మామూలుగా బస్ ఛార్జీ అంటే ఎంతుంటుంది.? వోల్వో లాంటి అత్యాధునిక బస్సు సర్వీసులకైతే 2 వేలు, 3 వేలు, 5 వేలు.. మరీ ఎక్కువగా అనుకుంటే ఓ పది వేలు గట్టిగా వుండొచ్చుగాక. అదీ దూరాన్ని బట్టి. కానీ, ఇక్కడ ఓ బస్సుంది. దాంట్లో ప్రయాణించాలంటే ఏకంగా 15 లక్షలు (Delhi To London Bus Journey) ఖర్చు చేయాలి.
దూరం కాస్త ఎక్కువే లెండి. కాస్త కాదు, చాలా చాలా ఎక్కువ దూరం తీసుకెళుతుంది ఆ బస్సు. ఎంత దూరం.? అంటారా.! ఏకంగా 20 వేల కిలోమీటర్లు. అయితే మాత్రం.. మరీ, 15 లక్షల రూపాయల ఖర్చేంటి.? అనేవాళ్ళు ఈ బస్సు వెనుక అసలు కథ తెలుసుకోవాలి. ఇందులో కేవలం 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. ఇద్దరు డ్రైవర్లు, ఓ సహాయకుడు, ఓ గైడ్ అదనం.
ఈ బస్సు భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని అండన్కి మనల్ని తీసుకెళుతుంది. అద్గదీ అసలు సంగతి. అందుకే, 15 లక్షల ఖర్చు. అన్నట్టు, ఈ బస్సు ప్రయాణంలో మనం ఢిల్లీ నుంచి మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ప్రయాణించి లండన్ చేరుకోవచ్చు.
మొత్తం ప్రయాణ సమయం ఏకంగా 70 రోజులు. ఆయా దేశాల్లోంచి బస్సు వెళుతోందంటే, వీసాల వ్యవహారం వుంటుంది కదా.! అవన్నీ, ఆ బస్సు నిర్వాహకులే చూసుకుంటారు. భోజన వసతి బాధ్యత కూడా వాళ్ళదే. నిజానికి, మే 21 నుంచి ఈ బస్సు సర్వీసుని అందుబాటులోకి తీసుకురావాలని గురుగ్రామ్ కి చెందిన ‘అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్’ అనే ట్రావెల్ సంస్థ భావించింది.
కానీ, కరోనా వైరస్ నేపథ్యంలో షెడ్యూల్ కాస్త మారింది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, మధ్యలో ఆయా దేశాల వరకూ కూడా టిక్కెట్లు తీసుకోవచ్చట. దానికి తగ్గట్టే టిక్కెట్ ధరలూ వుండొచ్చు.
ఇంత ఖర్చు చేసి బస్సులో వెళ్ళడమా.? ఎంచక్కా ఎయిర్ బస్సులోనే.. అదేనండీ విమానంలోనే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు కదా.? అంటే, ఆ కిక్కు వేరే.. ఈ కిక్కు వేరే. సాహస యాత్ర చేయాలనుకున్నోళ్ళ కోసం చాలా చాలా అనువైన (Delhi To London Bus Journey) ప్రయాణమిది.