Revanth Reddy Congress CM.. రేవంత్ రెడ్డి అను నేను.. అని డిసెంబర్ 7న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలోనే, రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయ్యారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాల ప్రకారం, ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే ఫైనల్ చేస్తుంది. అదీ ఎన్నికల తర్వాత.
Revanth Reddy Congress CM.. కాంగ్రెస్ రాజకీయాలు వేరే..
సాధారణంగా పీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీలో ఒకింత ప్రత్యేక వాతావరణం వుంటుంది. గతంలోకి తొంగి చూస్తే, పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులవడం దాదాపు అసాధ్యమే.
కానీ, ప్రజా క్షేత్రంలో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన పోటీలోనూ విజయం సాధించగలిగారు.
ఇంకాస్త గతంలోకి తొంగి చూస్తే, సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓడిపోయాక, అనూహ్యంగా లోక్ సభ బరిలో నిలిచి, సత్తా చాటారు.
టీడీపీలో కీలక నేతగా ఎదిగి, తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో వుండటంతో పార్టీ మారి, కాంగ్రెస్‌లో హేమాహేమీల్ని తట్టుకుని నిలబడటం అంటే కత్తి మీద సాము లాంటిదే.
పైగా, అన్ని ఇబ్బందుల్నీ అధిగమించి.. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవి సంపాదించడమే చాలా చాలా కష్టమైన వ్యవహారం.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..
అంతటి అసాధ్యాన్నీ సుసాధ్యం చేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికై, ఇప్పుడు ముఖ్యమంత్రి అవడమంటే చిన్న విషయం కాదు.
Also Read: మెగా కుటుంబం.! సరిపోతుందా ఈ సమాధానం.?
పైగా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిపోయి, నానా రకాల ఆరోపణల్నీ రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నారు. రాజకీయ జీవితం సమాధి అయిపోయిందన్న పరిస్థితుల నుంచి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం మామూలు విషయమా.?
ఇప్పుడైతే, రేవంతుడు.. అతి బలవంతుడు.! రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతారా.? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రిగా తనదైన సంతకం చేసి, ‘భళా’ అనిపించుకుంటారా.? వేచి చూడాల్సిందే.