తెలుగు సినిమాకి కొత్త పండగొచ్చింది. అవును, ఇది కనీ వినీ ఎరుగని కొత్త పండగ. ఓ సినిమా విడుదలవుతోంది. అదే, తెలుగు సినిమాకి (Telugu Cinema New Normal Due To Corona Virus Covid 19) పెద్ద పండగ. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
కాదు కాదు, సినిమా ఫలితం గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కారణమేంటి.? ఇంతకు ముందూ చాలా పెద్ద సినిమాలు విడుదలయ్యాయిగానీ, ఇప్పుడే ఎందుకీ ఉత్కంఠ.? ఎందుకు సినీ పరిశ్రమ మొత్తంగా ఓ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.? కారణం వుంది. అదీ బలమైన కారణమే.
అసలు మళ్ళీ సినిమా థియేటర్లు తెరచుకుంటాయా.? లేదా.? అన్న అనుమానాల నుండి, వెండితెరపై సినిమా ప్రదర్శితమయ్యే సంబరాల రోజు వరకు పరిస్థితులు మారాయి. థియేటర్ సామర్థ్యంలో సగం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి వుంటుంది.
అయినాసరే, నిర్మాత సరిపెట్టుకోక తప్పలేదు. ఎగ్జిబిటర్ సర్దుకోక తప్పలేదు. డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే. మెగాస్టార్ చిరంజీవి నుంచి.. ఓ చిన్న నటుడిదాకా.. పెద్ద బ్యానర్ నుంచి చిన్న బ్యానర్ దాకా.. దర్శకులు, టెక్నీషియన్లు.. ఇలా ఒకరేమిటి, ప్రతి ఒక్కరూ సినిమాని థియేటర్లలో చూస్తామని చెబుతున్నారు.. ప్రేక్షకులూ థియేటర్లలో సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ చాటుకున్న దాతృత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ పరిశ్రమకీ కష్టమొచ్చింది. అది కనీ వినీ ఎరుగని కష్టం. ఆ కష్టం నుంచి తేరుకుని, మళ్ళీ మునుపటిలా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేద్దామనుకుంటోంది.
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడన్న ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి, సినీ పరిశ్రమలో ఒకటే ఉత్కంఠ. సినిమా హిట్టయితే నిర్మాతకి డబ్బులొస్తాయి.. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు పెరుగుతాయ్. అంతేనా.? సినీ పరిశ్రమ మీద ఆధారపడ్డ ఎన్నో జీవితాలు గాడిన పడతాయి.
అంతే కాదు, సినీ పరిశ్రమ బాగుంటే, కష్ట కాలంలో వున్నవారిని ఆదుకోవడానికి అందరికంటే ముందు సినీ ప్రముఖులే వుంటారు. అందుకే, కరోనా నిబంధనల్ని పాటిస్తూ సినిమా థియేటర్లకు వెళ్ళాలి. సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు.. అదొక పరిశ్రమ.
వందలాది మంది.. వేలాది మంది సినీ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా ఆధారపడి వున్నారు. అందుకే, 9 నెలలుగా మూతపడ్డ సినిమా థియేటర్లు (Telugu Cinema New Normal Due To Corona Virus Covid 19) తెరుచుకోవడం నిజంగానే పెద్ద పండగలా మారింది.