Table of Contents
ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu NTR Ram Charan) అంటూ యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు వచ్చేశాడు. బుల్లితెర యంగ్ టైగర్‌కి కొత్తేమీ కాదు. ఎంట్రీ ఇస్తూనే ‘బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ వన్’తో దుమ్ము రేపేశాడు.
మరి, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో యంగ్ టైగర్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు.? కర్టెన్ రైజర్ ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ చెప్పిన ముచ్చట్ల సంగతేంటి.?
మామూలుగా అయితే, సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులకీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కనిపిస్తుంది. ఇది కేవలం దురభిమానుల మధ్యనేనని నిఖార్సయిన అభిమానులు అంటుంటారనుకోండి.. అది వేరే సంగతి.
దురభిమానం నాన్సెన్స్..
దురభిమానుల ‘సోషల్ రచ్చ’ని పక్కన పెడితే, యంగ్ టైగర్ ఎన్టీయార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Young Tiger NTR Mega Power Star Ram Charan)మంచి స్నేహితులు. ఒకరి గురించి ఇంకొకరికి పూర్తిగా తెలుసు. ఒకరి ఇష్టాల్ని ఇంకొకరు గౌరవించుకుంటారు. ఒకరి వ్యక్తిత్వాన్ని ఇంకొకరు అభిమానిస్తారు. అంత మంచి స్నేహితులు కాబట్టే, తరచూ ‘మై బ్రదర్..’ అంటూ ఒకరి గురించి ఇంకొకరు ప్రస్తావిస్తుంటారు.
చరణ్, ఎన్టీయార్.. ఇద్దరూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీయార్ నటిస్తుండగా.. ఈ రెండూ పాత్రలూ తమకు దక్కడం అదృష్టమని చెప్పుకొచ్చారు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వేదికగా.
ఎన్టీయార్ హార్ట్ బ్రేకింగ్ ఎపిసోడ్ గురించి చెప్పిన చరణ్
యంగ్ టైగర్ ఎన్టీయార్ దగ్గర ఓ పెంపుడు కుక్క వుండేది. అది చాలా చాలా పెద్దదట. అది చనిపోయాక, మళ్ళీ పెంపుడు కుక్కల జోలికి వెళ్ళలేదట. ఆ ‘హార్ట్ బ్రేకింగ్’ ఎపిసోడ్ గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. చరణ్ వద్దనున్న చాలా పెంపుడు జంతువుల వివరాలు (బాద్ షా, కాజల్ అనే గుర్రాలు సహా దాదాపు అరడజను పెట్ డాగ్స్) గురించీ ప్రస్తావన వచ్చింది.
కొమరం భీమ్ పాత్ర గురించి తారక్ ఎంత కష్టపడ్డాడో, సీతారామరాజు పాత్ర కోసం చరణ్ అంత కష్టపడ్డాడు. ఆ విషయాల్ని ఇద్దరూ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో చరణ్ అనుబంధం గురించి అడిగి తెలుసుకున్నాడు ఎన్టీయార్. అంతే కాదు, ‘ఆచార్య’ సినిమా విశేషాల్నీ అడిగి తెలుసుకున్నాడు.
చిరంజీవి తనకు ఆచార్యుడని చరణ్ చెబితే, ‘నీకు మాత్రమే కాదు.. మా అందరికీ ఆయనే ఆచార్య.. సినిమా పరిశ్రమకు ఆయన ఆచార్య..’ అని ఎన్టీయార్ వ్యాఖ్యానించడం ఈ ఎపిసోడ్ మొత్తానికే మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు.
జానీ, ఆరెంజ్, అదుర్స్ సినిమాల ప్రస్తావన ఇలా..
పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలోని ఓ పాటను ఆడియో రూపంలో ప్లే చేసి, ఆ పాట ఎవరు పాడారు.? అని ఎన్టీయార్ ప్రశ్నిస్తే, దానికి చరణ్ సమాధానమిచ్చాడు. ‘అదుర్స్’ సినిమాలోని కామెడీ తనకు చాలా చాలా ఇష్టమని చరణ్ అన్నాడు. ‘ఆరెంజ్’ సినిమాలోని పాటలు తనకు చాలా ఇష్టమని ఎన్టీయార్ చెప్పడం గమనార్హం.
మొత్తమ్మీద, రామ్ చరణ్ – ఎన్టీయార్.. తమ మధ్య వున్న అత్యద్భుతమైన స్నేహం (Evaru Meelo Koteeswarulu NTR Ram Charan) గురించి చెప్పడానికి.. ఇద్దరికీ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఓ మంచి వేదికయ్యిందన్నమాట. కర్టెన్ రైజర్ ఎపిసోడ్ కదా.. సరదా సరదాగా సాగిపోయింది.
అసలు కథ ఇకపై మొదలు కానుంది. కంటెస్టెంట్లకు కంప్యూటర్ జీ (గురువుగారు) సంధించే ప్రశ్నలు, వాటికి కంటెస్టెంట్లు చెప్పే సమాధానాలు.. ప్రశ్న ప్రశ్నకీ మారే సమీకరణాలు.. ఈ క్రమంలో తారక్ పంచే ఎంటర్టైన్మెంట్, అక్కడ పండే ఎమోషన్స్.. వారెవ్వా.. అసలు సిసలు ‘కిక్’ కోసం సిద్ధమైపోండిక.!