Table of Contents
YSRCP Social Space Vulgarity.. సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్న చెత్త గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటీమణుల డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోలపై పెద్ద రచ్చే జరుగుతోంది.
మొన్నటికి మొన్న జాన్వీ కపూర్ డీప్ ఫేక్ వీడియో గురించి జూనియర్ ఎన్టీయార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. నిందితులు అరెస్టయ్యారా.? జైలు శిక్ష పడిందా.?
రాజకీయాలన్నాక, విమర్శలు సహజం. అవిప్పుడు బూతుల స్థాయి కూడా దాటేశాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగుప్సాకరమైన బూతులు వాడుతున్న రోజులివి.
సాధారణ కార్యకర్తలో, వారి ముసుగులో ఆకతాయిలో, చిల్లరగాళ్ళో, పోరంబోకులో.. సోషల్ మీడియా వేదికగా, రాజకీయ ప్రముఖుల ఇళ్ళల్లోని మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమైపోయింది.
YSRCP Social Space Vulgarity.. జగన్ సతీమణిపై జుగుప్సాకరమైన స్పేస్..
తాజాగా, జనసైనికుల ముసుగులో కొందరు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణిపై అభ్యంతరకర వ్యాఖ్యల్ని సోషల్ మీడియా ‘స్పేసుల్లో’ చేశారన్నది ప్రధాన ఆరోపణ.
ఈ వ్యవహారాన్ని వైసీపీ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోపక్క, వైసీపీ సోషల్ మీడియా టీమ్, నిందితుల్ని గుర్తించేందుకు లక్షల రూపాయల బహుమతుల్నీ ప్రకటించింది.
అసలు, సోషల్ మీడియా స్పేస్ అంటే ఏంటి.? కొంతమంది వ్యక్తులు, ఏదో ఒక సబ్జెక్ట్ మీద, ముచ్చట్లేసుకునే వేదిక.
కొన్ని ప్రైవేట్ స్పేసులుంటాయ్, కొన్ని పబ్లిక్ స్పేసులుంటాయ్. వీటిల్లో మంచి విషయాలపైనా చర్చ జరుగుతుంది. కొన్నిసార్లు, అత్యంత జుగుప్సాకరమైన చర్చలూ జరుగుతుంటాయ్.
టైమ్ పాస్ స్పేసులా.?
నోటికొచ్చింది వాగేవాళ్ళకు ఇలాంటి స్పేసులు ఓ టైమ్ పాస్ వ్యవహారం. వైసీపీ క్యాడర్ కూడా ఇవే స్పేసుల్లో అత్యంత అసభ్యకరంగా రాజకీయ ప్రత్యర్థుల్ని దూషించిన సందర్భాలున్నాయ్.
దాదాపు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలదీ ఇదే పని. నిజానికి, ఇలా వాగేవాళ్ళకి ఆయా పార్టీల నుంచి మద్దతు వుంటుందని అనుకోలేం.
ఆ మాటకొస్తే, ఆయా పార్టీల సభ్యత్వాలు కూడా వీళ్ళకి వుండవు. ఊరికే, ఆయా పార్టీల మీద అభిమానం.. ముసుగులో ఇదంతా చేస్తుంటారు.
ఇక, జగన్ సతీమణి భారతిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యల విషయానికొస్తే, మాట్లాడింది పది మంది కావొచ్చు. దాన్ని విన్నది ఓ వంద మంది కావొచ్చు.!
పిల్లి మెడలో గంట కట్టేదెలా.?
కానీ, ఈ స్పేస్ తాలూకు ‘క్లిప్’ ఎవరైతే సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారో.. వాళ్ళే ఇంకా పెద్ద తప్పు చేస్తున్నట్లు భావించాలేమో.
ఎందుకంటే, కోట్ల మందికి చేరిపోయింది ఆ జుగుప్సాకరమైన ‘ఆడియో వీడియో క్లిప్’.! ఏమో, అరెస్టులు జరుగుతాయేమో.. అది వేరే చర్చ.
కానీ, వైసీపీ క్యాడర్.. ఏదో చేద్దామనుకుని, తమ అధినేత సతీమణి గౌరవాన్ని సోషల్ మీడియా వేదికగా దెబ్బ తీస్తున్నారు ఈ వీడియో క్లిప్స్ సర్క్యులేట్ చేయడం ద్వారా.
ఈ విషయమై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒకింత అప్రమత్తంగా వుండి వుండాల్సింది. ఆ క్లిప్స్ ఎవరూ ఎక్కడా షేర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుని, న్యాయ పోరాటం చేసి వుండాల్సింది.