Table of Contents
Touch Me Not Review.. ఓటీటీ కొత్తగా పరిచయమవుతున్న రోజుల్లో, భలే వుండేవి వెబ్ సిరీస్‌లు అంటే.! సినిమాల్లో చెప్పలేని కంటెంట్, ఓటీటీలో అద్భుతంగా చెప్పబడేది.
దానికి, ఒకింత మసాలా కూడా అవసరమయ్యేది. ఆ మసాలా కూడా ‘రీజనబుల్’ అనిపించేది కూడా.! అదే వెబ్ సిరీస్‌లు క్లిక్ అవడానికి కారణం.
రాను రాను, వెబ్ సిరీస్‌లు కూడా బోర్ కొట్టేయడం షురూ అయ్యింది. కంటెంట్ లేకుండానే, వెబ్ సిరీస్‌లు పట్టాలెక్కేస్తున్నాయి.
కంటెంట్ వున్నా, కొన్ని ‘నేరేషన్’ వీక్ అవడంతో ‘తుస్సు’మంటున్నాయ్.
Touch Me Not Review.. ఎలా ఒప్పించగలుగుతున్నారు.?
అసలు నిర్మాతలకీ, ఓటీటీ సంస్థలకు ఏం చెప్పి, ఒప్పించి ఇలాంటి చెత్త వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.? అన్న డౌట్ కొన్ని వెబ్ సిరీస్‌ల విషయంలో వస్తోంది చూస్తున్న ప్రేక్షకులకి.
ఇంతకీ, ఇక్కడ మనం ప్రస్తావించుకుంటోన్న ‘టచ్ మి నాట్’ వెబ్ సిరీస్ ఎలా వుంది.? దాని కథా కమామిషు ఏంటి.? పదండిక, తెలిసేసుకుందాం.!

ఓ సైకో కిల్లర్, ఓ అపార్టుమెంట్లో కొందర్ని చంపేస్తాడు.. ఆ అపార్టుమెంట్‌ని తగలబెట్టేస్తాడు. ఆ దారుణ ఘటనలో కొందరు సర్వైవ్ అవుతారు.
ఓ పెద్దబ్బాయి, ఇంకో చిన్నబ్బాయ్‌ని కాపాడతాడు ఆ ప్రమాదంలో. ఆ పెద్దబ్బాయి పోలీస్ అధికారిగా మారితే, చిన్నబ్బాయ్‌కి ఓ చిత్రమైన ‘సెన్స్’ వస్తుంది.. ఆ ప్రమాదంతో.
చేత్తో ఎవర్నయినా టచ్ చేస్తే..
చేత్తో ఎవర్నయినా పట్టుకుంటే, ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు తెలుస్తాయ్ చిన్నబ్బాయ్‌కి. పెద్దోడు పోలీస్ కదా, చిన్నోడి సాయం తీసుకోవచ్చు కదా.? అంటే, ‘ఇంకా పరిణతి రావాలి’ అంటాడు పెద్దోడు.
సాగ దీసీ సాగ దీసీ.. జీడి పాకం అయినా, బావుంటుందేమోగానీ, ‘టచ్ మి నాట్’ ఎంతకీ వేగం పుంజుకోదు. స్కూల్ డ్రెస్సులో చిన్నోడు.. అదే, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్ సెట్టవలేదు.
‘దసరా’ సినిమాలో బావున్న దీక్షిత్ శెట్టి, ఈ ‘టచ్ మి నాట్’ వెబ్ సిరీస్‌లో ఓవరాక్షన్ చేశాడు. అతని నటన అస్సలు బాలేదు. నిజానికి, అతని పాత్ర డిజైనింగ్‌లోనే లోపం వుంది.
సో, దీక్షిత్ శెట్టి చేయడానికేమీ లేదు. దర్శకుడు ఏం చెబితే, అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజానికి, అతని పాత్రే అత్యంత కీలకం ఈ వెబ్ సిరీస్‌లో.
చిరాకు తెప్పించేసిన కోమలి..
మరోపక్క, కోమలి ప్రసాద్ కూడా, చాలా చిరాకు తెప్పిస్తుంటుంది. స్కూల్ డ్రెస్సులో మినీ స్కర్టులు అస్సలు సూట్ కాలేదు. పెద్దయ్యాక పోలీస్ అయినా, ప్చ్.. ఎఫెక్టివ్‌గా లేదామె పాత్ర.
మిగతా పాత్రధారుల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఎవరికి తోచిన మేర, వారు ఓవరాక్షన్ చేసుకుంటూ పోయారు. అసలు నవదీప్ ఎందుకలా మడ్డు మొహం పెట్టుకున్నాడో ఏమో.!
చిన్నోడిగా దీక్షిత్ శెట్టి, పెద్దోడిగా నవదీప్.. తమ తమ పాత్రలకు న్యాయం చేయలేకపోయారు. అసలు నవదీప్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు.? దీక్షిత్ శెట్టికి వున్న ‘శక్తుల’ వల్ల, ఏం ఉపయోగం.? ప్చ్. అంతా హంబక్.
ఇదేం కామెడీ మహాప్రభో.!
అవతల సీరియస్‌గా హత్యలు జరిగిపోతుంటాయ్. ఇటేమో, రొమాన్స్ లాంటి వెకిలితనం, ఎమోషన్ లాంటి పిచ్చితనం మాత్రమే కనిపిస్తాయ్ ప్రేక్షకులకి.
పాయింట్ మంచిదే.. కాకపోతే, దాన్ని థ్రిల్లింగ్‌గా మలచలేకపోయారు. సీజన్ ముగింపు కూడా అర్థం పర్థం లేకుండా తయారైంది.
అయితే బిగుసుకుపోవడం, లేదంటే ఓవరాక్షన్ చేయడం.. ఇదీ ‘టచ్ మి నాట్’ వెబ్ సిరీస్ వ్యవహారం.! ఓటీటీలోనే కదా.. ఫ్రీగా చూసేయొచ్చులే.. అనుకున్నాసరే, స్కిప్ చేయడం బెటర్.
ఎందుకంటే, ఈ ‘టచ్ మి నాట్’ పూర్తిగా టైమ్ వేస్ట్ చేసే వెబ్ సిరీస్ అంతే.!