‘మీ టూ’ అనే ఉద్యమం (Payal Ghosh MeToo Kangana Ranaut) కొన్నాళ్ళ క్రితం ప్రముఖంగా తెరపైకొచ్చింది. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ఉద్యమాన్ని ఓ స్థాయికి తీసుకెళ్ళగలిగారుగానీ, అనూహ్యంగా అంతా ‘కామప్’ అయిపోయింది.
మళ్ళీ ఇప్పుడు కంగనా రనౌత్, పాయల్ ఘోష్ తదితరుల కారణంగా ఈ ‘మీ టూ’ ఉద్యమానికి మళ్ళీ కొత్త ఊపు వచ్చేలా కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ పాయల్ ఘోష్.
Also Read: కంగనా రనౌత్.. దీన్నేమంటారు.?
తెలుగులో ‘పరిచయం’, ‘ఊసరవెల్లి’ తదితర సినిమాల్లో నటించిన పాయల్, హిందీలోనూ ఒకటీ అరా సినిమాల్లో నటించింది. అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక, చాలామంది హీరోయిన్లను ఆయన వాడుకుని వదిలేశాడని ఆరోపించింది. పాయల్ ఘోష్‌కి ఈ విషయంలో మద్దతుగా నిలిచింది కంగనా రనౌత్.
బాలీవుడ్‌లో చిన్న హీరోలు, పెద్ద హీరోలన్న తేడా లేకుండా అందరూ హీరోయిన్లను వాడేస్తారని ఆరోపించింది కంగన. అక్కడితో ఆగనలేదామె. కొందరు సినీ ప్రముఖుల పెళ్ళిళ్ళనీ ఫేక్ అని తేల్చేసింది. యంగ్ హీరోయిన్ల మీద హీరోలకి మోజెక్కువనీ, వివాదాలు రాకుండా వుండేందుకు కొందరు పెళ్ళి అనే డ్రామా ఆడతారనీ కంగన ఆరోపించడం గమనార్హం.
బాలీవుడ్‌పై ‘డ్రగ్స్’ ఆరోపణల్ని కంగన చాలా గట్టిగానే చేసిన విషయం విదితమే. పాయల్ ఘోష్ విషయానికొస్తే, అనురాగ్ కశ్యప్‌పై ఆమె చేసిన వ్యాఖ్యల్ని మరో హీరోయిన్ తాప్సీ ఖండించింది. అనురాగ్ కశ్యప్ చాలా మంచోడని చెబుతూ పరోక్షంగా ఇటు కంగనకీ, అటు పాయల్ ఘోష్‌కీ ఝలక్ ఇచ్చింది తాప్సీ.
Also Read: తాప్సీ అపరిచితురాలు.. ఇదిగో సాక్ష్యం.!
కాగా, కంగనా రనౌత్ మద్యానికి బానిసైపోయిందనీ, ఆ తర్వాతే ఆమె ఇలా తయారయ్యిందనీ అనురాగ్ కశ్యప్ ఆరోపించడం గమనార్హం. ‘మీ టూ’ అనేది జస్ట్ పబ్లిసిటీ స్టంట్.. అనే కొందరి విమర్శల సంగతెలా వున్నా, అదొక ‘పబ్లిసిటీ స్టంట్’ తరహాలోనే వేడెక్కి మళ్ళీ చల్లారిపోయింది.
ఇప్పుడిక పాయల్ – కంగనా ఈ రెండో దఫా ‘మీ టూ’ ఉద్యమాన్ని ఎక్కడిదాకా తీసుకెళతారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరీ ముఖ్యంగా అస్సలేమాత్రం కెరీర్‌లో యాక్టివ్‌గా లేని పాయల్ ఘోష్ కేవలం పాపులారిటీ కోసం ఈ వివాదాన్ని రాజేసిందన్న విమర్శల నేపథ్యంలో.. ఆమె ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి, తన నిజాయితీని నిరూపించుకుంటుందో లేదో వేచి చూడాలి.