ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం.. (SP Balasubrahmanyam Bharat Ratna) ఏకంగా 17 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడేసిన గొప్ప సినీ గాయకుడు. ఆయన పాటతోనే నిద్ర లేచి, ఆయన పాటతోనే నిద్రపోయారు ఎంతోమంది. ఇప్పటికీ, ఆయన పాట లేకుండా.. సినిమా పాటల గురించిన చర్చ జరగదు.
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. తెలుగు సినీ సంగీత దర్శకులు ఆర్‌పి పట్నాయక్, దేవిశ్రీప్రసాద్, కోటి ఈ డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు. అనంతరం, ఎస్పీ బాలు అభిమానులంతా ఇదే విషయమై నినదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కేంద్రానికి ఈ విషయమై లేఖ కూడా రాయడం గమనార్హం.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Ys Jaganmohan Reddy) కేంద్రానికి లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్, తెలుగు, తమిళ, హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడిన ఎస్పీ బాలు.. ఇండియన్ సినిమాకి విశేషమైన సేవలు అందించిన దరిమిలా, ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సబబేననీ, తమిళ ప్రజల తరఫున తాను సైతం ఈ విషయమై కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ సంగీత ప్రపంచంలో ‘మహనీయులు’ అనదగ్గ అతి కొద్దిమందిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఒకరు. భారతరత్న పురస్కారం ఆయన్ని వరించినా, వరించకున్నాసరే.. ఆయన భారతరత్నమే. ఎందుకంటే, ఆ సేతు హిమాచలం.. ఎస్పీ బాలు గానం విని పులకించిపోయింది.. పులకించిపోతూనే వుంది.
భౌతికంగా ఎస్పీ బాలు (SP Balasubrahmanyam Bharat Ratna) మన మధ్యన ఈ రోజు లేకపోవచ్చు. కానీ, ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. ఆ పాటల్లో ఎస్పీ బాలు మనకి కనిపిస్తూనే, వినిపిస్తూనే వుంటారు.