Home » మృగాళ్లకు ‘మీ టూ’తో మూకుతాడు.!

మృగాళ్లకు ‘మీ టూ’తో మూకుతాడు.!

by hellomudra
0 comments

అన్యాయం జరిగింది’ అని గళం విప్పలేని దుస్థితి. అవకాశాల పేరుతో శీలం దోచేసినా, పెదవి విప్పలేని దుర్ఘతి. అరవయ్యేళ్ల ముసలాడు 18 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడినా కిమ్మనకూడదు. సినిమాలతో నీతులు చెప్పడమే, సినిమా తెర వెనుక చేసేవన్నీ ఘోర కృత్యాలే. దివ్యభారతి (Divya Bharathi) ఎందుకు చనిపోయింది.? సిల్క్‌స్మిత (Silk Smitha) ఎలా ప్రాణాలు కోల్పోయింది.? చెప్పుకుంటూ పోతే మృగాడి పైత్యం మహిళా లోకానికి శాపం. ఇకపై ఇలాంటివి కుదరవ్‌. ఎందుకంటే మహిళా లోకం గర్జించింది. ఒకట్రెండు రోజుల హంగామా మాత్రమేనని లైట్‌ తీసుకున్నవారు, ఇప్పుడు మైండ్‌ బ్లాంక్‌ అయ్యి ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు. ఎప్పుడు ఏ ఆరోపణ తమను రోడ్చుకీడ్చుతుందో తెలియక దిన దిన గండం అన్నట్లుగా భయపడుతున్నారు. మృగాడు వణుకుతున్నాడు. మేకవన్నె పులి అసలు నిజం బయట పడుతోంది.

శ్రీరెడ్డి తెరపైకి తెచ్చిన నగ్న సత్యం..

సినిమా స్టూడియోలు బ్రోతల్‌ హౌస్‌లు అని తెలుగు సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) ఆరోపించేసరికి అందరూ షాక్‌ తిన్నారు. ఓ నిర్మాత కొడుకు పేరు కొంతమంది దర్శకుల పేర్లు. పలువురు నిర్మాతల పేర్లు, కొందరు నటుల పేర్లు తెరపైకి తీసుకొచ్చింది శ్రీరెడ్డి. అవకాశాల పేరుతో అమ్మాయిల ధన, మాన, ప్రాణాల్ని దోచేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించడం సంచలనమే అయ్యింది. తన వాదనను బలంగా వినిపించేందుకు ఆమె అర్ధ నగ్న ప్రదర్శన చేయక తప్పలేదు. సిగ్గు విడిచి ఆమె ఆ పని ఎందుకు చేసిందంటే సినీ పరిశ్రమలో అరాచకాల్ని నిగ్గదీసేందుకే. ఒక్క చిన్న పొరపాటు అదీ రాజకీయ కుట్ర కారణంగా శ్రీరెడ్డి వాదన తెరమరుగైపోయింది. కానీ లేదంటే, తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema) ఎంత మంది శ్రీరెడ్డి తుఫాన్‌లో కొట్టుకుపోయేవారో. శ్రీరెడ్డి కంటే ముందు మాధవీలత (Madhavi Latha) తదితరులు సినీ పరిశ్రమలో (Tollywood) జరుగుతున్న దోపిడీపై గళం విప్పారు. కానీ వారెవరికీ రాని హైప్‌ శ్రీరెడ్డికి వచ్చింది.

తెర వెనుక బాగోతం బయటపెట్టిన తనూశ్రీదత్తా..

నానా పటేకర్‌ అంటే సీనియర్‌ నటుడు. ఒకప్పుడు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు. అంతటి గొప్ప నటుడిలోని వికృత రూపాన్ని తనూశ్రీ దత్తా బయటపెట్టింది. అయితే తనపై తనూశ్రీ చేసిన ఆరోపణల్ని నానాపటేకర్‌ (Nana Patekar) కొట్టిపారేశాడు. తనూశ్రీకి లీగల్‌ నోటీసులు పంపాడు. వాటికి చట్టపరంగానే సమాధానమిస్తానని తనూశ్రీ (Tanushree Dutta) చెప్పడంలోనే ఆమె పట్టుదల అర్ధమవుతోంది. అలోక్‌నాధ్‌ (Alok Nath) అనే సీనియర్‌ నటుడు, షాజిద్‌ ఖాన్‌ అనే దర్శకుడు, కేంద్రమంత్రి ఎంజె అక్బర్‌ ఇంకొందరు దర్శకులు ఇప్పుడు ‘మీ టూ’ (Me Too India) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో చాలా మంది తమపై ఆరోపణలు చేసిన వారికి లీగల్‌ నోటీసులు పంపించారు. అయితే ఇంకా ఇంకా ఆరోపణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ‘మీ టూ’ అంటూ బాధితులు ముందుకొస్తున్నారు.

కాజల్‌, రకుల్‌ కడిగి పారేశారు..

కాజల్‌ అగర్వాల్‌ (Kajal Agarwal), రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) ఈ ఇద్దరూ తెలుగుతో పాటు, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించారు. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ తీరు తెన్నులు తెలుసు కనుకనే ఉద్యమం నీరు కారిపోకూడదని మద్దతు పలికారు. మేమంతా నీకు అండగా ఉంటామని ఈ ఇద్దరూ ‘మీ టూ’ (Me Too) ఉద్యమంలో చేతులు కలిపారు. రకుల్‌ విషయానికి వస్తే, శ్రీరెడ్డి తనపై అర్ధం పర్దం లేని ఆరోపణలు చేసినప్పుడు హుందాగా వ్యవహరించింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ తనకు ఎదురు కాలేదని మాత్రమే రకుల్‌ చెప్పింది. కానీ శ్రీరెడ్డి అప్పట్లో రకుల్‌ని టార్గెట్‌ చేసింది. రకుల్‌పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ తర్వాత రకుల్‌కి శ్రీరెడ్డి క్షమాపణలు కూడా చెప్పింది.

తమిళ సినీ పరిశ్రమలో చిన్మయి కలకలం..

‘అందాల రాక్షసి’ ఫేం నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) ఇటీవల ‘చిలసౌ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ రాహుల్‌ రవీంద్రన్‌ భార్య చిన్మయి (Chinmayi Sripada) గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సుపరిచితురాలే. సమంతకు డబ్బింగ్‌ చెబుతుంటుంది చిన్మయి. తమిళ సినీ ప్రముఖుడు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమెతో గొంతు కలిపిన చాలా మంది వైరముత్తు వెనకాల చీకటి కోణం గురించి కథలు కథలుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ ఉదంతంపై తెలుగు రాష్ట్రాల్లో చిన్మయి పేరు మార్మోగిపోయింది. వైరముత్తు ఒక్కడే కాదు, ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. వారందరి బాగోతాలు బయటికి రావాల్సి ఉంది. ‘మీ టూ’ (MeToo) ఓ సునామీలా ఎగసిపడిన దరిమిలా ఎవరి పేరు ఎప్పుడు తెరపైకి వస్తుందో చెప్పలేం. దొరికితేనే దొంగలు. దొరికేదాకా దొరలే.

‘మీ టూ’ – నేరం నాది కాదు..

హత్య చేసినవాడు ఎవడైనా హత్య చేశానని ఒప్పుకుంటాడా.? ‘మీ టూ’ (Me Too India) వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి ఇంతేనేమో. ఆరోపణలు రావడంతోనే పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు. అయితే ‘మీ టూ’ బాధితులు సోషల్‌ మీడియాలో ఉద్యమాన్ని కొనసాగిస్తూనే, న్యాయ పోరాటం ప్రారంభించాల్సి ఉంటుంది. పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అసలు విచారణే ప్రారంభం కాదు. విచారణ జరిగితేనే విషయం న్యాయ స్థానాలకు వెళితేనే దోషులకు శిక్ష పడుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని దోషులు అనేయలేం. వారిపై కేసులు నమోదు కాకుండా నిందితులు అనడమూ సబబు కాదు. ఉద్యమం తన లక్ష్యాన్ని ముద్దాడాలంటే అందుకు తగ్గ ప్రణాళిక ఉండి తీరాలి. పబ్లిసిటీ ఒక్కటీ సరిపోదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group