టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు చెబితే, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఏ ఫార్మాట్ అయినాసరే, బుమ్రా బౌలింగ్ చేశాడంటే ప్రత్యర్థి వణకాల్సిందే. అలాంటి బుమ్రానే తన ప్రేమ బాణాలతో క్లీన్ బౌల్డ్ చేసేసింది (Jasprit Bumrah Ties Knot With Sanjana Ganesan) సంజన.
అదేంటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) కదా, బుమ్రాతో ప్రేమలో వున్నది.? అనే డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు. కానీ, అదంతా ఉత్త పుకార్ల వ్యవహారం మాత్రమే. నిజానికి, బుమ్రాకీ అనుపమ పరమేశ్వరన్‌కీ మధ్య ఎలాంటి ప్రేమాయణం నడవలేదు. అయితే, కాస్త పరిచయం వుండి వుండొచ్చు. ఈ విషయమై అనుపమ కుటుంబ సభ్యులు ఇటీవల స్పష్టత కూడా ఇచ్చేశారు.
ఇంతలోనే అనూహ్యంగా బుమ్రా పెళ్ళి పీటలెక్కేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుండగా, మెయిన్ బౌలర్ అయిన బుమ్రా, వ్యక్తిగత కారణాలతో ‘లీవ్’ కోసం అప్లయ్ చేసుకున్నాడు. ఈలోగా చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. బుమ్రా ఫిట్‌నెస్ లోపంతో బాధపడుతున్నాడనీ, ఇంకోటనీ ఏవేవో గాసిప్స్ వినిపించాయి. ఆ గాసిప్స్ కూడా గాలి కబుర్లేనని తేలిపోయింది.
సంజన గణేషన్ ఇప్పుడు బుమ్రా సతీమణి అయ్యింది. ఇద్దరి మధ్యా గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోందట. అయితే, ఎక్కడా ఈ వ్యవహారం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడు బుమ్రా. సంజన, స్పోర్ట్స్ ప్రెజెంటర్. క్రికెట్ సహా పలు క్రీడలు జరిగినప్పుడు ఆమె ప్రెజెంటర్‌గా వ్యవహరించింది పలు సందర్భాల్లో.
ఎక్కడో ఏ క్రికెట్ మ్యాచ్ సందర్భంగానో బుమ్రాతో సంజనకి (Jasprit Bumrah Ties Knot With Sanjana Ganesan) పరిచయం ఏర్పడి వుండొచ్చు. ఎక్కడో కాదు, ఐపీఎల్ సందర్భంగానేనని కొన్ని ఫొటోల్ని ఇప్పుడిప్పుడే నెటిజన్లు తవ్వి తీస్తున్నారు. ఎలాగైతేనేం, బుమ్రా – సంజన ఒక్కటయ్యారు. ఈ కొత్త జంటకి క్రికెట్ రంగ ప్రముఖులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు.