Donkey Egg.. ‘ఎద్దు ఈనిందిరా.. అంటే, అయితే, దూడను కట్టేయ్..’ అని వెనకటికి ఎవడో అన్నట్లుగా వెనకా ముందూ ఆలోచనే లేదు. ఎవడో ఏదో చెప్పాడంటే చాలు.. ముందూ వెనుకా ఆలోచించకుండా వెర్రిజనం దాని వెంటే ‘పరుగో పరుగు’ అంటున్నారు.
గాడిద.. అడ్డ గాడిద.. పనికి మాలిన గాడిద.. అంటూ ఎందుకూ పనికి రానివాన్నిచాలా ఈజీగా అనేస్తుంటాం. ‘గాడిద’ అంటే అంత చులకన.. చిన్నతనం మనకి. అసలిప్పుడీ గాడిద టాపిక్ ఎందుకొచ్చిందంటారా.? ఇప్పుడిదే హాట్ టాపిక్.
ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటారు కదా.. అలా ఇప్పుడు గాడిదకి టైమెుచ్చింది అనాలేమో. అవునండీ.. ‘గాడిద పాలు’ ఇప్పుడు హాట్ టాపిక్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి గాడిద పాలే అసలు సిసలు మందు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
Donkey Egg … గాడిద పాలతో కరోనాకి చెక్.. నిజమేనా.?
గాడిద పాలు తాగితే, కరోనా తగ్గుతోందంటూ, ఓ గాలి వార్త బయటికి వచ్చింది. అంతే, వేలం వెర్రి జనాలు చెంబులు పట్టుకుని గాడిదల వెంట పరుగులు తీస్తున్నారట. ఇదే అదనుగా తీసుకుని, కుక్కని పెంచుకున్నట్లే ఓ గాడిదను కూడా పెంచేసుకుంటే పోలా.. అని ఇంకొందరు మూర్ఖులు రెడీ అయిపోతున్నారట.

జనాల వేలం వెర్రిని క్యాష్ చేసుకునే దిశగా కొందరు వ్యాపారస్థులు గాడిద పాలను ఫిక్స్‌డ్ రేట్లు పెట్టేసి అమ్మకానికి దిగుతున్నారట. మొన్న ఆనందయ్య మందు.. ఇప్పుడు ఇదిగో గాడిద పాలు. అంతా బాగానే ఉంది. అసలు కరోనాకి గాడిద పాల ట్రీట్‌మెంట్.. ఇందులో నిజమెంత.?
అలాంటిదేమీ లేదంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి ఏ జంతువుకు ఆ జంతువు దానికదే కొన్నిప్రత్యేకతల్ని కలిగి ఉంటుంది. ఆ ప్రత్యేకతల్ని అన్నిటికీ ఆపాదించేయడం సబబు కాదు. ఏదో మంచి జరుగుతుందట అనే మూర్ఖత్వంతో కనిపించిన ప్రతీ వాటిని ఆహారంలో భాగం చేసుకోలేం కదా.
వేలంవెర్రితో కొత్త రకం కల్తీ..
ఇప్పటికే అన్నిరకాలా కల్తీ రాజ్యమేలుతోంది, సహజత్వం అనేది ఎందులోనూ లేదు. ఈ తరుణంలో మంచి జరుగుద్ది అనే ముసుగులో కొత్తగా మరిన్నికల్తీ కార్యకలాపాలకు అవకాశమివ్వడం ఎంతవరకూ కరెక్ట్.? మనిషి పైశాచికత్వానికి ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. డబ్బు సంపాదనా నెపంలో ఎలాంటి కల్తీ చేయడానికైనా, వెనుకాడడం లేదు.
Also Read: వందేళ్ళూ బతికేద్దాం.. వీలైతే ఇంకో పాతికేళ్ళూ.!
గాడిద (Donkey Egg) పాలే కాదు, మేకపాల విషయంలోనూ చాలా కాలంగా ఈ తరహా చర్చ నడుస్తోంది. మేక పాలతో ఉబ్బస వ్యాధికి చెక్ పెట్టొచ్చట. కాన్సర్‌ని పూర్తిగా నివారించవచ్చట.. అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం ఇలాంటి పుకార్లను నమ్మవద్దని గట్టిగా నొక్కి చెబుతున్నారు.