Ys Jagan YCP Existence మార్పు తప్పనిసరి.! తప్పొప్పుల్ని బేరీజు వేసుకుని, ముందుకు సాగితేనే మనుగడ.! అక్కడే ఆగిపోతే, మనుగడ అసాధ్యం.!
2019 ఎన్నికల్లో అత్యద్భుత విజయాన్ని అందుకుని, అధికార పీఠమెక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో అదఃపాతాళానికి తొక్కివేయబడింది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 2014లో అధికార పీఠమెక్కిన టీడీపీ, 2019 ఎన్నికల్లో చతికిలపడలేదా.? కానీ, టీడీపీ పుంజుకుంది. మరి, వైసీపీ సంగతేంటి.?
Ys Jagan YCP Existence.. తప్పొప్పుల పంచాయితీ..
ముందే చెప్పినట్లు, తప్పొప్పుల్ని బేరీజు వేసుకుని, ముందుకు సాగాలి రాజకీయాల్లో అయినా, ఇంకెక్కడైనా. అది వైసీపీలో అస్సలేమాత్రం కనిపించడంలేదు.
‘బటన్లు నొక్కాం.. మంచి చేశాం..’ అనే భ్రమల్లోనే వున్నారింకా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అవి పనికిమాలిన బటన్లు అనీ, ప్రజలకు మేలు జరగలేదనే కదా.. 2024 ఎన్నికల్లో తీర్పు వచ్చింది.!
రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు.. పెళ్ళాలు, కార్లు.. అంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇవన్నీ వైసీపీని నిలువునా ముంచేశాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే, ప్రజల్లో అసహ్యం కలిగేలా చేశాయ్..
Mudra369
జరిగిన లోటుపాట్ల గురించి పార్టీలో చర్చించుకోవాలి. అంతేగానీ, అది తప్పు కాదు, ఒప్పు.. అని చెప్పుకుంటే ఎలా.? 2019 ఎన్నికలకు ముందు, చంద్రబాబు హయాంలో కూడా సంక్షేమ పథకాలు అందాయి ప్రజలకి.
సంక్షేమ పథకాలే రాజకీయ పార్టీల్ని గెలిపిస్తాయని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

తాత్కాలిక లబ్ది చేకూరే సంక్షేమ పథకాలంటే, శాశ్వతంగా మేలు జరిగే అభివృద్ధినే ప్రజలు కోరుకుంటారు. అలాగని, సంక్షేమ పథకాల్ని ప్రజలు వద్దనరు, ఇస్తే తీసుకుంటారు.. అది వాళ్ళ హక్కు.
మారాలి.. మారక తప్పదు.!
రాజకీయాల్లో వైసీపీ మనుగడ సాధించాలంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రావాలి. ఆయన మారక తప్పదు.
కింది స్థాయిలో ఎక్కడ లోపాలు జరిగాయో, ఈపాటికే సమీక్షలు మొదలు పెట్టి వుండాలి. వారానికోసారి బెంగళూరు నుంచి వచ్చి, వెళ్ళిపోయే ‘టూరిస్టు’ రాజకీయాల వల్ల జగన్ సాధించేదేమీ లేదు.
రాజకీయమంటే బూతులు మాత్రమే.. అని కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ లాంటి కొందరు నాయకులు వైసీపీని నాశనం చేశారన్న విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ తెలుసుకోకపోతే, వైసీపీ ఎప్పటికీ బాగుపడదు.
Mudra369
‘ఎన్నికలొచ్చినప్పుడు చూసుకుందాం..’ అని వైఎస్ జగన్ అనుకుంటే అది పొరపాటు. 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన ప్రజా తీర్పుని, వైఎస్ జగన్, ఓ ‘కొరడా దెబ్బలా’ భావించాలి.
‘ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది’ అనే భ్రమల్లో వైఎస్ జగన్, పార్టీ శ్రేణుల్ని వుంచగలరేమో.. అది, వైసీపీకి ఏమాత్రం ఉపయోగం లేని వ్యవహారం. మళ్ళీ జగన్ గెలవాల్సింది కూడా, ఆ ఈవీఎంలతోనే.
Also Read: అక్కు పక్షీ.! విమానాల్ని ఎందుకు కూల్చేస్తున్నావ్.?
రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మారాలి.. సంక్షేమం విషయంలో వైసీపీ ‘బటన్ల’ ఆలోచన మారాలి. వాలంటీర్ వ్యవస్థ వైసీపీని ఎంత నాశనం చేసిందో తెలుసుకోవాలి.
ఇవన్నీ జరగాలంటే, వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో వుండాలి. వైసీపీ మనుగడ కోసం వైఎస్ జగన్ కొంత బాధ్యత తీసుకోవాలి.