Table of Contents
Love Story Review.. సినిమా అంటే ఈ రోజుల్లో ఏముండాలె.? మూతి ముద్దులుండాలె.. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలుండాలె.. హీరోయిన్ బీభత్సంగా అందాల ప్రదర్శన చేసెయ్యాలె.. దాంతోపాటు ఓ ఐటమ్ సాంగ్.. కొన్ని బూతు జోకులు.. దీన్ని కమర్షియల్ ఫార్మాట్ అంటున్నాం. ఈ కమర్షియల్ అంశాల నడుమ కథ, కాకరకాయ్ ఎవరికీ అనవసరం.
సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం. అందుకే, సినిమా సెలబ్రిటీలంటే అంత క్రేజ్. మరి, అంత ఫాలోయింగ్ వున్న సెలబ్రిటీలు వీలు చిక్కినప్పుడల్లా కమర్షియల్ సినిమాల నుంచి చిన్నగ్యాప్ తీసుకుని, సందేశాత్మక సినిమాల్లో నటిస్తే ఎలా వుంటుంది.?
Love Story Review.. ఇలా ట్రై చెయ్యండి పెద్ద సార్లూ..
‘లవ్ స్టోరీ’ సినిమా చూడంగానే చాలామందికి స్టార్ హీరోలు, హీరోయిన్లు సందేశాత్మక సినిమాలు వీలైనప్పుడల్లా చేస్తే ఎంత బావుంటుందోననిపిస్తుంది. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఆ మ్యాజిక్ వుంది. చెప్పాలనుకున్న విషయాన్ని గీత దాటకుండా దర్శకుడు చెప్పాడంటే, ఆ విషయం పట్ల దర్శకుడికి ఎంత బాధ్యత వుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: నాగచైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’కి ‘ఫిదా’ అవ్వాల్సిందే.!
డాన్స్.. డాన్స్ డాన్స్.. దీని చుట్టూనే దర్శకుడు కథ రాసుకున్నాడన్న భావన తొలుత సినిమా ప్రోమోస్ చూశాక అనిపించడం మామూలే ఎవరికైనా. సినిమా చివర్లో ఇలా షాకిచ్చి అలా ముగించేశాడు సినిమాని దర్శకుడు. దాంతో, అసలు విషయాన్ని ఇంకాస్త లోతుగా చర్చించి వుంటే బావుండేది.. అన్న భావన కలుగుతుంది.
అందరికీ కనెక్ట్ అయ్యే విషయమే..
మన సమాజంలో ఇలాంటివి వున్నాయా.? అని కొద్ది మంది ప్రశ్నించొచ్చుగాక. చాలామందికి ఇది అనుభవమే. ఎందుకంటే, ఎవరైతే ఆ పెయిన్ అనుభవిస్తారో.. ఎవరైతే ఆ నొప్పికి కారకులవుతారో.. ఇద్దరూ బయటపడరు. అదే అసలు సమస్య.
అందుకే, సినిమాలో చూపించిన ‘సమస్య’ చాలామందికి కనెక్ట్ అయినా, ‘అబ్బే.. అలా వుండదు’ అని బయటకు లైట్ తీసుకున్నట్టు కనిపించినా కనిపించొచ్చు.
Also Read: సాయిపల్లవి ‘సారంగ దరియా’ లవ్లీగా వుందిగానీ.!
నాగచైతన్య ఈ సినిమాలో హీరోలా కనిపించలేదు. రేవంత్ అనే పాత్రలో జీవించేశాడు. సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పేదేముంది.? అద్భుతః అనాల్సిందే. అయినాగానీ, దర్శకుడు ఇంకా బాగా ఈ ఇద్దరి పాత్రల్నీ తీర్చిదిద్ది వుంటే బావుండేది.. అనిపిస్తుంది. కారణం, నటనలో ఇద్దరూ అంతకు మించి ప్రతిభ చూపించగలరు గనుక.

సందేశాత్మకం.. బాధ్యతాయుతం..
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమాటిక్.. అన్న మాటే లేదు.. అన్నీ సహజమైన అందాలే.. ఇంకా సహజంగా తన కెమెరాలో బంధించేశాడు. ఎడిటింగ్ విషయంలోనే, కొంచెం కత్తెర పదును తక్కువయ్యిందనిపిస్తుంది. సంగీతం బావుంది. పాటలు ఆకట్టుకున్నాయ్.
నిజానికి, ఇలాంటి సినిమాల గురించి చర్చ జరగాలి.. ఇందులో లోటుపాట్లను వెతక్కూడదు. ఓ అమ్మాయి చిన్న వయసు నుంచి, కుటుంబ సభ్యుల నుంచే ‘వేధింపులు’ ఎదుర్కొనడమంటే.. అది అత్యంత బాధాకరమైన విషయం.
‘నీతోని ఏదీ కాదు’ (నీ వల్ల ఏమీ కాదు) అన్న మాట యువతీ యువకుల్ని ఎంత బాధపెడుతుందో రేవంత్, మౌని పాత్రలతో చూపించాడు దర్శకుడు. అందుకు శేఖర్ కమ్ములకు హేట్సాఫ్ చెప్పితీరాల్సిందే. సరదాగా సాగే ప్రథమార్థం.. చివరికొచ్చేసరికి.. ఓ షాకింగ్ ట్విస్ట్.. అంతిమంగా ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్.. అనొచ్చు ‘లవ్ స్టోరీ’ సినిమాని. అయితే, సామాజిక వర్గాల మధ్య అంతరాల అంశాన్ని ఇలా టచ్ చేసి అలా వదిలేసినట్లనిపిస్తుంది.
సినిమా థియేటర్లకు వెళ్ళి తొలి రోజు, తొలి షో చూసేసి.. విషయం ఇదీ.. అని తేల్చేసి, సినిమా మీద పాజిటివ్ లేదా నెగెటివ్ ఒపీనియన్ చెప్పేసి సినిమాని పైకి లేపడమో, చంపెయ్యడమో చేయడం కంటే.. కాస్త ఆలస్యమైనా ఓటీటీలో సినిమా చూసి అభిప్రాయం.. ఇదిగో ఇలా వ్యక్తం చేస్తే ఆ కిక్కే వేరప్పా..!
– BeeyeS