Table of Contents
Sundareswara Swamy Temple.. దెయ్యాలకు దేవాయాల్లోకి నో ఎంట్రీ. చాలా దెయ్యాల సినిమాల్లో మనం చూశాం దెయ్యాల నుండి కాపాడుకోవడానికి హీరోలూ, హీరోయిన్లు గుడిలోకి వెళ్లి దాక్కోవడం.
అలాంటిది దెయ్యాలు గుడి కట్టడమేంటి చెప్మా. వింతగా లేదూ.. అనుకుంటున్నారా.? అందుకేనండీ ఇదో వింత దేవాలయం.
నిజంగా ఈ గుడిని దెయ్యాలే కట్టాయట. దెయ్యాలే ఆ గుడిని కట్టాయన్నందుకు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా వుంది ప్రాచుర్యంలో. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా స్టోరీ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకెందుకాలస్యం ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.
Sundareswara Swamy Temple.. దెయ్యాలు ఎందుకు ఆ దేవాలయాన్ని నిర్మించాయ్.?
కర్ణాటకలోని బొమ్మవరె అనే ఊరిలో ఈ వింత దేవాలయం ఉంది. అక్షరాలా దెయ్యాలే ఈ దేవాలయాన్ని నిర్మించాయట.
దాదాపు 600 సంవత్సరాల క్రితం ఆ ఊరిని దెయ్యాలు పట్టి పీడించేవట. అక్కడి జనాలకు నిద్ర లేకుండా చేసేవట.ఆ దెయ్యాలకు భయపడి ఆ ఊరిలో అడుగు పెట్టాలంటే, బయటి గ్రామాల వాళ్లు హడలిపోయేవారట.
ఆ ఊరి జనాలు బిక్కు బిక్కుమంటూ తప్పక జీవనం సాగించేవారట. అదే ఊళ్లో బుచ్చయ్య అనే మంత్రగాడు ఉండేవాడట.
బుచ్చయ్య పేరుకు మంత్రగాడే అయినా, పరమ శివునికి అరి వీర భక్తుడట. దెయ్యాల బాధను తట్టుకోలేక, వాటి నుండి కాపాడమని, ఆ ఊరి జనం బుచ్చయ్యను వేడుకోగా..
కొన్ని ఏళ్ల పాటు పరమ శివుని ధ్యానం చేసి, దెయ్యాలను ఆవాహనం చేసుకునే మంత్ర, తంత్రాలను తెలుసుకున్నాడట బుచ్చయ్య.
Sundareswara Swamy Temple.. దెయ్యాలకే షరతు పెట్టిన మాంత్రికుడు
ఊరి జనాలకు దెయ్యాల భయం పోయేందుకు ఆ ఊరిలో ఓ శివాలయం నిర్మించ తలపెట్టాడట బుచ్చయ్య. అనుకున్నదే తడవుగా, ఊరి జనం సహాయంతో శివాలయం నిర్మించాడట.
అద్భుతంగా ఓ మహిమాన్విత శివాలయం రూపుదిద్దుకుందట. కానీ, అక్కడ గుడి కట్టడం ఇష్టం లేని దెయ్యాలు, రాత్రికి రాత్రే ఆ గుడిని ద్వంసం చేశాయట.
దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బుచ్చయ్య, శివుని వరంతో, తన వద్ద ఉన్న శక్తినంతటినీ ఉపయోగించి ఆ దెయ్యాలన్నింటినీ బంధించేశాడట. అక్కడితో దెయ్యాల పీడా విరగడయ్యిందనుకున్నారంతా.
కానీ, బంధీలయిన దెయ్యాలు తమను విడిచిపెట్టమంటూ బుచ్చయ్యను దీనంగా వేడుకున్నాయట. దాంతో దయ తలచిన బుచ్చయ్య, రెండు షరతుల మీద వాటికి విముక్తి ప్రసాదించాడట.
అందులో ఒకటి ఆ దెయ్యాలు కూల్చిన గుడిని వారే తిరిగి నిర్మించాలనీ, రెండోది ఇంకెప్పుడూ ఆ ఊరి జనాలకు దెయ్యాల పీడ ఉండకూడదనే షరతులు పెట్టాడట.
దాంతో రాత్రికి రాత్రే దెయ్యాలు ఆ గుడిని తిరిగి నిర్మించేసి, ఆ ఊరిని విడిచి పెట్టి వెళ్లిపోయాయట.
అక్కడ అన్నీ దెయ్యాల బొమ్మలే..
అయితే, ఈ గుడిలో మరో విశేషముంది.. గుడి గోపురాలపై సహజంగా దేవతల విగ్రహాలుంటాయి. కానీ, ఈ గుడిలో మాత్రం అన్నీ దెయ్యాల బొమ్మలే ఉంటాయట.

గుడి మాత్రమే నిర్మించి దెయ్యాలు అంతర్ధానమైపోగా, ఆ తర్వాత ఆ గుడిలో పరమ శివుని ప్రతిష్టాపన జరిగింది. సుందరేశ్వరునిగా ఈ గుడిలోని శివుడు పూజలందుకుంటున్నాడు.
సుందరేశ్వరుని ప్రత్యేకత ఏంటంటే..
సుందరేశ్వరుని ఆలయంలో శివలింగానికీ ఓ ప్రత్యేకత ఉంది. మంచి నీటి బావి కోసం గుంత తీస్తుండగా, ఓ శివ లింగం బయట పడిందట.
ఆ శివలింగం దాదాపు 8 అడుగుల ఎత్తుతో అంతి సుందరంగా, చూడగానే మనసుకు ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ కలిగించేలా, ప్రశాంతమైన వఛ్చస్సుతో మెరిసిపోతూ దర్శనమిచ్చిందట.
Also Read: కాల భైరవుడికి ‘మద్యం’తో నైవేద్యం.! కిక్కు ఎక్కించే భక్తులు.!
ఈ ప్రత్యేకమైన శివ లింగం కారణంగానే ఈ గుడికి సుందరేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చిందనీ అంటుంటారు. అంతేకాదు, ఇంత ఎత్తైన శివ లింగం ఆ రాష్టంలో మరెక్కడా లేదని ప్రతీతి.
ఇదండీ దెయ్యాలు కట్టిన గుడి కథ. గుడి చుట్టూ గోపురాలపై దెయ్యాల బొమ్మలున్నప్పటికీ, గర్భగుడిలోనికి వెళ్లగానే పరమ శివుని లింగాన్ని చూసిన భక్తులు అపురూపమైన, ఆహ్లాదమైన ఆనుభూతికి లోనవుతారు.