కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీమణులు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. బాలీవుడ్‌లో నటి రియా చక్రవర్తి చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఈరోజు రియాని అరెస్ట్ చేసినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నటీమణులు మాత్రమే ఎందుకు వార్తల్లోకెక్కుతున్నారు.? అసలేం జరుగుతోంది.? (Rhea Chakraborty Sushant Singh Rajput) డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుల మాటేమిటి.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (Sushant Singh Rajput) అనుమానాస్పద మరణం నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలు రావడం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి విచారణ చేపట్టడం తెలిసిన సంగతే. అయితే, బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం ఎప్పటినుంచో వుంది. ప్రముఖ నటులు, పైగా స్టార్ హీరోలు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అది గతం.. ఈసారి పరిస్థితి ఇంకా తీవ్రంగా వుండేలానే కనిపిస్తోంది. కన్నడ సినీ పరిశ్రమ విషయానికొస్తే నటి రాగిణి ద్వివేది (Ragini Dwivedi) అరెస్ట్ అవడంతో ఒక్కసారిగా శాండల్ వుడ్ ఉలిక్కి పడింది. తాజాగా నటి సంజనను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: చేసినప్పుడు లేని సిగ్గు.. చూస్తే వచ్చిందా.?
అంతకు ముందు తనపై డ్రగ్స్ ఆరోపణలు రావడాన్ని సంజన (Sanjana Galrani ఖండించింది. కానీ, ఆమె అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయింది. మళ్ళీ బాలీవుడ్ విషయానికొస్తే, ఏ క్షణాన అయినా రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం ఖాయమంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరిగింది. చివరికి ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అయితే, రియా చక్రవర్తికి సినీ పరిశ్రమలో కొందరి నుంచి నైతిక మద్దతు లభిస్తోంది.
‘ఆమెపై మీడియా వేధింపులకు పాల్పడుతోంది. కేసులు పెడితే సరిపోదు, విచారణలో ఆమె దోషి అని తేలితే తప్ప.. అంతకన్నా ముందు ఆమెను దోషిగా చిత్రీకరించడం తగదు..’ అంటూ విద్యాబాలన్, స్వరా భాస్కర్ తదితర బాలీవుడ్ నటీమణులతోపాటు, సౌత్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే వ్యాఖ్యానించారు.
ఏదిఏమైనా, ఈసారి డ్రగ్స్ ఆరోపణల్లో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అందాల భామల చుట్టూ మరింత ఎక్కువగా ఆరోపణలు రావడం, అరెస్టులు కూడా జరుగుతుండడంతో.. దాదాపు అన్ని సినీ పరిశ్రమలూ ఆందోళన చెందుతున్నాయి.
అయితే, ఇలాంటి వివాదాలు గతంలో కూడా చూసిన దరిమిలా, కొన్నాళ్ళ తర్వాత ఈ ‘రచ్చ’ గురించి ఎవరూ పట్టించుకునేవారే వుండరేమోనన్న అభిప్రాయాలూ విన్పిస్తున్నాయి.