Table of Contents
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్‌లు అందిస్తున్నారా.? లేదా.? పవన్‌కళ్యాణ్‌కి రాజకీయంగా త్రివిక్రమ్ సలహాదారు పాత్ర పోషిస్తున్నది నిజమేనా.? కాదా.? పవన్ – త్రివిక్రమ్ మధ్య స్నేహం, సినిమాలకే పరిమితం కాకుండా, రాజకీయాల్లోనూ కొనసాగుతోందా.? ఇలాంటి ప్రశ్నలు (Trivikram Helping Hand To Pawan Kalyan For Jana Sena Party) చాలానే తెరపైకొస్తున్నాయి.
వీటిల్లో నిజమెంత, అసలు త్రివిక్రమ్ మనసులో పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి స్థానం వుంది.? ఈ ప్రశ్నలకు సమాధానం త్రివిక్రమ్ చెప్పేశారు. ‘అరవింద సమేత’ సినిమా ప్రమోషన్‌లో త్రివిక్రమ్ ముందు చాలా ప్రశ్నలు క్యూ కడితే, వాటికి ఆయన తీరిగ్గా సమాధానం చెప్పారు.
మాటల మాంత్రికుడు..
మాటల మాంత్రికుడంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమేనేమో తెలుగు సినీ పరిశ్రమలో. ఎందుకంటే, ఆయన మాటలు తూటాల్లా పేలుతాయి. కామెడీ కోసం రాసే మాటలే కాదు.. సీరియస్ టోన్‌లో చెప్పే డైలాగుల్లోనూ పంచ్‌లు పేలుతాయ్. గుండెల్లో సూటిగా గుచ్చుకుంటాయ్ త్రివిక్రమ్ మాటలు. అలా గుచ్చుకునే ప్రతి మాటా, ఆలోచింపజేస్తుంది. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత.
ప్రస్తుతం ఆయన దర్శకుడే అయినా, రచయితగానే ఎక్కువమంది ఆయన్ని అభిమానిస్తుంటారు. ఎందుకంటే, ఆయన మాటల్లో ‘పదును’ అలా వుంటుంది. రచయితగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఖచ్చితంగా వుంటుంది. టాలీవుడ్‌లో హయ్యస్ట్ పెయిడ్ డైరెక్టర్స్‌లోనూ ఆయన టాప్ 3లో వుంటారంటే అది అతిశయోక్తి కాదేమో.
బెస్ట్ ఫ్రెండ్ టు పవన్‌కళ్యాణ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే, పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి గుర్తుకొస్తాడు. పవన్‌కళ్యాణ్‌కి సినీ పరిశ్రమలో స్నేహితులు చాలా తక్కువమందే. ఆ తక్కువమందిలో కమెడియన్ అలీ గురించి మొదట చెప్పుకోవాలి. ఆ తర్వాతి ప్లేస్ ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌దే. ఈ ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే టైమ్ అస్సలు తెలియదట ఇద్దరికీ.
పవన్‌కళ్యాణ్, పుస్తకాల్ని ఎక్కువగా చదువుతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అంతే. ఇద్దరూ సామాజిక అంశాలపైనా చర్చించుకుంటారు. ప్రస్తుత రాజకీయాల గురించి ముచ్చటించుకుంటారు. ఇంకా చాలా చాలా అంశాలు ఇద్దరి మధ్యా చర్చకు వస్తాయి. ఓ మంచి స్నేహితుడితో మాట, మంతి చాలా గొప్పగా వుంటాయనీ, తమ మధ్య స్నేహం చాలా చాలా గొప్పదని ఇటు పవన్, అటు త్రివిక్రమ్ చెప్పడం చూశాం.
జనసేనలో త్రివిక్రమ్ పాత్ర ఏంటి!
పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టే సమయానికే త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. ఆ లెక్కన, రాజకీయ అంశాలు త్రివిక్రమ్ – పవన్ మధ్య చర్చకు రావని ఎలా అనుకోగలం? వచ్చే వుంటాయి. పవన్, తన ఆలోచనల్ని స్నేహితుడైన త్రివిక్రమ్‌తో పంచుకునే వుంటారు. కానీ, ‘పవన్ తన తల్లితో, అన్నయ్యతో కూడా రాజకీయాల గురించి చర్చించి వుండరు. నాతో ఏం చర్చిస్తారు.?’ అని త్రివిక్రమ్, ‘అరవింద సమేత’ ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పడం, పవన్ అభిమానులకు షాక్ ఇచ్చింది.
సందర్భోచితంగా మాట్లాడటం తెలివైనవాడి లక్షణం. బహుశా, ఇక్కడ త్రివిక్రమ్ లౌక్యం ప్రదర్శించారనుకోవాలేమో. జనసేనలో త్రివిక్రమ్‌కి పాత్ర వుండకపోవచ్చు. కానీ, జనసేనానితో త్రివిక్రమ్‌కి వున్న ఆత్మీయ అనుబంధం నేపథ్యంలో.. రాజకీయ పరమైన అంశాలు ఇద్దరి మధ్యా చర్చకు రాకుండా ఎలా వుంటాయి.?
నాయకుడని చెప్పింది త్రివిక్రమే కదా!
‘అజ్ఞాతవాసి’ సినిమా సమయంలో కావొచ్చు, అంతకుముందు పలు సందర్భాల్లో కావొచ్చు.. పవన్ అభిమానుల్ని ఉద్దేశించి త్రివిక్రమ్, ‘మీ నాయకుడికి మంచి పేరు తీసుకురావాలంటే మీరు చాలా బాధ్యతగా వుండాలి..’ అని చెప్పిన మాటల్ని మర్చిపోలేం. నాయకుడిగా పవన్‌ని త్రివిక్రమ్ ఓ సందర్భంలో ప్రమోట్ చేశారు. ‘ఇంతమంది అభిమానాన్ని పొందారంటే, ఆయనలో నాయకత్వ లక్షణాల్ని చూసే కదా.. ఆ అభిమానమే ఆయన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది’ అని త్రివిక్రమ్ చెప్పిన విషయాన్నీ అభిమానులు గుర్తుపెట్టుకున్నారు.
జనసేనకు స్క్రిప్ట్‌లు రాశారా? లేదా?
మంచి కథా రచయిత, మాటల రచయిత అయిన త్రివిక్రమ్‌కి, సామాజిక అంశాలపై పట్టు ఎక్కువ. ఆ అనుభవంతోనే, పవన్‌కళ్యాణ్‌కి కొన్ని స్పీచ్‌ల విషయంలో త్రివిక్రమ్ సహకరించి వుంటే వుండొచ్చుగాక. ‘నాకు అసలే బద్ధకం.. నా స్క్రిప్ట్‌లు నేనే రాసుకోలేను’ అనేయడం ద్వారా త్రివిక్రమ్, పవన్ అభిమానుల్ని కొంత డిజప్పాయింట్ చేసిన మాట వాస్తవం.
అయితే, ‘నేనే రాశాను..’ అనిగానీ, ‘సహకరించాను’ అనిగానీ త్రివిక్రమ్ చెప్పేందుకు వీలు లేని పరిస్థితి. ఎందుకంటే, అలా చెప్పడం ద్వారా ఆయన పవన్ ఇమేజ్‌ని తగ్గించినట్లవుతుంది. బహుశా అందుకే, త్రివిక్రమ్ తనదైన స్టయిల్లో స్పందించారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా, త్రివిక్రమ్ ఏం చెప్పినా.. పవన్‌కి అత్యంత సన్నిహితుల్లో త్రివిక్రమ్ ఒకరన్నది పవన్ అభిమానుల గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని త్రివిక్రమ్ కూడా పోగొట్టుకోరు. ఎందుకంటే, పవన్‌తో ఆయన ఆత్మీయ బంధం అలాంటిది. రాజకీయాలు, స్క్రిప్ట్‌లు.. అది ఆ ఇద్దరు వ్యక్తుల (Trivikram Helping Hand To Pawan Kalyan For Jana Sena Party) అంతర్గత వ్యవహారం. కాబట్టి, అది ఎప్పటికీ సస్పెన్సే.