Tirumala Tirupati Sri Venkateswara Swamy.. కష్టాలు తీర్చమని దేవుడి దగ్గరకు వెళ్లాలా.? దేవుడి దగ్గరికి వెళ్లి కష్టాలు కొని తెచ్చుకోవాలా.?
ఓ భక్తుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంటేశ్వర స్వామి సాక్షిగా వ్యక్తం చేసిన ఆవేదన ఇది.
దేవుడిని దర్శించుకోవడానికి టిక్కెట్లూ, టోకెన్లూ అవసరమా.? ఏ ధర్మం చెబుతోంది దైవ దర్శనానికి టిక్కెట్లు కొనమని.? టోకెన్లు తీసుకోవాలని.?
రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా దేవాలయాలూ, దేవాలయాల పాలక మండళ్లు మారిపోయాక, సాధారణ భక్తుల దుస్థితి ఇలా కాకపోతే, ఇంకెలా వుంటుంది.?
జైళ్లలో ఖైదీల్నివేసి కుమ్మినట్లు, క్యూ లైన్లలోనూ, కంపార్టుమెంట్లలోనూ బంధించాలని ఏ హిందూ ధర్మం చెప్పింది.?
వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు కనుక, వారిని అదుపు చేయడం కోసం ఇలాంటి చర్యలు చేపడుతున్నామనడం నీతి బాహ్యం.
భక్తులందు వీవీఐపీ భక్తులు వేరయా.!
నిజానికి, మంత్రులో, ముఖ్యమంత్రులో, ప్రధాన మంత్రులో, అధికారులో ఇంకే వీవీఐపీనో, ఎవరైతేనేం, వేంకటేశ్వర స్వామి ముందు ఎవరైనా ఒకటే.
దురదృష్టమేంటంటే, ‘ఈ అందరూ భక్తులే. అందరూ సామాన్యులే దేవుడి ముందర..’ అన్న హిందూ ధర్మంలోని ప్రాధమిక సూత్రాన్ని ఎప్పుడో మర్చిపోయారు.

ఫలితం, సామాన్యులకు కష్టాలు. కోటి రూపాయలిస్తే ఒక సేవ. యాభై లక్షలు ఇస్తే ఇంకో సేవ. ఆ దేవాలయం, ఈ దేవాలయం అన్న తేడాల్లేవ్ దాదాపు ప్రముఖ దేవాలయాలన్నిటిలోనూ ఇదే తంతు.
కాస్త ఎక్కువ, కాస్త తక్కువ.. అంతే తేడా.! దేవాలయాల పేరుతో నిఖార్సయిన, నిర్లజ్జతో కూడిన వ్యాపారం జరుగుతోంది.
వ్యాపారం జరుగుతున్నప్పుడు డబ్బులెవడు ఎక్కువ ఇస్తే వాడికే కదా అగ్రతాంబూలం. దేవుడి మీద విరక్తి పుడుతోందంటూ హిందువుల చేత అనిపిస్తున్నారంటే, అసలు హిందూ ధర్మంపై అధికారం పేరుతో ఎలాంటి పైశాచిక దాడి చేస్తున్నట్లు.?
Tirumala Tirupati Sri Venkateswara Swamy.. వ్యాాపారం.! హిందూ ధర్మంపై దాడి.!
వాళ్లూ, వీళ్లూ అని ఏ ఒక్కరినో నిందించడం సబబు కాదు. ఎవరు అధికారంలో వున్నా, హిందూ ధర్మంపై దాడి జరుగుతూనే వుంది.
దేవాలయాల నుంచి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభుత్వాలకి బోలెడంత ఆదాయం వస్తున్నాహిందూ ధర్మాన్ని అగౌరవపరిచే ప్రయత్నాలెందుకు జరుగుతున్నాయన్నది సామాన్య భక్తుడి ఆవేదన.
భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భక్తి మీద ఆంక్షలు, భక్తుల మీదా ఆంక్షలు. ఆ భక్తల మధ్య శీఘ్ర, అతి శీఘ్ర, సాధారణ, స్పెషల్ అనే విభజన. ఇదా హిందూ ధర్మం.?
Also Read: రామప్పకి యునెస్కో గుర్తింపు సరే, మనమెప్పుడు గౌరవిస్తాం.?
హిందూ ధర్మంపై వ్యూహాత్మక దాడి జరుగుతోంది. హిందువులంతా మేల్కొనాల్సిందే.. తప్పదు.
అసలు దేవున్ని దర్శించుకోవడానికి టిక్కెట్టు ఎందుకు.? ఆంక్షలు ఎందుకు.? ప్రత్యేక, సాధారణ క్యూ లైన్లు ఎందుకు.? అన్నదిశగా హిందువుల్లో ఆత్మ విమర్శ మొదలు కాకపోతే హిందూ ధర్మం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం వుంది.