Gold Price Downfall.. భూమ్మీద, బంగారం మీదా పెట్టుబడి పెడితే తిరుగుండదు.! ఇది పెద్దలు చెప్పిన మాట.!
అటు భూముల దరలైనా, ఇటు బంగారం ధరలైనా.. పెరుగుతాయే తప్ప తగ్గవు.. అన్నది ఒకప్పుటు పెద్దలు చెప్పిన మాట.. అదే, చద్దన్నం మూట.. అని చాలామంది పాటిస్తుంటారు కూడా.!
భారతీయులకి బంగారం అంటే, అది కేవలం ఓ మెటల్ మాత్రమే కాదు, అంతకు మించి, ఆ బంగారం భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైపోయింది.
బంగారు ఆభరణాలు ధరించకపోతే, కనీసపాటి గౌరవం కూడా దక్కదన్న అభిప్రాయం, చాలామంది మహిళామణుల్లో వుంటుంది. అది వాస్తవం కూడా.!
ఒకప్పటి బంగారం ధరలకీ, ప్రస్తుత బంగారం ధరలకీ అస్సలు పొంతనే లేదు.! కొన్నేళ్ళ క్రితం ఐదు వేల రూపాయల లోపే వుండేది.. అదీ పది గ్రాముల బంగారం.!
ఏడాదికేడాదీ బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. మధ్యలో తగ్గినా, మరీ పతనమైపోలేదు. కానీ, ఈ సారి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం.!
రెండు లక్షల రూపాయల వరకూ పెరుగుతుందనుకున్న పది గ్రాముల బంగారం ధర, ఓ దశలో లక్షా ఎనభై ఏడు వేల వరకూ పెరిగి, ఆ తర్వాత తగ్గింది.
కొన్నాళ్ళపాటు ఈ తగ్గుదల నిలకడగా వుంది. లక్షా యాభై వేలు, లక్షా అరవై వేలు, లక్షా డెబ్భయ్ వేలు.. ఇలా ఈ మధ్యనే ఊగిసలాడింది.
Gold Price Downfall.. పెరిగింది.. విరిగింది.. మళ్ళీ పెరుగుతుందా.?
ఆ మధ్య ఓ సారి, లక్షా నలభై వేల రూపాయల దిగువకు పడినా, వెంటనే మళ్ళీ పుంజుకుంది. ఈసారి లెక్కలు తప్పాయ్.
కనీ వినీ ఎరుగని రీతిలో, లక్షా ముప్ఫయ్ వేల దిగువకు.. లక్షా ఇరవై ఐదు వేలకు చేరుకుంది పదిగ్రాముల బంగారం ధర.
‘నేను ముందే చెప్పాను.. బంగారం కొనుగోలు చేయొద్దు ఏడాది వరకు.. అని..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ బంగారం ధరలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కానీ, ఇప్పుడేంటి పరిస్థితి.? బ్యాంకుల్లో తాకట్టులో వున్న బంగారం సంగతేంటి.? బ్యాంకుల నుంచీ, ప్రైవేటు రుణ సంస్థల నుంచీ వస్తున్న ఒత్తిడి నుంచి సామాన్యుడు బతికి బట్టకట్టేదెలా.?
ఇంకోపక్క, బంగారం ధరలు ఇంకా పడిపోతాయనీ, యాభై వేలకు పది గ్రాముల బంగారం వచ్చేస్తుందనీ.. ఇలా రకరకాల అభిప్రాయాల్ని చూస్తున్నాం.
అదే సమయంలో, మళ్ళీ బంగారం ధరలకు రెక్కలు వస్తాయనీ.. ఈసారి రెండు లక్షల రూపాయలకుపైనే పది గ్రాముల బంగారం ధర పలకొచ్చనే విశ్లేషణలూ కనిపిస్తున్నాయి.
మామూలుగా అయితే, ‘పెరుగుట విరుగుట కొరకే’ అని అంటుంటాం. అదే జరిగింది ప్రస్తుతం బంగారం ధర విషయంలో. మరిప్పుడు, ‘విరుగుట పెరుగుట కొరకే’ అని చెప్పుకోబోతున్నామా.?
ఈ మార్కెట్ మాయాజాలం అంత తేలిగ్గా సామాన్యులకు అర్థం కాదు.
అంతర్జాతీయ పరిణామాలు.. అనగా, అమెరికా ప్రదర్శిస్తోన్న యుద్ధోన్మాదం.. బంగారం మీద ఇంత పెద్ద దెబ్బ పడటానికి కారణమన్న చర్చ జరుగుతోంది.
ఓ వైపు ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరకుపోయింది. ఇంకోపక్క, ఇదిగో ఇదొక దెబ్బ గట్టిగా తగిలేస్తోంది. వెరసి భవిష్యత్ భయానకంగా మారుతోంది.
కోవిడ్ సమయంలో, అర్థం పర్థం లేని మారటోరియంని తెరపైకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, అలాంటి మారటోరియం కాకుండా.. అటు బ్యాంకుల్నీ, ఇటు వినియోగదారుల్నీ ఆదుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది.