Table of Contents
Andhra Pradesh Abdul Kalam.. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుని ఓ జిల్లాకి పెట్టి జబ్బలు చరుచుకుంటున్నారు కొందరు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ స్వర్గీయ ఎన్టీఆర్ సాధించిన పేరు, ప్రఖ్యాతలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కినేని నాగేశ్వరరావు కూడా తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు తన నటనా ప్రతిభతో.
కేవలం నటుడే కాదు, ఆనందంగా ఎలా జీవించాలో తెలియచేసిన వ్యక్తి. క్యాన్సర్‌తో పోరాడుతూ ‘మనం’ సినిమాని పూర్తి చేయడం ద్వారా చివరి శ్వాస వరకూ నటిస్తూనే వచ్చారాయన. గుండెకి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత అత్యధిక జీవిత కాలం పొందిన ఘనత ప్రపంచంలోనే ఆయనకొక్కడికే దక్కింది.
Andhra Pradesh Abdul Kalam.. పేరులో ఏముంది.?
ఎన్టీఆర్ పేరు పెట్టారు, ఏఎన్నార్‌ని మరిచారు.. అంటూ అక్కినేని అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ వర్ధంతికీ, జయంతికీ అందరూ నివాళులు అర్పించకపోవచ్చు. ఏఎన్నార్ విషయంలోనైనా అంతే. కానీ, గురజాడ అప్పారావునీ, కందుకూరి వీరేశలింగం పంతులునీ, పింగళి వెంకయ్యనీ తలచుకోకుండా వుండగలమా.?
జిల్లాల పేర్ల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి చర్చ జరుగుతోంది తప్ప గురజాడ, కందుకూరి, పింగళి పేర్ల ప్రస్థావన ఎందుకు రావడం లేదు.? ఎక్కడో తమిళనాడులో జన్మించినా తెలుగు నేలతో అనుబంధం పెంచుకున్న ‘భారతరత్నం’ అబ్ధుల్ కలాం. అలాంటి మహనీయుడి పేరు కూడా కొత్త జిల్లాలకు పేర్లు పెట్టే సమయంలో పాలకులకు గుర్తు రాలేదు.
పేర్లు.. రాజకీయ పంచాయితీలు.!
జిల్లాల పేర్ల సంగతి పక్కన పెడదాం. ఎవరు అధికారంలో వుంటే, వాళ్లు తమ హయాంలో ఆయా సంక్షేమ పథకాల్లో తమ పేర్లు పెట్టుకోవడం చూస్తున్నాం. తమ మామగారి పేర్లనూ, తండ్రుల పేర్లనూ ఆయా పథకాలకు పెట్టుకుంటూ కుటుంబ కీర్తి పెంచుకుంటున్నారు.
Also Read: చెంచా గిరీ రాజకీయంలో జంతువుల కొట్లాట.!
ఏం.! దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్ముడి పేరు ఏ సంక్షేమ పథకానికీ కనిపించదేం.?
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి గొప్ప దేశ భక్తుల పేర్లు సంక్షేమ పథకాలకి ఎందుకు పెట్టరు.?
ఒకరా.? ఇద్దరా.? పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వున్నాయి మహనీయుల పేర్లు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, ఝాన్సీ లక్ష్మీబాయి.. ఇలాంటి పేర్లేవీ అధికారంలో వున్నవాళ్ళకి గుర్తురావు సంక్షేమ పథకాల విషయంలో అయినా, ఇంకో విషయంలో అయినా.
జనం అలా స్మరించుకునే అవకాశమెందుకిస్తారు.?
తమ రాజకీయ అవసరాల నిమిత్తం, జయంతికో వర్ధంతికో.. ఆయా మహనీయుల్ని స్మరించుకోవడం తప్ప, జనం నిత్యం స్మరించుకునేలా ఆ మహనీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడితే, అదెంత స్ఫూర్తి దాయకం.? పైగా, ఇలాంటి పేర్లు ఏ ప్రభుత్వమైనా పెడితే, ప్రభుత్వాల పేర్లు మారినా.. ఆయా పథకాల పేర్లు మార్చాల్సిన పనే వుండదు కదా.?
ఇంకా నయం.. అంత గొప్పగా మహనీయుల్ని స్మరించుకునే అవకాశాన్ని రాజకీయ నాయకులు, పార్టీలు ప్రజలకెందుకు ఇవ్వాలనే ఆలోచన చెయ్యడమే.? ఇది రొచ్చు రాజకీయం. ఇక్కడ అలాంటి అద్భుతాల్ని ఆశించలేం.
సొమ్ములు జనాలవి. పబ్లిసిటీ పరిపాలిస్తున్నోళ్లది. నవ్విపోదురు గాక వాళ్లకేటి సిగ్గు.!