Hockey India Tokyo Olympics.. దేశంలో ‘ఆట’ అంటే ఓ గేమ్ షో.. లేంటే, క్రికెట్ మాత్రమే ఓ ఆటగా పరిగణింపబడుతున్న రోజులివి. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, బ్యాడ్మింటన్ ఆటలో పీవీ సింధు సహా పలువురు స్టార్లు, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, జిమ్నాస్టిక్స్.. ఇలా పలు విభాగాల్లో క్రీడాకారులు గతంతో పోల్చితే, ఇప్పుడు మరింత భిన్నంగా ఆకట్టుకుంటున్నారు. మరి, హాకీ పరిస్థితేంటి.?
ఒకప్పుడు ప్రపంచంలోనే హాకీ ఛాంపియన్స్.. అనగానే, టీమిండియా గుర్తుకొచ్చేది. ఔను, ప్రపపంచ హాకీకి పెద్దన్న టీమిండియా. కానీ, అది ఒకప్పుడు. గత కొంతకాలంగా హాకీ అనే ఆటని జనం దాదాపుగా మర్చిపోయారు. నాలుగు దశాబ్దాలుగా ఒలింపిక్ పోటీల్లో మన హాకీ జట్టు ప్రదర్శన అత్యంత పేలవం. ఇప్పుడు, ఇన్నాళ్ళకు మళ్ళీ హాకీ ఆటలో పతకం సొంతమైంది.
ఆటకు మెడల్స్ మాత్రమే కొలమానమా.? అంటే, ఔను.. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే అదే అసలు సిసలు కొలమానం. భారతదేశానికి పతకాలొచ్చాయనగానే.. ఆయా క్రీడలపై ఇన్‌స్టంట్ క్రేజ్ ఏర్పడుతోంది. ప్రభుత్వాల తరఫున ప్రోత్సాహాకాలూ అలాగే లభిస్తున్నాయి. పతకాలు సాధించిన ఆటగాళ్ళను ఆకాశానికెత్తేస్తున్నారు.. లక్షలు వారి మీద గుమ్మరించేస్తున్నారు. మంచి విషయమే ఇది.
కానీ, ఆట సంగతేంటి.? బ్యాడ్మింటన్ కావొచ్చు, టెన్నిస్ కావొచ్చు, స్విమ్మింగ్ కావొచ్చు, వెయిట్ లిఫ్టింగ్.. జిమ్నాస్టిక్స్.. హాకీ.. షూటింగ్.. ఇలాంటి ఆటలను నేర్చుకోవడానికి దేశంలో అనుకూలమైన పరిస్థితులు వున్నాయా.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. అవకాశాలున్నాయ్.. కానీ, అంతకు మించిన రాజకీయాలున్నాయ్. అదే అసలు సమస్య.
క్రికెట్‌కి దక్కిన స్థాయిలో ఫాలోయింగ్, మిగతా క్రీడల్లో కూడా దక్కితే, ఆ స్థాయిలో ఆయా ఆటల పట్ల చిన్న నాటి నుంచే ఆకర్షణ, అవగాణ పెరిగితే.. భవిష్యత్ క్రీడా భారతం అత్యద్భుతంగా వుంటుందన్నది నిర్వివాదాంశం. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఔను, ఆటల్ని రాజకీయాలకు దూరంగా వుంచడం ఎలా.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.