విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను (Chiranjeevi About Vizag Steel Plant Providing Oxyzen To Entire India) వ్యతిరేకిస్తూ ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నాయి. ‘విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం.. అవసరమైతే ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధం..’ అని కార్మికులు నినదిస్తున్నారు. రాజకీయ పార్టీలు, కార్మికులకు అండగా నిలుస్తున్నా, ఎక్కడో రాజకీయ చిత్తశుద్ధి మాత్రం లోపిస్తోందనేది నిర్వివాదాంశం.
ప్రైవేటీకరణ పేరుతో విశాఖ ఉక్కుని (Visakhanaptnam Steel Plant) చంపేద్దామని కేంద్రం చూస్తోంటే, దేశానికి విశాఖ ఉక్కు.. ఊపిరి పోస్తోందన్న చర్చ, కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో తెరపైకొచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమలో పారిశ్రామిక అవసరం కోసం ఏర్పాటైన ఆక్సిజన్ ప్లాంట్, ఇప్పుడు దేశంలో కరోనా బారిన పడ్డ చాలామందికి ప్రాణవాయువుని అందిస్తోంది.
ఒకటా.? రెండా.? వందల ప్రాణాల్ని కాపాడుతోందిప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమలోని ఆక్సిజన్ ప్లాంట్. ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విశాఖ ఉక్కు (విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు) పరిశ్రమను నష్టాల్లో (Vizag Steel Plant) వుందని చెప్పి ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సబబు.? అని ప్రశ్నించారు మెగాస్టార్.
‘‘దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రెయిన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్ర తీసుకెళుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో వుందని ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం.? మీరే ఆలోచించండి.’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
గతంలో కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కానీ, ‘మీకెందుకు రాజకీయం.?’ అని కొందరు, ‘అసలు ఏం తెలుసు మీకు.?’ అంటూ మరికొందరు చిరంజీవి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ, చాలామంది విశాఖ ఉక్కు పరిశ్రమ, దేశానికి ఊపిరి పోస్తోందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi About Vizag Steel Plant Providing Oxyzen To Entire India) బాధ్యతాయుతంగా స్పందించినందుకు అభినందిస్తున్నారు.
కరోనా విపత్తు వేళ, మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమ పెద్దన్నగా బోల్డన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమ తరఫునే కాదు, వ్యక్తిగతంగానూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న చిరంజీవిపై విమర్శలు చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.