‘బాహుబలి’ రికార్డుల్ని ‘సాహో’ కొల్లగొడుతుందా.? నాన్ బాహుబలి అనే మాటకి ప్రబాస్ ‘సాహో’ తో చెల్లు చీటీ అంటాడా.? ‘సాహో’ని ఢీకొట్టే సత్తా ‘సైరా’కి ఉందా.? (Saaho Vs Sye Raa Box Office War) అసలు ‘బాహుబలి’తో ‘సాహో’ని పోల్చడం సమంజసమేనా.? ‘సాహో’కీ, ‘సైరా’కీ పోటీ పెట్టడం భావ్యమా.?
తెలుగు సినిమా తన బౌండరీని పెంచుకుంది. ఇండియన్ సినిమాగా ఎదిగింది. బాలీవుడ్‌లో కూడా ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడాలంటే, ముందుగా ‘బాహుబలి’ (Baahubali) ప్రస్థావన వస్తోంది. రాజమౌళి సృష్టించిన అద్భుతం ‘బాహుబలి’. అలాంటి విజయం మళ్లీ టాలీవుడ్ నుండే రావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.
‘సాహో’ (Saaho) తో ‘బాహుబలి’ రికార్డులు గల్లంతైపోవాలని ఆశించాల్సిందే. ఆశపడితేనే ముందుడుగు వేయగలం. అయినా ‘సాహో’కి ఏం తక్కువ.? కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి ప్రోమోస్‌లో. హాలీవుడ్ హీరోలకి ధీటుగా కనిపిస్తున్నాడు ప్రబాస్.
తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకోవాలని ప్రబాస్ కోరుకున్నా, కోరుకోకపోయినా, సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడైతే, ‘సాహో’ అద్భుతాలు సృష్టించాలనే కోరుకుంటున్నాడు. ‘సాహో’ సంగతి సరే, ‘సైరా’ (Sye Raa Narasimha Reddy) మాటేమిటి.? మొదట్లో ‘సైరా’ బాలీవుడ్‌కి వెళుతుందని ఎవరూ అనుకోలేదు. తెలుగు నేటివిటీకి సంబంధించిన కథ అని చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి.
‘బాహుబలి’, ‘సాహో’, ‘సైరా’ తెలుగు సినిమాని జాతీయ స్థాయికి, అంతకు మించి ఇంకా పైకి తీసుకెళ్లే సత్తా ఉన్న చిత్రాలుగా ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్నాయి. ‘బాహుబలి’ని ‘సాహో’ అధిగమించాలి. ‘సాహో’ని ‘సైరా’ అధిగమించాలి. ‘సైరా’ని ‘ఆర్‌ఆర్‌ఆర్ మించిపోవాలి. ఆ తర్వాత ఇంకోటి రావాలి. వస్తూనే ఉండాలి.
తెలుగు సినిమాకి ఏం తక్కువ.? టాలెంట్‌కి కొదవ లేదు. బడ్జెట్ పరిమితులు ఇప్పుడు లేవ్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవడంలో తెలుగు సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంత వేగం, నాణ్యత ప్రదర్శిస్తోంది. ‘సాహో’కీ, ‘సైరా’కీ మాత్రమే పోటీ పెట్టి అభిమానులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం హాస్యాస్పదం.
‘సాహో’ ట్రైలర్ చూసి చిరంజీవి అభినందించారు. ‘సైరా’ ట్రైలర్‌ని ప్రబాస్ మెచ్చుకున్నాడు. ఇలా ఒకరికొకరు సహాయ, సహకారాలు అందించుకుంటే, తెలుగు సినిమా ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. ‘బాహుబలి’తో ఆల్రెడీ సత్తా చాటాం. అది కొనసాగిద్దాం. ‘సాహో’, ‘సైరా’ ఇప్పుడు ఈ రెండూ తెలుగు సినిమా స్టామినాకి నిలువెత్తు నిదర్శనం (Saaho Vs Sye Raa Box Office War). లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ న్యూ సెన్సేషన్.