Artificial Intelligence Negative Impact.. కృతిమ మేధ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇది సరికొత్త సాంకేతిక సంచలనం.!
మొహం మీద మొటిమ వస్తే, ఏం చేయాలో కూడా ‘ఏఐ టూల్’ని అడిగితే చెప్పేస్తోంది.!
మార్కెట్లో చాలా ఏఐ టూల్స్ అందుబాటులో వున్నాయి. కొన్ని ఉచితంగా అందుబాటులో వుంటే, కొన్నిటిని పెద్ద మొత్తంలో ఖర్చు చేసి, వినియోగించుకోవాల్సి వస్తోంది.
అవసరానికి తగ్గట్టుగా జనం ఏఐ టూల్స్‌ని వినియోగించుకుంటున్నారు.. అవసరానికి మించి కూడా కొందరు వాటిని వాడేస్తున్నారు.. అదీ విచ్చలవిడిగా.
నేరం చేసి, చట్టం నుంచి తప్పించుకోవడం ఎలా.? అన్న ప్రశ్నలూ ఏఐ టూల్స్ ముందర వుంచుతున్నారు కొందరు నేరగాళ్ళు.
అనారోగ్య సమస్యలు, లీగల్ వ్యవహారాలు.. వాట్ నాట్.. అన్నిటికీ, ఏఐ టూల్స్‌ని వినియోగించెయ్యడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.
ఉద్యోగాలు పోతున్నాయ్ ఏఐ టూల్స్ కారణంగా. చదువులు కూడా చెట్టెక్కేస్తున్నాయ్.. అన్ని అనర్థాలకీ ఏఐ టూల్స్ కారణమన్న చర్చ అంతటా జరుగుతోంది.
మరి, దీనికి విరుగుడు ఏంటి.? కొత్తగా ఏఐ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం కాస్త ఊరటనిస్తోన్న అంశం.
నిజానికి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడాల్సిన వాటికి మాత్రమే వాడితే, అదో అద్భుతం. కానీ, చాలా అనర్థాలకు ఏఐ కారణమవుతున్న దరిమిలా, ‘నియంత్రణ’ తప్పనిసరి అయిపోయింది.
కేంద్ర ప్రభుత్వం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని నియంత్రించేందుకోసం సమాలోచనలు చేస్తోంది. ఏయే రంగాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని పరిమితం చేయాలన్నది ఇందులో కీలకమైన అంశం.
కానీ, ‘పిల్లి మెడలో గంట కట్టడం ఎలా.?’ అన్న చందాన, ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. అదే సమయంలో, తప్పదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి నియంత్రణ వుండి తీరాల్సిందే.
ఇక్కడితో కథ అయిపోలేదు. ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దిశగా ప్రయోగాలు సాగుతున్నాయి. అది కూడా అందుబాటులోకి వచ్చేస్తేనో.?
ఇప్పుడున్న జెన్ జీ యుగంలో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతిక అద్భుతాల్ని నియంత్రించడం.. దానికి చట్టాలు తీసుకురావడం ఎంతవరకు సబబన్న విమర్శలూ లేకపోలేదు.
పద్ధతైన వినియోగం.. అన్నమాటకు అర్థం లేదు గనుక, నియంత్రణ తప్పనిసరి. నియంత్రణ అంటే, మళ్ళీ నిషేధం చర్చలు మొదలవుతాయి. అంతిమంగా ఏం జరగబోతోందన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఒక్కటి మాత్రం నిజం.. సమాజంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బాధితులు పెరిగిపోతున్నారు. మానసిక రుగ్మతలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణమవుతోంది.
సామాజిక సమతౌల్యమూ దెబ్బతింటోంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా. అబ్బో, సమస్యల ఏకరువు..! కథ చాలానే వుంది.
