మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్‌బాబు.. ఇలా సినీ ప్రముఖులు పెద్దయెత్తున విరాళాలు (Hyderabad Rains Tollywood Donations) ప్రకటించారు.. భారీ వర్షాల కారణంగా తల్లడిల్లుతున్న తెలంగాణ కోసం.
మరీ ముఖ్యంగా హైద్రాబాద్, భారీ వర్షాలకు అతలాకుతలమైపోయిన దరిమిలా, తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దయెత్తున విరాళాల ప్రకటన జరుగుతోంది. పైన చెప్పుకున్న ‘కోటీశ్వరులు’ మాత్రమే కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి.. ఇంకా ఎందరో.. ఎందరెందరో తమకు తోచిన రీతిలో విరాళాల్ని ప్రకటిస్తున్నారు.
ఒకరు కోటి ఇచ్చారు, ఇంకొకరు ఐదు లక్షలే ఇచ్చారు.. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనడానికి లేదిక్కడ. ఎవరి స్థాయిలో, ఎవరు చెయ్యాలనుకున్నంత వాళ్ళు సాయం చేస్తున్నారు. నిఆనికి, ఇదేమీ కొత్త విషయం కాదు. తెలుగు సినీ ప్రముఖులు ఎప్పుడూ ప్రజలకు బాసటగా నిలుస్తూనే వుంటారు.
ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడొచ్చినా.. తమవంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ క్రమంలో జోలె పట్టడానికైనా, ఆయా ఈవెంట్లు నిర్వహించి అయినా.. ప్రజల్ని ఆదుకుంటుంటారు.
కానీ, ఈలోగా కొందరు హేటర్స్‌కి ‘కంగారు’ ఆగదు. ‘సినీ జనాలు ఏమైపోయారు.? కేరళ వరదలొస్తే స్పందించి, చెన్నయ్ వరదల పట్ల ఆందోళన చెంది.. ఇప్పుడేమో తమకు ఆశ్రయమిచ్చిన హైద్రాబాద్ కష్టాల్లో వుంటే బాధ్యత విస్మరిస్తారా.?’ అంటూ నిలదీసేశారు సోషల్ మీడియాలో సోకాల్డ్ హేటర్స్.
మరోపక్క, ఇందులోకి రాజకీయాలూ ఎంటర్ అయ్యాయి. కానీ, ఇలాంటి విషయాల్లో సినీ పరిశ్రమకున్న బాధ్యత ఇంకోసారి నిరూపితమయ్యింది. ఇటీవలే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు తాము చెయ్యాలనుకున్న సాయం చేశారు.
ఓ పక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి, ఇంకోపక్క ప్రధాని సహాయ నిధికి.. వీటితోపాటుగా, సినీ పరిశ్రమ కోసం కూడా పెద్దయెత్తున విరాళాలు ప్రకటించారు. కొందరు గ్రౌండ్ లెవల్‌లో పేద ప్రజానీకాన్ని ఆదుకున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. మంచి మనసు విషయంలో మన టాలీవుడ్ స్టార్స్ నిజంగానే కోటీశ్వరులు. ఇందులో ఇంకో మాటకు ఆస్కారమే లేదు.
తెలంగాణకు ఇచ్చారు.. ఆంధ్రపదేశ్ మాటేమిటి? అంటూ వివాదాలు రాజేసే ప్రయత్నం జరుగుతోంది. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు విరాళాలు (Hyderabad Rains Tollywood Donations) ప్రకటించిన తెలుగు సినీ ప్రముఖులు.. ఆంధ్రపదేశ్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతారు.? కరోనా లాక్ డౌన్ సమయంలో చేశారు కదా.. అవసరమైతే, ఇప్పుడూ సిద్ధమే.