ఫ్లాప్ వచ్చిందని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే, కెరీర్‌లో హిట్టూ ఫ్లాపూ ఎవరికైనా సహజమే. ఒకప్పుడు అగ్రహీరోలు అతనితో సినిమాల కోసం పరితపించేవారు. అలాంటిది, వరుస పరజయాలతో డీలాపడ్డాడు. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం ఒకప్పుడు తీసుకున్న ఆ దర్శకుడు, టైమ్ బ్యాడ్ కావడంతో కొన్ని ఫ్లాపులిచ్చి రేసులో వెనకబడ్డాడు. అంతమాత్రాన తనను తక్కువ అంచనా వేయద్దంటున్న ఆ దర్శకుడు ఈసారి బంపర్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకుంటానంటున్నాడు.
పరిచయం అక్కర్లేని ఆ దర్శకుడి పేరు శ్రీను వైట్ల. తెలుగు సినిమాకి సరికొత్త కమర్షియల్ ఫార్ములా ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల. ‘అలాంటి సినిమా మాక్కావాలి..’ అని హీరోలు, ఇతర డైరక్టర్లపై ఒత్తిడి తెచ్చి మరీ శ్రీను వైట్ల ప్యాట్రన్‌లో సినిమాలు తీసిన సందర్భాలున్నాయి. చిన్న గ్యాప్, ఈసారి అదిరిపోయే హిట్‌తో వచ్చేస్తున్నానంటూ శ్రీను వైట్ల ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.
ఒక్కడా.? ఇద్దరా.? ముగ్గురా.?
అమర్, అక్బర్, ఆంటోనీ.. మొత్తం మూడు పేర్లు.. అంటే మూడు పాత్రలని అనుకోవాలేమో. అనుకోవచ్చా.? అనడిగితే శ్రీను వైట్లగానీ, హీరో రవితేజగానీ పెదవి విప్పడంలేదు. ‘ఇదొక డిఫరెంట్ మూవీ.. థ్రిల్లింగ్‌గా వుంటుంది. హీరో క్యారెక్టర్ గురించి మాత్రం చెప్పలేం..’ అని దర్శకుడు శ్రీను వైట్ల, హీరో రవితేజ చెబుతున్నారు. అంటే, సినిమాలో ‘కీ’ పాయింట్ అంతా అమర్, అక్బర్, ఆంటోనీ పాత్రల్లోనే వుందన్నమాట. ప్రోమోస్‌లో మాత్రం, మూడు గెటప్స్‌లో కన్పిస్తూ రవితేజ, సినిమాపై అంచనాలు పెంచేశాడు. రవితేజని కొత్తగా చూపిస్తూ, శ్రీను వైట్ల ‘ఐ యామ్ బ్యాక్’ అన్పించేలానే కన్పిస్తున్నాడు.
ఇలియానా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.!
ఒకప్పుడు తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతో (యంగ్ హీరోలతో) నటించిన ఇలియానా, ఎందుకో ఒక్కసారిగా టాలీవుడ్‌కి దూరమయ్యింది. తెలుగు సినిమాని చిన్న చూపు చూసింది. బాలీవుడ్ సినిమాలే బెస్ట్ అంటూ ముంబైకే పరిమితమైపోయింది. అలాంటి ఇలియానాని, శ్రీను వైట్ల మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చాడు. అయితే, ఇలియానా ఒకప్పటి నాజూకుదనం కోల్పోయి.. కాస్త బొద్దుగా కన్పిస్తోంది ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో. ఇంతకీ, ఈ సినిమాలో ఇలియానా పాత్ర ఎలా వుంటుంది.? అది కూడా సస్పెన్సేనట. అయితే ఇప్పటిదాకా తాను చేయని ఓ కొత్త తరహా పాత్రలో కన్పిస్తానని మాత్రం ఇలియానా అంటోంది.
మైత్రీ నుంచి వస్తోన్న మరో అద్భుతం.?
మైత్రీ మూవీ మేకర్స్ అంటే టాలీవుడ్‌లో ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ ఏడాది ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో ‘రంగస్థలం’ అనే సూపర్ డూపర్ హిట్ సినిమా వుంది. ఇటీవల ‘సవ్యసాచి’ కాస్త నిరాశపర్చినా, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్ళీ హిట్ కొడ్తామని మైత్రీ మూవీ మేకర్స్ అంటోంది. నిర్మాణపు విలువల పరంగా సినిమాని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. విజువల్స్ దగ్గర్నుంచి, యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టెక్నికల్‌గా సూపర్బ్ సౌండింగ్ మూవీ అన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి అందుతోన్న సమాచారం.
మాస్ మహరాజ్ సత్తా ఇదీ..
శ్రీను వైట్ల మార్కెట్ బాగా డల్ అయిపోయిన నేపథ్యంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాకి మాస్ మహరాజ్ రవితేజ ఇమేజ్ ఒక్కటే మేజర్ ప్లస్ పాయింట్. ఆ ఒక్కటీ సరిపోదా, సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిపోవడానికి.! నిజమే, మాస్ మహరాజ్ ఎఫెక్ట్.. సినిమాకి సూపర్బ్ బిజినెస్ జరిగిందట. ఓవర్సీస్‌లోనూ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’పై భారీ అంచనాలే వున్నాయి. హిట్టు పక్కా.. ఈసారి మంచి సినిమాతో మంచి హిట్ కొట్టబోతున్నాం.. అని రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు.
ఈ సినిమాలో కావాల్సినంత వినోదం వుంటుందట. ఎవరూ ఊహించని ట్విస్టులు వుంటాయట. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నొక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ.. అంటున్నాడు దర్శకుడు. హీరో రవితేజదీ అదే మాట. కొత్త దనంతో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ అని మాస్ మహరాజ్ రవితేజ భరోసా ఇస్తున్నాడు. అదే నిజమైతే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించేయడం ఖాయం.
ఏదిఏమైనా శ్రీను వైట్ల, రవితేజ.. ఈ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో హిట్ కొట్టాలని ఆశిద్దాం. మళ్ళీ ఈ సినిమాతో ఇలియానా తెలుగు తెరపై హల్‌చల్ చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.