God Of War Controversy.. మురుగన్ ఎవరు.? తమిళనాడులో మురుగన్ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ మురుగన్ పట్ల తెలుగు నాట కూడా భక్తి శ్రద్ధలున్నాయి.
కార్తికేయుడు, సుబ్రహ్మణ్యస్వామి, కుమార స్వామి, షణ్ముఖ, స్కంద, శరవణ.. ఇలా చాలా పేర్లున్నాయి. శివ పార్వతుల కుమారుడే ఈ మురుగన్. అదే, ఆయనే.. గణపయ్యకి సోదరుడు.!
ఇంతకీ, మురుగన్ ఎక్కడ జన్మించాడు.? ఏ ప్రాంతానికి దేవుడు.? ఇదీ ఇప్పుడు రచ్చ. ‘ఉత్తరాదిన పుట్టి, దక్షిణాదిలో దేవుడిగా స్థిరపడ్డాడు..’ అనే అర్థం వచ్చేలా, ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రమోషనల్ కంటెంట్ వదిలారు.
తెలుసు కదా, ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కించనున్నారని.!
సినిమా కథ, కమామిషు ఏంటన్నదానిపై ఇంకా ఓ స్పష్టత లేదు. ఈలోగానే, ‘మురుగన్’ వివాదం మొదలైంది. చెప్పాలనుకున్నది చెప్పేసింది చిత్ర యూనిట్.
శివ పార్వతుల కుమారుడు.. అంటూ, జూనియర్ ఎన్టీయార్ తన ట్వీటులోనే ప్రస్తావించాడు. సో, చిత్ర యూనిట్ పూర్తి క్లారిటీతో వుందన్నమాట.
చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘ఎన్టీయార్ ఆర్ట్స్’ అధికారిక హ్యాండిల్‌లో ‘ఉత్తరాదిన జన్మించిన..’ అంటూ పేర్కొన్నారు. ఇదే, అసలు వివాదానికి కారణం.
తమిళనాడుకి చెందిన ఓ రాజకీయ పార్టీ అధినేత, ‘మురుగన్ మా దేవుడు.. ఉత్తరాదికి లింక్ పెట్టొద్దు..’ అంటూ అల్టిమేటం జారీ చేశాడు.
అసలు దేవుడికి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర.. ఈ తేడాలేంటి.? సకల జగత్తూ.. ఆ దేవుడిదే.. అంటాం కదా.? ఈ విశ్వాన్ని నడిపించేదే ఆ దేవుడు అని కదా మనం నమ్మేది.?
పైగా, పేర్లు వేరు అంతే.. కుమార స్వామిని హిందువులంతా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అలాంటప్పుడు, ఈ ఉత్తర దక్షిణ భారతదేశం.. అంటూ విభజన రేఖలేంటి.. భక్తి విషయంలో.?
కాదేదీ వివాదానికి అనర్హం. చిన్న చిన్న విషయాలే పెను వివాదాలుగా మారుతున్నాయని ‘గాడ్ ఆఫ్ వార్’ టీమ్‌కి తెలియదా ఏంటి.? తెలిసే, ఈ వివాదాన్ని రాజేశారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
ఏమో, ఈ మురుగన్ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ.. ఈ ప్రాంతీయ విద్వేషాలు సభ్య సమాజానికి హాని చేస్తాయి తప్ప, మేలు చేయవు.
