Table of Contents
Varudu Kaavalenu Review.. కమర్షియల్ లెక్కల పేరుతో హీరోయిన్‌ని కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయడం చాలా విరివిగా చూస్తున్నాం తెలుగు సినిమాల్లో. చాలా అరుదుగా మాత్రమే, హీరోయిన్ ‘పాత్ర’కి ఓ ప్రత్యేకతను ఆపాదిస్తుంటారు. అలాంటి ప్రత్యేకత ‘వరుడు కావలెను’ సినిమాలో హీరోయిన్‌కి కట్టబెట్టడంతోనే, ఈ సినిమా పట్ల ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.
నాగచైతన్య హీరోగా, మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సితార సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
పాటలు, ప్రోమోస్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయన్నది నిర్వివాదాంశం. సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లో ఎక్కువగా రీతూ వర్మ గురించి మాట్లాడారు.. ఆమె చీరకట్టు గురించీ ప్రస్తావించారు.
Varudu Kaavalenu Review.. కథేంటంటే..
ఇంతకీ, ‘వరుడు కావలెను’ సినిమా కథేంటి.? సినిమా ఎలా వుంది.? అన్న విషయాల్లోకి వెళితే, ఆఫీసులో యమ స్ట్రిక్టుగా వ్యవహరించే లేడీ బాస్ భూమి (రీతూ వర్మ), ఆమెను చూసి హడలిపోయే ఉద్యోగులు. ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు ఆకాష్ (నాగశౌర్య).

కూతురికి సరైన వయసులో పెళ్ళి చేయాలనే తపన పడే తల్లిదండ్రులు, యాటిట్యూడ్ చూపించే భూమి కోసం ఏమైనా చేయొచ్చనుకునే ఆకాష్.. ఇలా కథ నడుస్తుంది. అన్నీ కలుస్తున్నాయ్.. అనుకునేంతలోపు, ఓ ట్విస్టు.. చివరికి ఏం జరుగుతుందన్నది తెరపైనే చూడాలి.
‘మన్మథుడు’ సినిమాలో స్ట్రిక్టు బాస్ హీరో అయితే, ఇక్కడ హీరోయిన్.. అంతే తేడా. సన్నివేశాలు దాదాపుగా అలానే అనిపిస్తాయి. కథలో కొత్తదనం ఏమీ లేదు. సన్నివేశాలన్నీ చాలా క్లీన్‌గా, లావిష్‌గా కనిపిస్తాయి. మాటలు సహజంగా అనిపిస్తాయి. హాస్యం సమపాళ్ళలోనే కుదిరింది. చాలా సన్నివేశాల్లో సాగతీత కొంత ఇబ్బందికరంగా మారుతుంది.
హీరోయిన్.. ట్రెడిషనల్లీ స్టైలిష్..
హీరోయిన్ కాస్ట్యూమ్స్ విషయంలో ‘కమర్షియల్ లెక్కలు’ వేసుకోకుండా, హుందగాగా ఆమెను చూపించడాన్ని అభినందించి తీరాల్సిందే. కొన్ని చోట్ల మోడ్రన్ డ్రస్సుల్లో మరీ బక్క పలచగా కనిపించింది. అదొక్కటీ కొంచెం ఆడ్ అనిపిస్తుంది. నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడతాయ్.
హీరోయిన్ సెంట్రిక్ మూవీ.. అనే భావన సినిమా ప్రమోషన్లతో చాలామందికి కలిగింది. అయితే, తెరపై హీరో హీరోయిన్ల పాత్రలకు సమ తూకం.. అన్నట్టు స్పేస్ దక్కింది. నాగశౌర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
చాలా స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. నటుడిగా తానేంటో ఇప్పటికే పలు సినిమాలతో ప్రూవ్ చేసుకున్న నాగశౌర్యకి ఈ సినిమాలోని ఆకాష్ పాత్ర, జస్ట్ కేక్ వాక్ లాంటిదే.. చాలా ఈజ్‌తో చేసుకుపోయాడు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ‘దిగు దిగు..’ పాట మాత్రం కొంచెం ఆడ్‌గా అనిపిస్తుందిగానీ, ‘మాస్’ అన్న లెక్కల్లో సరిపెట్టుకోవాల్సిందే.
సప్తగిరి, వెన్నెల కిషోర్ పూయించిన నవ్వులు, నదియా, మురళీ శర్మ తదితరుల నటన.. ఇవన్నీ ఓకే అనిపిస్తాయి.
అద్భుతాలు అస్సలు ఆశించొద్దు..
అద్భుతాలేమీ ఆశించకుండా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోరుకుంటే ‘వరుడు కావలెను’తో పెద్దగా డిజప్పాయింట్ అవ్వరెవరూ. అయితే, ‘లాగ్’ ఎక్కువై బోర్ కొట్టిన సందర్భాలు ఎక్కువే వుంటాయ్. డైలాగ్స్‌లో త్రివిక్రమ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. మహిళా దర్శకురాలు కదా, హీరోయిన్‌కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని అభినందించి తీరాలి.
మ్యూజిక్ ఓకే, పాటలు వినడానికీ.. చూడ్డానికీ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వుంది. సినిమాటోగ్రఫీ బావుంది. సితార బ్యానర్ కదా, నిర్మాణపు విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగా జరిగి వుంటే బావుండేదేమో.
మొత్తంగా చూస్తే ‘వరుడు కావలెను’ (Varudu Kaavalenu Review) జస్ట్ టైమ్ పాస్ మూవీ. పెద్దగా ఏడుపులు పెడబొబ్బల్లేవ్.. భయంకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ లేవ్.. జుగుప్సాకరమైన ఎక్స్‌పోజింగ్ అసలే లేదు. ఆ లెక్కన, ఫ్యామిలీ ఆడియన్స్ టైమ్ పాస్ కోసం ఈ సినిమాని ఈజీగా ఎంజాయ్ చేసెయ్యొచ్చు.
– BeeyeS
Also Read: సినిమా రివ్యూ: సీటీమార్