Mahendragiri Varahi Review.. ఇప్పుడంతా దేవుళ్ళు, దెయ్యాలు, మూఢ నమ్మకాలు, అణచివేతలు, అకృత్యాలు.. ఇవే కథాంశాలుగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.
సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా. సీనియర్ నటుడు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన తారాగణం.
మీనాక్షి గోస్వామి హీరోయిన్. ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో వుంది. అన్నట్టు, సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ సినిమాలో నటించడం గమనార్హం.
దాదాపుగా అందరూ మంచి నటీనటులే. అసలు, ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ నటించడమేంటి.? అదే పెద్ద సర్‌ప్రైజ్ మరి.!
కథ, కమామిషు ఇదీ..
ఇంతకీ, ‘మహేంద్రగిరి వారాహి’ కథా కమామిషు ఏంటి.? సినిమా ఎలా వుంది.? తెలుసుకుందాం పదండిక..
మహేంద్రగిరి రాజ వంశంలో పుట్టిన మగ పిల్లలెవరూ 33 ఏళ్ళ కంటే ఎక్కువ జీవించరు. అది ‘వారాహి దేవి’ శాపమని ఆ రాజవంశీకులు భావిస్తుంటారు.
ఈ శాపం నుంచి తమను గట్టెక్కించాలని వారాహి దేవిని పూజిస్తూ వుంటుంది ఆ కుటుంబం. తమ చుట్టూ వున్నవారికి సాయం చేస్తూ, ఆ కుటుంబీకులు, జనం మెప్పు పొందుతుంటారు.
అంత మంచివాళ్ళయినప్పటికీ, రాజవంశీకులు ఒకరొకరుగా చనిపోతూనే వుంటారు. ఇంతకీ, ఆ శాప విముక్తి ఆ వంశానికి కలిగిందా.? అన్నదే అసలు కథ.
Mahendragiri Varahi Review.. ఎవరెలా చేశారంటే..
తన సోదరుడ్ని ఆ శాపం కారణంగానే కోల్పోతాడు హీరో. అది శాపం కాదు, ఎవరో చేస్తున్న హత్యాకాండ.. అన్న కోణంలో, హీరో తనదైన స్టయిల్లో కూపీ లాగుతాడు. ఆ హీరోనే మన సుమంత్ అన్నమాట.
స్క్రీన్ మీద సుమంత్‌ని భరించడం కష్టం. తప్పదన్నట్లు నటించాడు. మిగతా నటీనటులంతా ఈ విషయంలో పోటీ పడ్డారు.
సీనియర్ నటుడు బ్రహ్మానందం నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన నటనను చూడాల్సి వస్తుందని ఎవరూ అనుకోరు. బ్రహ్మానందం బాటలోనే రాజీవ్ కనకాల కూడా.
చివరికి వెన్నెల కిషోర్ పాత్ర కూడా, ఇష్టం లేక నటించినట్లుంటుంది తప్ప.. పాత్రలో లీనమవ్వాలన్న కనీసపాటి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది.
మంచి పెర్ఫామర్స్.. అనుకున్నవాళ్ళే ఇలా వుంటే, మిగతా తారాగణం గురించి అసలు మాట్లాడుకోవడానికి ఏమైనా వుంటుందా.? ఛాన్సే లేదు.
సిద్దు జొన్నలగడ్డ గురించి మర్చిపోయాం కదా.. మాట్లాడుకోవడం. ఇంత పేలవమైన క్యారెక్టర్.. అని బహుశా తెలియక, ఈ సినిమాకి కమిట్ అయి వుంటాడు సిద్దు. బలంగా చెట్టుకు కట్టేసి, నటించమన్నట్లుంది సిద్దూ పరిస్థితి.
చివర్లో ఐశ్వర్య రాజేష్ మెరిసింది. ట్విస్ట్ అన్నమాట. హీరోకి జ్ఞానోదయం అయ్యేలా చేసే పాత్ర ఆమెది. ప్చ్, ఆ పాత్ర కూడా తేలిపోయింది.
వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. దేనిగురించీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ప్రచారం గట్టిగానే చేశారు. కథ, కథనాల మీద ఫోకస్ పెట్టి వుండాల్సిందే.
‘వారాహి’ ట్రెండింగ్ గనుక.. ఏదో కథకి, ఇలా ఆల్టరింగ్ చేశారేమో అనిపిస్తుంది. అది మరీ దారుణం. దేవత ఇలా చేస్తుందా.? అన్న డౌట్.. సినిమా మీద మరింత చిరాకు తెప్పిస్తుంది.
మొదటి నుంచీ దర్శకుడు, ప్రేక్షకుల్ని పక్కదారి పట్టించేందుకే ప్రయత్నిస్తూ వుంటాడు. అదేం దర్శకత్వ ప్రతిభో ఏమో మరి.! చివర్లో ఒక్కసారిగా వారాహి దేవత మహిమ.. అనేస్తాడు.
హత్యలు చేసిన వ్యక్తి, వారాహి దేవత గుడిలో పూజారి.. అంటే, ఏం సందేశం ఇద్దామని సభ్య సమాజానికి.? హిందూ సమాజానికి.?
‘వారాహి’ దేవాలయంలోనే హత్య జరుగుతుందంటే, దర్శకుడు కథని ఎంత ఛండాలంగా రాసుకున్నాడో అర్థమవుతుంది. ఓటీటీలో కూడా స్కిప్ కొట్టెయ్యడమే బెటర్ ఈ సినిమాని.