Table of Contents
‘అమ్మ’ – పబ్లిసిటీ కోసం కాదు. అమ్మని కోల్పోయిన బిడ్డ ఆవేదన, ఆ అమ్మ కోసం పడే తపన.. ఈ క్రమంలో కంటి వెంట వచ్చిన కన్నీరు.. ఇవేవీ ప్రచారాస్త్రాలు కాలేదు. ‘అమ్మ’ అంటూ రాజకీయాలు చేయలేదు. అమ్మ కోసం గెలవాలనుకున్నాడు. ‘నీ బిడ్డ సాధించాడు..’ అని తాను గర్వంగా చెప్పుకునేందుకు గెలుస్తానన్నాడు. గెలిచి చూపించాడు. గెలవడం కోసం ఎన్ని కుట్రలైనా చేయొచ్చనుకోలేదు. గెలవడంలో నిజాయితీని కోరుకున్నాడు. ఆ నిజాయితీకి వందల మంది, వేల మంది, లక్షల మంది మద్దతు పలికారు. అవును, ‘అమ్మ’ గెలిపించింది. కౌశల్ గెలిచాడంటే, ఆ విజయంలో నూటికి నూరుపాళ్ళూ ఇప్పుడు జీవించి లేని ఆమె తల్లి పాత్రే ఎక్కువ. ఎందుకంటే, ఆ తల్లి ఆ కొడుక్కి నిజాయితీని అలవాటు చేసింది. నమ్మిన మాట మీద నిలబడాలన్న నైతిక సూత్రాన్ని కడుపులో వుండగానే నేర్పించింది.
ఈ విజయం ప్రతి అమ్మదీ.!
తన తల్లి క్యాన్సర్‌తో చనిపోయిన విషయాన్ని కౌశల్ ఇదివరకే చెప్పాడు. టైటిల్ గెలవడం ద్వారా వచ్చిన 50 లక్షల రూపాయల్ని, తన తల్లిలా క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లుల కోసం విరాళంగా ఇస్తున్నట్లు కౌశల్ ప్రకటించాడు. ఒకర్ని ఓడించడానికి, మిగతావాళ్ళంతా ‘బంధాలు’ కలుపుకుంటే, కౌశల్ మాత్రం, ‘బంధాలు అనుబంధాల విలువేంటో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు’ అనుకున్నాడు. ‘ఈ ఆట కేవలం హౌస్‌కే పరిమితం. హౌస్ బయట మీతో కౌశల్ చాలా ప్రేమగా వుంటాడు..’ అని షో మగింపుకు వస్తున్న దశలో హామీ ఇచ్చాడు. అదే నిజం. నిజాయితీ అంటే ఇదే.! తన తల్లిలాంటి తల్లుల కోసం బిగ్ ప్రైజ్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా తన విజయాన్ని ప్రతి అమ్మకీ అంకితమివ్వడం ఓ అద్భుత ఘట్టం.
ఒంటరి జీవితం.. అతనికి నేర్పిన పాఠం
‘కార్నర్‌లోకి నేనే వెళ్ళిపోయాను.. అక్కడినుంచి అయితే అందర్నీ చూడొచ్చు..’ అని ఓ సందర్భంలో కౌశల్ ఓ సందర్భంలో చెప్పాడు. నిజమే, అలా చూడటం వల్లే ఎవరేంటో అర్థమయ్యింది. ‘ఆటని ఆటలా ఆడండి.. మీ గెలుపు కోసం ఆడండి..’ అని కౌశల్, ఆయా వ్యక్తులకి చెబితే, ‘మా ఆట గురించి నీకెందుకు.?’ అనేశారు. అలా కౌశల్‌ని లైట్ తీసుకున్నవాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆటని ఆటలా ఆడితే, హౌస్‌లో కుట్రలు జరిగేవి కాదు. హౌస్ వాతావరణమే చెడిపోయేది కాదు. కానీ, కౌశల్ మాటని ఎవరూ లెక్క చేయలేదు. ‘నేనొక్క మాట మాట్లాడితే చాలు.. అందరూ కుక్కల్లా మీదపడిపోతారు..’ అన్న కౌశల్ ఆవేదన వెనుక అర్థమేంటో, జనానికి అర్థమయ్యింది. ఒంటరి జీవితం అనుభవించినోడికే ఆ బాధేంటో అర్థమవుతుంది.
గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది
నిజానికి కౌశల్ విజయం ఇప్పుడు కాదు, ఎప్పుడో ఖాయమైపోయింది. షో చివరి రోజున విన్నర్‌ని ప్రకటించాలి కాబట్టి.. ఇంత టైమ్ పట్టిందంతే. పది మంది కలిసి ఒక్కడ్ని ఓడించాలనుకున్నప్పుడే, ఆ పదిమంది కంటే ఆ ఒక్కడూ బలవంతుడని తేలిపోయింది. సీజన్ మొత్తానికీ కౌశల్‌ని నామినేట్ చేయడంతోనే, అతనెంత బలవంతుడో రన్నరప్‌గా నిలిచిన గీతా మాధురి ఒప్పేసుకుంది. ‘ఎలాగూ ఓడించలేం.. మానసికంగా హింసించేద్దాం.. హౌస్‌లో ఒంటరిని చేసేద్దాం..’ అనుకుంటూ మిగతా హౌస్ మేట్స్ గ్రూప్ కట్టేసినప్పుడే, ఆ గ్రూప్ కౌశల్‌ని విన్నర్‌గా అనధికారికంగా డిక్లేర్ చేసినట్లయ్యింది. సెషన్ మొత్తానికి నామినేట్ చేసేయడంతో, నామినేషన్ సందర్భంగా మళ్ళీ అతనిలోని లోపాల్ని ఎత్తిచూపే అవకాశం దొరకలేదని మిగతా హౌస్‌మేట్స్ డిస్కస్ చేసుకోవడం కూడా కౌశల్ విజయమే.
పదిమంది లెక్క కాదు.. లక్షల మంది వున్నారక్కడ.!
హౌస్‌లో పది మందినో, పదిహేనుమందినో గెలవడం కాదు లెక్క. హౌస్‌లో పరిణామాల్ని చూస్తోన్న లక్షలాది మందిని గెలవడం అసలు లెక్క. ఈ లెక్కలో కౌశల్ పాస్ అయ్యాడు. అమ్మ కోసం గెలవాలన్న తపన.. తానేంటో నిరూపించుకోవాలన్న కసి.. ‘కార్నర్’ అయిన తాను, స్టేజ్ మీద అందరూ కార్నర్‌లో వుంటే.. తాను విజయబావుటా ఎగరవేయాలన్న పట్టుదల.. ఇవీ కౌశల్ విజయానికి కారణం. ప్రతి తల్లీ ఇప్పుడు కౌశల్‌ని తన బిడ్డలానే చూసుకుంటోంది. ఎందుకంటే, ప్రతి తల్లీ బిగ్ హౌస్‌లో కౌశల్ అనుభవించిన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది. అలా అమ్మలందరి ఆశీర్వాదం కౌశల్‌ని గెలిపించింది.