Home » ‘లెనిన్’ సమీక్ష.! అక్కినేని అయ్యగారు ‘అఖిల్’ హిట్టు కొట్టాడా.?

‘లెనిన్’ సమీక్ష.! అక్కినేని అయ్యగారు ‘అఖిల్’ హిట్టు కొట్టాడా.?

by hellomudra
0 comments
Lenin Review Akhil Akkineni

Lenin Review.. అనగనగా ఒక ఊరు.. ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు. ఊరందరికీ తల్లో నాలుకలా వుండే ఓ అనాధ.

ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ తరహా నేపథ్యం. పదేళ్లు వెనక్కి, పాతికేళ్లు వెనక్కి.. వందేళ్లు వెనక్కి వెళ్లి కూడా ఇదే నేపథ్యంతో సినిమాలు తెరకెక్కించారు. తెరకెక్కిస్తూనే వున్నారు. 

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్  మురళీ కిషోర్ అబ్బూరు  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లెనిన్’.

అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసి చాలా ఏళ్లయ్యింది. అప్పుడెప్పుడో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫర్వాలేదనిపించింది.

అంతే. మళ్లీ మరో హిట్ అఖిల్ ఖాతాలో పడలేదు. చిత్ర విచిత్రమైన ప్రయత్నాలెన్నో చేస్తున్నాడు. శరీరాన్ని చాలా చాలా కష్టపెట్టేస్తున్నాడు. కానీ, ఎక్కడో తేడా కొడుతోంది. సరైన హిట్టు దొరకడం లేదు.

అయ్యగారు..’ అని అభిమానులతో పిలిపించుకునే అఖిల్, సరైన హిట్టు ఎప్పుడు కొడతాడో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Lenin Review.. నాగార్జునకి పుత్రోత్సాహం లభించిందా.?

తండ్రి అక్కినేని నాగార్జున, తన చిన్న కొడుకు అఖిల్ అగ్ర హీరో అవ్వాలనే కోరికతో చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ ‘లెనిన్’ ఆ విజయాన్ని అఖిల్‌కి ఇచ్చిందా.? లేదా.? 

అసలు సినిమా కథేంటీ.? నటీనటులు ఎలా చేశారు.? సాంకేతిక నిపుణుల పని తీరెలా వుంది.? నిర్మాణం తదితర విషయాల గురించి కాస్త వివరంగా చర్చించుకుందాం పదండి.!

లెనిన్ (అఖిల్), భారతి (భాగ్యశ్రీ బోర్సే) ప్రేమించుకుంటారు. లెనిన్‌కి వసంత్ (ప్రమోద్ పంజు) స్నేహితుడు. అన్నదమ్ముల కంటే మించిన అనుబంధం వీరిద్దరి మధ్యా వుంటుంది. అనాధ అయిన లెనిన్‌ని వసంత్ తల్లి అక్కున చేర్చుకుంటుంది. 

స్నేహితుడి కోసం ప్రేమని త్యాగం చేస్తాడు లెనిన్. కానీ, ఆ స్నేహితుడే ఈ జంటని కలుపుతాడు. అయితే, ఊర్లో రాజకీయాలు లెనిన్, భారతి జీవితాల్సి ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

అలా లెనిన్ ఆయుధం పట్టాల్సి వస్తుంది. ఇంతకీ లెనిన్ ఆయుధం ఎవరి మీదకు ఎత్తాడు.? ప్రతీకారం ఎవరి మీద.? అదంతా తెరపై చూడాల్సిందే.

కథగా చెప్పుకుంటే బావుంది కదా.! మర, ఈ కథని తెరపై దర్శకుడు ఎలా ప్రజెంట్ చేశాడో తెలుసుకుందాం.

ముఖ్యమైన నటీనటులు అంతా తమ తమ పాత్రలకు ఎంత అవసరమో అంత బాగా నటించి మెప్పించారు. 

దర్శకుడికి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ తదితర విభాగాల నుంచి మంచి సపోర్ట్ దొరికింది. సినిమాలో బోలెడన్ని ట్విస్టులున్నాయ్.

బాగుందిగానీ.. లోటుపాట్లూ వున్నాయ్..

బానే వుంది, బాగుంది, చాలా  బాగుంది.. అనిపిస్తుంటుంది. అంతలోనే లోటు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ గందరగోళానికి కారణం కొన్ని ట్విస్టులు.

అలాగే, కొంత సాగతీత కూడా. వీటన్నింటికీ మించి హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషన్ల కనెక్టివిటీ అస్సలు కుదరదు. 

సీన్, సీన్లుగా చూస్తే కొన్ని సీన్లు చాలా బాగుంటాయ్. ట్విస్టులు కూడా అంతే. ఎడిటింగ్ లోపమా.? స్క్రీన్‌ప్లే లోపమా.? రచనలోనే లోపాలున్నాయా.? అని ప్రశ్నించుకుంటే, తిలాపాపం తలా పిడికెడు అని అనిపిస్తుంది.

నటీ నటుల విషయానికి వస్తే, అఖిల్ నటుడిగా ఇంకో మెట్టు ఎక్కేశాడు. అఖిల్ నటనలో వంక పెట్టడానికేమీ లేదు. సెటిల్డ్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. 

యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేశాడు. డాన్స్ తెలిసిందే. ఓవరాల్‌గా అఖిల్ పర్‌ఫామెన్స్ వరకూ సూసర్. 

భాగ్యశ్రీ  బోర్సే అందంగా కనిపించింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. వసంత్ పాత్రలో కన్నడ నటుడు ప్రమోద్ పంజు చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్‌లో అఖిల్‌ని డామినేట్ చేసేస్తాడు తనదైన నటనతో.

ఈశ్వరీ రావు దర్శకుడు తనకిచ్చిన పాత్రలో జీవించేసింది. ఎతిరాజులు పాత్రలో శివాజీ ఓకే అనిపిస్తాడు. నిజానికి ఈ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేసి వుండొచ్చు. శివాజీ నటనకు తగ్గ పాత్ర కాదిది. 

మిగతా పాత్రదారులంతా మమ అనిపిస్తారు. 

అఖిల్‌ని మాస్ హీరోగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు అన్ని కమర్షియల్ అంశాల్ని కలబోశాడు. ఇంటర్వెల్ ట్విస్టు, ప్రీ క్లైమాక్సు, క్లైమాక్స్ సినిమాకి ఆయువు పట్టు. 

హీరోని చాలా బాగా ప్రజెంట్ చేశాడు. హీరోయిన్, వసంత్ పాత్రల్ని బాగా చూపించాడు. ముందే చెప్పుకున్నట్లు ఈశ్వరీ రావు పాత్ర కూడా చాలా బాగుంది. 

లెక్కలన్నీ పక్కాగా వున్నా, లింకులు సరిగ్గా కుదర్లేదు. ఎంగేజ్ చేస్తూనే బోర్ కొట్టిస్తుంది. బోర్ కొ్ట్టేస్తూనే ఎంగేజ్ చేస్తుంది.

తెరపై నటీ నటుల కష్టం కనిపించింది. సాంకేతిక నిపుణులు నైపుణ్యమూ కనిపించింది.

దర్శకత్వ ప్రతిభా కనిపించింది. కానీ, ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయి విన్ అవడానికి అవసరమైనంత మ్యాజిక్ చేయలేకపోయాడు దర్శకుడు 

ఒక్కటి ఖచ్చితంగా చెప్పొచ్చు అఖిల్ గత సినిమాల కంటే చాలా మెరుగైన సినిమా ఇది. పోటీ లేదు కాబట్టి మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే ‘లెనిన్’ ఫర్వాలేదనిపిస్తుంది. 

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group