Table of Contents
సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కష్టపడితే వచ్చే ఔట్‌పుట్. ఇందులో ఏ ఒక్క విభాగం సరిగ్గా పనిచేయకపోయినా అంతే సంగతులు. అందరూ సరిగ్గా పనిచేసినా, ఒక్కోసారి ‘లక్కు’ కలిసిరాదు. సినిమా రిలీజ్ అంటే, ‘పురిటి నొప్పులతో సమానం’ అనేవారు ఒకప్పటి నిర్మాతలు. అందుక్కారణమూ లేకపోలేదు. సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే, ఆ సినిమాని సకాలంలో రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు.
ఈ మధ్య ప్రతి సినిమాకీ ‘పైరసీ’ పెను శాపంగా మారుతోంది. పైరసీ అనేది సినిమా రిలీజ్ అయ్యాక సోకే రోగం. కానీ, ‘లీక్’ అనే ముందస్తు రోగం, సినిమాల్ని, సినిమా పరిశ్రమనీ ఆందోళనకు గురిచేస్తోంది. అలా ‘ట్యాక్సీవాలా’ సినిమాకి ముందస్తుగా ‘లీక్’ వైరస్ పట్టేసింది. అవును, ‘ట్యాక్సీవాలా’ సినిమా విడుదలకు ముందే లీక్ అయ్యింది. ‘లీక్’ చేసిన ‘కల్‌ప్రిట్’ని పట్టుకోవడం జరిగినా, సినిమాకి జరగకూడని నష్టమే జరిగిపోయింది. ఇక సినిమాని విడుదల చేయడం దండగని అందరూ అనుకున్నా, ధైర్యంగా సినిమాని విడుదల చేస్తున్నారు. నవంబర్ 17న ‘ట్యాక్సీవాలా’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.
స్టార్ ఇమేజ్‌కి కాస్త దూరంలో
స్టార్ స్టార్ సూపర్ స్టార్.. అని అందరూ విజయ్ దేవరకొండని ముందుగానే అభినందించేస్తున్న తరుణంలో, ‘నోటా’ సినిమా రూపంలో అతనికి ఓ ఫ్లాప్ వచ్చిపడింది. ‘నోటా’ సినిమా ఓ మోస్తరుగా ఆడి వున్నా, విజయ్ దేవరకొండ ఇమేజ్ ఇప్పుడు ఇంకోలా వుండేది. సినీ పరిశ్రమలో జయాపజయాలు మామూలేనని అర్థం చేసుకోవడానికి విజయ్ కొంత టైమ్ తీసుకున్నాడు. తేరుకున్నాడు, ‘ట్యాక్సీవాలా’ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. ఈసారి హిట్టు పక్కా.. అని ‘రౌడీస్’కి (తన అభిమానులు) భరోసా ఇచ్చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.
ఈ కష్టం వృధా కాకూడదు
సినిమాలో కంటెంట్ ఎలా వున్నాసరే, ‘ట్యాక్సీవాలా’ సినిమా ఆడి తీరాలి. ఎందుకంటే, ఇది ఓ నిర్మాత కష్టం. ఓ దర్శకుడి డ్రీమ్. ఓ హీరో శ్రమ. బోల్డంతమంది నటీనటులు, టెక్నీషియన్లు.. ఈ సినిమా కోసం పనిచేశారు. మామూలుగా సినిమా రిలీజ్ అయితే, ఆ సినిమాలో కంటెంట్ లేదంటే ఫ్లాప్ అవుతుంది. కంటెంట్ బావుంటే హిట్టవుతుంది. కానీ, ప్రేక్షకుల తీర్పు కోరేందుకు రాకుండానే, సినిమాని బజారుకీడ్చేశారు సినిమాని ముందే లీక్ చేసి. ఇది ఒకరకంగా చెప్పాలంటే ‘హత్యా నేరం’గా పరిగణించాల్సి వుంటుంది. సినిమాని రిలీజ్‌కి ముందే చంపేశారు మరి.
విజయ్‌కి ‘బుల్లితెర’ తీపి కబురు
కష్ట సమయంలో విజయ్ దేవరకొండకి తీపి కబురు అందింది. విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా బుల్లితెరపైనా సత్తా చాటింది. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ సినిమాలకు సాధ్యం కాని అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ని సాధించింది. ఈ సినిమాకి 20.8 రేటింగ్ పాయింట్స్ దక్కాయి. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.
యంగ్ హీరోల మద్దతు ‘ట్యాక్సీ వాలా’కే
యంగ్ హీరోలు నిఖిల్, వరుణ్ తేజ్ ‘ట్యాక్సీవాలా’ సినిమాకి బెస్ట్ విషెస్ చెప్పారు. సినిమా రిలీజ్ కోసం టీమ్ పడ్డ కష్టం గురించి వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. చాలామంది హీరోలు, నటీనటులు, దర్శక నిర్మాతలు ‘ట్యాక్సీవాలా’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఈ రోజు ‘ట్యాక్సీవాలా’కి జరిగినట్లు రేపొద్దున్న మరో సినిమా విషయంలో ‘లీక్’ జరగకూడదు. ఇదే విషయాన్ని నిఖిల్ తన ట్వీట్‌లో ప్రస్తావించాడు. ‘నా సినిమా ముద్రని కూడా లీక్ చేస్తారేమోనని భయంగా వుంది’ అని అనుమానం వ్యక్తం చేశాడు నిఖిల్. అదీ నిజమే మరి.
లీక్, పైరసీ.. అంతమొందించేదెలా?
సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వస్తే తప్ప, ఈ తరహా పైత్యాల్ని అంతమొందించాలంటే కఠిన చర్యలు తప్పవు. అలాంటి చర్యలు అక్రమార్కుల మీద ప్రభుత్వాలు తీసుకోవాలంటే, సినీ పరిశ్రమ అంతా ఏకమవ్వాల్సిందే. ఓ సినిమాకి కష్టం వచ్చినప్పుడు మాట్లాడితే సరిపోదు. ప్రతి సినిమా విషయంలోనూ సినిమా పరిశ్రమ ఒక్కతాటిపై నిలబడాలి. ఉమ్మడి పోరాటమే అద్భుతమైన విజయాల్ని అందించగలదు. పోరాడితో పోయేదేమీ లేదు.. లీకులు, పైరసీల నుంచి విముక్తి లభించడం తప్ప.
ట్యాక్సీ డ్రైవరొస్తున్నాడు.. గెట్ రెడీ..
ట్యాక్సీ డ్రైవర్ రూపంలో విజయ్ దేవరకొండ మీ ఇంటికే రాబోతున్నాడు. ఇందుకోసం ఓ ఫామ్ ఫిలప్ చేయాలంతే. విజయ్ ట్విట్టర్ ద్వారా ఈ ఆఫర్‌ని ఇచ్చాడు అభిమానులకి. ఇంటికొస్తాడట.. ఆఫీస్‌కీ, షాపింగ్‌కీ, షికారుకీ.. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడట. ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఇంకేముంటుంది? ఆలస్యమెందుకు విజయ్ దేవరకొండని ట్యాక్సీ డ్రైవర్‌గా ఆహ్వానించేద్దాం. అన్నట్టు, ఈ నెల 17న ‘ట్యాక్సీవాలా’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెల్సిందే కదా. గెట్ రెడీ మరి.