Chandrababu.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి పెద్ద కష్టమే వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఇన్నేళ్ళ రాజకీయంలో ఏనాడూ చంద్రబాబు ఇలాంటి జుగుప్సాకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదన్నది నిర్వివాదాంశం. మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా భ్రష్టుపట్టిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత.. తన కుటుంబ సభ్యుల్ని అవమానిస్తున్నారంటూ మీడియా ముందు కంటతడి పెట్టే పరిస్థితి రావడమంటే, అసలు ప్రజాస్వామ్యమనేదే లేదని అర్థం. చట్ట సభల సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతకు అవమానం జరిగింది. అది కూడా, చంద్రబాబు సతీమణిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అధికార పక్ష సభ్యులు చేయడం ద్వారా జరిగిన అవమానం కావడం మరింత బాధాకరం.
Chandrababu Naidu.. కన్నీరు.. ఇదా పద్ధతి.?
సరే, చంద్రబాబు గతంలో ఏం చేశారు.? ఏం చేయించారు.? అన్నది వేరే చర్చ. అప్పుడలా చేశారు కాబట్టి, ఇప్పుడిలా ఆయనకు శాస్తి జరిగిందని ఎవరైనా భావిస్తే.. అలాంటివారంతా, దిగజారుతున్న వ్యవస్థని తామూ మరింత దిగజార్చేస్తున్నట్లు ఒప్పుకున్నవారే అవుతారు.

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ఇదా విమర్శలు చేసే పద్ధతి. చట్ట సభల ద్వారా సభ్య సమాజానికి ప్రజా ప్రతినిథులు ఏం సంకేతాలు పంపుతున్నారు.? ఇప్పుడిక చంద్రబాబు ఈ అవమానాన్ని మనసులో పెట్టుకుని, భవిష్యత్తులో అధికార పీఠమెక్కి కక్ష సాధింపు చర్యలకు దిగితేనో.!
వైఎస్ జగన్ కూడా బాధితుడే మరి.!
నిజానికి, చంద్రబాబు మాత్రమే దూషణల బాధితుడు కారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దూషణల్ని ఎదుర్కొన్నారు. అసలు అలా దూషణలే రాజకీయమని చెలరేగిపోతున్నవారికి రాజకీయాల్లో ఆయా పార్టీల నుంచి ప్రోత్సాహమెలా లభిస్తోందో ఏమో.! ప్రజలైనా ఇలాంటివారిని చట్ట సభలకు పంపేముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకుంటే మంచిది.
Also Read: ది ‘గ్రేట్’ సొల్లు పురాణం! మూర్ఖులకి అర్థమయ్యిందిదే!
ఏదిఏమైనా, అధికార పక్షం ప్రదర్శించిన జుగుప్సాకరమైన తీరుతో చంద్రబాబు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఇకపై అసెంబ్లీకి హాజరయ్యేది లేదని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి అయ్యాకనే సభలో అడుగు పెడతాననీ శపథం చేసేశారు. అది సాధ్యమా.? కాదా.? అన్నది ప్రజలే నిర్ణయించాలి.