MLC Nagababu Range Increasing.. సినీ నటుడు, నిర్మాత, జన సేన పార్టీ కీలక నేత, ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగేంద్రరావు అలియాస్ నాగబాబు, తాజాగా మరో కీలక బాధ్యతల్ని చేపట్టారు.
ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ పదవి తాజాగా నాగబాబుని వరించింది. క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇది.! 2024 ఎన్నికల్లో లోక్ సభకు నాగబాబు పోటీ చేయాల్సి వుంది.
అయితే, కూటమి సమీకరణాల నేపథ్యంలో జన సేన పార్టీ, ఆ సీటుని బీజేపీకి త్యాగం చేసింది. దాంతో, నాగబాబుని శాసన సభకు పంపి, మంత్రిని చేయాలన్నది అప్పట్లో కూటమి పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం.
ఓ దశలో రాజ్యసభకి నాగబాబు వెళతారన్న ప్రచారమూ జరిగింది. చివరికి నాగబాబుని శాసన మండలికి పంపారు. తాజాగా, ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబుకి కీలక పదవి దక్కింది.
తాజాగా, బాధ్యతలు స్వీకరించిన నాగబాబు మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. సాధారణంగా నాగబాబు మీద వైసీపీ ట్రోలింగ్ చేస్తే, అదేమీ వింత కాదు.

చిత్రంగా, ట్రోలింగ్ చేస్తున్నది కూటమిలో కీలక పార్టీ అయిన టీడీపీకి చెందిన కొందరు మద్దతుదారులే నాగబాబుని ట్రోల్ చేస్తుండడం గమనార్హం.
ఇటీవలే కూటమి పార్టీల నుంచి ఓ ఉమ్మడి ప్రకటన వచ్చింది. కూటమి నాయకుల్ని సోషల్ మీడియా వేదికగా ఎవరూ కించపర్చకూడదని.
కానీ, కూటమికి చెందిన కార్యకర్తల్లో కొందరు పార్టీల వారీగా విడిపోయి, సోషల్ మీడియా వేదికగా పరస్పరం దూషించుకుంటున్నారు.. పార్టీల్నీ తిడుతున్నారు.
ఇక, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే నాగబాబుని ఎంత ట్రోల్ చేస్తే, రాజకీయంగా ఆయన అంత ఎదుగుతున్నారు.
ప్రస్తుతానికి నాగబాబు క్యాబినెట్ ర్యాంక్‌తో ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ అయ్యారు. ఏమో, త్వరలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుతుందేమో.!
