కోసం రాష్ట్రాలు దాటి వెళ్లడం కొత్తేమీ కాదు. కాశీ, తెలుగు రాష్ట్రాల్లో లేదు. అరుణాచలం ఏమైనా తెలుగు రాష్ట్రంలో వుందా.?
అరుణాచలం గిరి ప్రదక్షిణలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే వుంటారు. అయినా, దేవుళ్ళకి ప్రాంతీయ విద్వేషాలు అంటగట్టడమేంటి.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అన్నట్లుంది కవిత వ్యవహారం.
అయినా, యాదాద్రి పాలక మండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖకు ఏమైనా ఆర్థిక వనరులు సమకూరే అవకాశం వుండదు కదా.! అదొక గౌరవ ప్రదమైన ‘సభ్యత్వం’ అంతే.
తండ్రి కేసీయార్ హయాంలో ఏకంగా ఛైర్మన్ పదవిని అయినా తీసుకుని వుండాల్సింది కవితకి.. ఆ పదవి వల్ల వ్యక్తిగతంగా కలిగే అదనపు లాభాలేంటో కవితకు అర్థమయ్యేవి.
