Table of Contents
Nayanthara O2 Telugu Review.. నయనతార ప్రధాన పాత్రలో ఏదన్నా సినిమా వస్తోందంటే, దానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంటుంది. దానిక్కారణం, ఆమెకున్న ‘లేడీ సూపర్ స్టార్’ అనే ఇమేజ్.
కథల ఎంపికలో నయనతార ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుందో, లేదంటే ఆమెకు అన్నీ అలా కలిసొచ్చేస్తుంటాయోగానీ, ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో కూడిన సినిమాలు ఆమెకు పడుతున్నాయి.
మరి, ‘O2’ పరిస్థితేంటి.? ఆక్సిజన్ పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టినట్లు.?
రోడ్ థ్రిల్లర్ సినిమాలు చాలానే చూసి వుంటాం. ఇది కూడా అలా రోడ్ థ్రిల్లర్‌గానే ప్రారంభమవుతుంది.
ఇరుక్కుపోయిన బస్సు..!
కొండ ప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా, అనూహ్యమైన రీతిలో కొండ చరియలు విరిగిపడతాయి. అందులో బస్సు కూరుకుపోతోంది. కాదు కాదు, మట్టి అలాగే రాళ్ళతో కప్పివేయబడుతుంది.
బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణీకులు అందులోంచి బయటకు ఎలా వచ్చారు.? అన్నది అసలు కథ.
ఎవరెలా నటించారు.? అని ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. నయనతార ‘మమ’ అనిపించేసింది. మిగతా పాత్రధారులంతా అంతే. కొందరు ఓవరాక్షన్ చేసేశారు. ఓ చిన్న పిల్లాడి చుట్టూ కథ నడిపే ప్రయత్నం చేశారు.
Nayanthara O2 Telugu Review.. లాజిక్కులు అస్సలు వెతక్కూడదు
కానీ, ఆ పిల్లాడి వ్యవహారం కూడా గందరగోళమే. అస్సలు లాజిక్కులు వెతక్కూడని సినిమా ఇది. అంతలా బురదలో బస్సు కూురుకుపోయినా, బస్సులోకి కాస్తంత మట్టి కూడా వచ్చి పడదు.
అద్దాలు పగిలిపోవు. బస్సు నుజ్జునుజ్జు అయిపోదు. ముందరి భాగం మాత్రం మట్టితో కొంత మేర కప్పివేయబడుతుంది.

ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగుతాయి బస్సులో కూరుకుపోయినవారిని రక్షించేందుకు. ఆ ఆఫీసర్ అసహనం తప్ప, పని అస్సలు జరుగుతున్నట్టు కనిపించదు.
పెద్దగా బడ్జెట్ పెట్టి ప్రయోజనం లేదనుకున్నారేమో, సినిమా అంతా సింపుల్‌గా తేల్చి పారేశారు. ఎక్కువ భాగం బస్సులోనే ‘నడిచి’పోతుంది. అదేంటో, ఒకాయన బస్సు అద్దాన్ని పగలగొడితే, అక్కడో సొరంగం కనిపిస్తుంటుంది.
చెప్పుకుంటూ పోతే, థ్రిల్లర్ సినిమాలో బోల్డంత కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. పోలీస్ అధికారి, స్మగ్లింగ్‌కి యత్నించడం.. ఇంకో కామెడీ. అసలు ఆ స్మగ్లింగ్ వ్యవహారాన్ని ఈ సినిమాలో ఎందుకు దూర్చారో ఏమో.!
తల బద్దలుగొట్టుకోవాల్సిందే..
ఓటీటీలో ఫ్రీగానే చూడొచ్చునుకుంటున్నారేమో.! తల బద్దలుగొట్టుకోవాల్సి వస్తుంది చివరి వరకూ సినిమా చూడాలనుకుంటే.!
Also Read: తమన్నా తకధిమితోం.! ఫన్ లేదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్.!
సినిమాలో పిల్లాడికి ఆక్సిజన్ అందని సమస్య వుంటుందిగానీ, ఆ సమస్య సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్స్‌కి కలుగుతుంది.. అంత సాగతీత, అంత అర్థం పర్థంలేని కథ, కథనాలు.
ఫైనల్ టచ్.. అసలు నయనతార ఈ సినిమా ఎలా ఒప్పుకుందబ్బా.?