Why Not Pulivendula Jagan.. స్థానిక ఎన్నికలంటేనే, అధికార పార్టీకి అనుకూలంగా వుంటాయన్న బలమైన అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంటుంది.!
ఔను, అధికార పార్టీలో వుంటేనే.. నిథులు తెచ్చుకోవడానికి వీలవుతుందని స్థానిక ప్రజా ప్రతినిథులు భావిస్తుంటారు. పంచాయితీల దగ్గర్నుంచి, మునిసిపల్ కార్పొరేషన్ల దాకా ఇదే పరిస్థితి.
అలాగని, అధికార పార్టీలకు స్థానిక ఎన్నికలు షాక్ ఇచ్చిన సందర్భాలు లేవా.? అంటే, ఎందుకుండవ్.. అదీ వుంటుంది.. ఇదీ జరుగుతుంది.!
వైసీపీ హయాంలో ‘వై నాట్ కుప్పం’ అంటూ, అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే, అధికారంలో వున్నప్పుడు.. అడ్డగోలు వేషాలన్నీ వేస్తుంటారు. అదే రాజకీయం అంటే.
గతంలో వైఎస్ జగన్ చేసిన రాజకీయమే ఇప్పుడు చంద్రబాబు చేయదలచుకుంటే ఏమవుతుంది.? పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్‌కి స్థానిక షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారా.?
Why Not Pulivendula Jagan.. జగన్ బాటలో చంద్రబాబూ.. ‘వై నాట్ పులివెందుల’ అనుకుంటే.!
ఏమో, ఏం సంకేతం అందిందోగానీ.. స్థానిక ఎన్నికల్ని అస్సలు లైట్ తీసుకోవద్దనీ, స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవమైతే, ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జికి సార్వత్రిక ఎన్నికల్లో సీటుందడదని జగన్ తేల్చి చెప్పేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే మాటకు కట్టుబడి వుంటే.. ఒకవేళ చంద్రబాబు స్కెచ్ వేసి మరీ పులివెందులలో వైసీపీకి స్థానిక ఎన్నికల్లో షాక్ ఇవ్వగలిగితే.?
మాటకు కట్టుబడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయకుండా వుంటారా.? అలా ఎగ్గొట్టడానికేనా, ముందస్తు డైలాగ్ వైఎస్ జగన్ పేల్చింది.?
అబ్బో, బోల్డన్ని చర్చోపచర్చలు.. బోల్డన్ని అనుమానాలు.. బోల్డన్ని వెటకారాలు.. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తున్నాయ్.
కడప.. అందునా, పులివెందులలో రాజకీయం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.! వైసీపీని పులివెందులలో ఢీకొట్టడమంటే, టీడీపీకి అంత తేలికైన వ్యవహారం కాదు.
అయినాసరే, గుర్రం ఎగరావచ్చు.. కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే, వెంట్రుక వచ్చింది.. లేదా, కొండ వచ్చేయొచ్చు.. అని టీడీపీ ట్రై చేస్తే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
టీడీపీ వ్యూహం ఫలిస్తే, వైఎస్ జగన్ పులివెందులలో వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవచ్చు కూడా.! ఇదీ, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం స్థానిక పోరు సందర్భంగా జరుగుతున్న చర్చ.
ఆలోచించి అంటారో.. ఆలోచించకుండానే అనేస్తారోగానీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భలే ఇరకాటంలో పెట్టేస్తారు వైఎస్సార్సీపీని తన వ్యాఖ్యలతో.
అంతేనా, స్వయంగా తన వ్యాఖ్యలతో తనను తానే ఇరకాటంలో పెట్టేసుకుంటుంటారు పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!
