Table of Contents
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సూపర్ స్టార్ అవతరించాడు. అతని పేరు విజయ్ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కన్పించిన విజయ్ దేవరకొండ, ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే, ఆషామాషీ విషయం కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమా విజయ్ దేవరకొండకి సోలోగా సూపర్బ్ కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ద్వారక’ అనే సినిమాతో కాస్త నిరాశపడ్డా, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పుంజుకున్నాడు. పుంజుకోవడమేంటి, తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేశాడు. అసలు తెలుగు సినిమా ట్రెండ్‌నే కొత్త రూట్‌లో పరుగులు పెట్టేలా చేశాడు. అంతలోనే ‘గీత గోవిందం’ అనే సినిమాతో వసూళ్ళ పంట పండించేశాడు. ఇంత తక్కువ స్పాన్‌లో ఇంత గ్రాండ్ ఇమేజ్‌ని సంపాదించడం బహుశా విజయ్ దేవరకొండకే చెల్లిందేమో.!
రౌడీస్.. అంటూ స్టార్‌డమ్ సంపాదించేశాడు
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్లకు కొదవ లేదు. కానీ, విజయ్ దేవరకొండ డిఫరెంట్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. సాధారణ యువతీ యువకుల్నే తన అభిమానులుగా మలచుకున్నాడు విజయ్. తనదైన ఆటిట్యూడ్‌తో వారిని కట్టి పడేశాడు.. వాళ్ళంతా తన అభిమానానికి కట్టుబడి వుండేలా చేయగలిగాడు. తన సినిమాలతో, తన ప్రవర్తనతో.. హీ ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్ అన్పించుకున్న విజయ్.. అనూహ్యంగా, స్టార్‌డమ్ దక్కించుకుని.. దాన్ని నిలబెట్టుకున్నాడు. స్టార్ డమ్ దక్కడం తేలికే, దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఈ విషయంలో ఇప్పటిదాకా విజయ్‌కి తిరుగు లేదు. ఇక ముందూ విజయ్ దేవరకొండకి ఎదురే లేదని చెప్పొచ్చేమో.
అసలు ఏంటీ ‘నోటా’
సినిమా సినిమాకీ వైవిద్యాన్ని చూపిస్తోన్న విజయ్ దేవరకొండ, ‘నోటా’ సినిమాకి సైన్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోలు సైతం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాల్ని టచ్ చేసి దెబ్బ తినేసినవాళ్ళే. చాలా అరుదుగా మాత్రమే పొలిటికల్ సినిమాలు వర్కవుట్ అయ్యాయి. అయితే ఈ మధ్య కాస్త ట్రెండ్ మారిందనుకోండి. అది వేరే సంగతి. మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో మాంఛి హిట్ కొడితే, అంతకు మించిన హిట్ కొట్టేందుకు విజయ్ ‘నోటా’తో రెడీ అయిపోయాడు. ఇదో యువకుడి కథ. ఆ యువకుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడన్నది అసలు కథ. పబ్బులో తిరిగే కుర్రాడు, నేటి కుళ్ళు రాజకీయాలపై తిరగబడితే ఎలా వుంటుందో చెప్పే కథ. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తని ఏరిపారేసే పాత్ర విజయ్‌ది.
‘నోటా’ చుట్టూ రాజకీయ రచ్చ
అసలు ఈ సినిమాని బ్యాన్ చేసెయ్యాలంటూ చాలా రచ్చ జరిగింది. కొంతమంది న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించారు. ఈ సినిమా ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వుందన్నది కొందరి వాదన అయితే, ఏ రాజకీయ పార్టీకీ ఓటెయ్యద్దని చెప్పేలా సినిమా వుందంటూ ఇంకొందరు ఆరోపించారు. సినిమాలో రాజకీయ నాయకుల్ని ఉద్దేశించి హీరో తిట్టే బూతులపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నిటినీ విజయ్ దేవరకొండ లైట్ తీసుకున్నాడు. నిజానికి వివాదాలు విజయ్ దేవరకొండకి కొత్త కాదు. తనను టార్గెట్ చేసిన రాజకీయ పార్టీలు, నాయకులపై సినిమా ప్రమోషన్ సందర్భంగా విరుచుకుపడిపోయాడు. అది అతని ‘రౌడీస్’కి ఇంకా బాగా నచ్చేసింది.
సూపర్ స్టార్ ఇమేజ్‌కి కాస్త దూరంలో
ఆల్రెడీ స్టార్ హీరో ఇమేజ్ దక్కించేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’ సినిమా 60 కోట్ల షేర్ సాధించడమే ఇందుకు నిదర్శనం. అంతకు మించి, అతనికి ఫాలోయింగ్ కూడా అతని స్టార్‌డమ్‌కి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి జస్ట్ కాస్త దూరంలో వున్నాడు విజయ్ దేవరకొండ.. సూపర్ స్టార్ అనే ఛెయిర్‌కి. ఆ అరుదైన గౌరవం కూడా విజయ్ దేవరకొండకి ‘నోటా’తో దక్కేస్తుందనే గట్టి నమ్మకంతో వున్నారు ‘రౌడీస్’. విజయ్ దేవరకొండకి ఇప్పుడున్న ఫాలోయింగ్ చూస్తే అది నిజమే అన్పించకమానదు.
టాలీవుడ్ మాత్రమే కాదండోయ్..
తెలుగు సినిమా మాత్రమే కాదు.. తమిళంలోనూ, కన్నడలోనూ, మలయాళంలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది విజయ్ దేవరకొండకి. ఆయా భాషల్లో విజయ్ దేవరకొండకి అభిమానులూ, అభిమాన సంఘాలూ ఏర్పడిపోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా తమిళనాడులో అయితే ‘నోటా’ విడుదల కోసం ఓ స్టార్ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లే ఎదురుచూసేస్తున్నారు. కేరళ వరదల సందర్బంగా టాలీవుడ్ నుంచి మొట్టమొదటగా స్పందించి, విరాళం ప్రకటించిన విజయ్.. అక్కడా అభిమానుల్ని సంపాదించేసుకున్నాడు. సో, ఎలా చూసినా ‘నోటా’ ఓ ప్రభంజనం కానుందన్నమాట.