Table of Contents
Mahalaya Amavasya.. జన్మనిచ్చినందుకు పితృ దేవతల రుణం తీర్చుకోవాలంటారు పెద్దలు.
అందుకోసం వారు శివైక్యం చెందిన తర్వాత ఆయా తిధులననుసరించి పితృ తర్పణాలూ, శ్రాద్ధ కర్మలు ఆచరించడం మన భారతీయ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం.
అయితే, ఈ పితృ తర్పణాలు ఎప్పుడు చేయాలి.? ఎలా చేయాలి.? అని ఇప్పుడు తెలుసుకుందాం.
అమావాస్య తిధిని పితృ పర్వంగా పేర్కొంటారు. అమావాస్యలలో మహాలయ అమావాస్యకు ప్రత్యేకమైన విశిష్టత వుంది.
Mahalaya Amavasya.. మహా పితృ పర్వం..
‘మహం ఆలం యాత్ ఇతి మహాలయం..’ అంటే ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాల ద్వారా పితృ దేవతలు చాలినంత తృప్తిని పొందుతారన్న మాట.
మహాలయ అమావాస్యనాడు తమ పుత్రులు తమ స్తోమతకు తగ్గట్లుగా పితృదేవతలను ఆరాధించాలి.
పితృదేవతల పేరున దాన ధర్మాలూ, బ్రాహ్మణులకు స్వయంపాకాలు అందచేస్తే మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయ్.
తద్వారా పితృ దేవతలు తృప్తి చెంది, ఆ ఇంట అన్న వస్త్రాలకు లోటు లేకుండా సకల ఐశ్వర్యాలూ తమ పుత్రులకు కలగాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని ప్రతీతి.
అలా మహాలయ అమావాస్య పితృ దేవతలకు అత్యంత ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు.
మిగిలిన అమావాస్యల్లో కుదరకపోయినా.. ఈ మహాలయ అమావాస్య నాడు తమ పితృదేవతలకు శాస్త్రోక్తంగా దాన ధర్మాలు చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ఎలా ఆచరించాలి.?
ఇంట్లో పితృ దేవతలను తలచుకుంటూ వారికిష్టమైన అన్న ప్రసాదాలు నివేదించి, వారి పేరు చెప్పి అన్న వస్త్రాలను దానం చేస్తే మంచిది.
ఇంట్లో కుదరని వారు దేవాలయాల్లో బ్రాహ్మణులకు స్వయం పాకం అందించినా సరిపోతుంది. పేద వారికి అన్న దానం, వస్త్ర దానం చేయొచ్చు.
అది కూడా కుదరని వారు నదీ తీరాన స్నానమాచరించి, మనసులో పితృ దేవతలను తలచుకుని జల తర్పణం చేసినా చాలు వారు సంతృప్తి చెందుతారు.
మహాలయ అమావాస్య నాడు చేసిన ఏ చిన్న దానమైనా పితురుల సంతృప్తికి కారణమవుతుంది. తద్వారా వారి ఆశీర్వాదాలు పుత్రులకు లభిస్తాయ్.
సంకల్పం..
ఒకవేళ ఏ కారణం చేతైనా కుదరని వారు (సూతకం తదితర కారణాలు) మహాలయ అమావాస్య రోజు మత పితృల్ని తలచుకుని, ఏం చేయదలచారో దాన్ని మనసులోనే సంకల్పించుకోవాలి.
పరిస్థితులు చక్కబడ్డాకా అయినా ఆ దానాలు చేసి, పితృ దేవతలను సంతృప్తిపరచొచ్చని పండితులు చెబుతున్నారు.
Also Read: ‘పరదా’ రివ్యూ.! ఆంక్షల పరదా తొలగించే ప్రయత్నమేగానీ.!
శ్రాధ్ధం ఎంత శ్రధ్ధగా ఆచరించారన్నదే ముఖ్యం. అంతేకానీ, ఏ వస్తువు ఎంత ఘనంగా సమర్పించారు.. అన్నది ముఖ్యం కాదు.
అన్నార్తుల ఆకలి తీర్చడం ద్వారా చేసి శ్రాధ్ధ కర్మ మరింత ఫలితాలిస్తుంది. తద్వారా పితృదేవతల అనుగ్రహం దండిగా లభిస్తుందని జ్యోతిష్య పండితుల సూచన.
గమనిక:
ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం మరియు కొందరులు జ్యోతిష్యులు, పండితుల సలహాలూ, సూచనల ద్వారా సేకరించబడినది.
కేవలం అవగాహన కోసం మాత్రమే. అలాగే మన శాస్త్ర సంప్రదాయాలను గౌరవించడంలో భాగం కూడా.
